Friday, February 8, 2013

||వితరణలో తస్కరణెందుకు?||

కపిల రాంకుమార్ ||వితరణలో తస్కరణెందుకు?||

వక్ర గతిని కాల చక్రం భ్రమిస్తున్నప్పుడు
రే-బవళ్ళతేడాలేక నిప్పులు వర్షంలా కురుస్తున్నప్పుడు
రేగిన, చెలరేగిన గాలి దుమారం తోడైనప్పుడు,
' సోషలిజం ' అమలు పరుస్తున్నట్లు
అగ్ని ఉక్కు ఖిల్లాల నుండి,
మురికి గళ్ళీలవరకు
ఇంటి తాటాకు కప్పు ఎండి
మంటల్లో - పూరి గుడిసెలు
వాటితో పాటు పెంకుటిళ్ళు
'' శోషలిజానికి '' గురై
సర్వస్వం పోగొట్టుకొని
గట్టిగా ప్రాణాలు బిగపట్టుకొని,
ఆక్రోశించే ఆర్తనాదాలు,
ఆక్రందనలు
అసాధారణ ప్రకృతి వికృతచేష్టకు
బలికావటానికి వెనకాల
ఏయే అదృశ్య శక్తులున్నాయో
యెవరికెరుక???

కాని ఉదారులు, పెద్దలు
పెద్దపెద్ద ఉదరాలున్నవారు
బూర్జువాలు కొందరు, భూస్వాములు కొందరు
దయార్ద్ర హృదయులతో పాటుగా
వెనకపడతామేమోనని వితరణ మొదలెట్టారు
పత్రికలకెక్కటానికి,
తమరు చేసిన పాత పాపాలకు, పాతకాలకు
దానం ప్రత్నామాయ పరిష్కార మార్గమని
సంస్కార (వేష)మని!
బియ్యం సరఫరాలో
పాల క్యూలో, బట్టల పంపిణీలో
ద్రోహం - మోసం
కల్తీ శాల్తీ గల్లంతు ఆనమాయితి!
వితరణలో తస్కరణెందుకు?
సమసమాజ సువ్యవస్థ కోసం
పాటుపడతామని వాగ్దానాలిచ్చి
గోడ చాటు వ్యవహారాలకు చోటిచ్చి,
బొజ్జ పెంచుకునే అప్పలసామీలు జాగ్రత!
ఆర్తులకు అవేదితులకు
సక్రమ పంపిణీ జరిపించండి!
మధ్యలో తమరు భక్షించకుండా
వారిని రక్షించండి!

8.02.2013 రాత్రి 7.45

No comments: