Thursday, February 21, 2013

|| జ్ఞాపకాల యాది -5||

కపిల రాంకుమార్ || జ్ఞాపకాల యాది -5||
యెవరునమ్మినా, నమ్మక పోయినా
గత స్మృతుల యవనికలో దాగున్న
చిన్న రహస్యం, నా అక్షరాల
దూకుడుకు నేపథ్యం
యెన్నో మలుపులు తిరిగింది!
పదో తరగతి అర్థంతరంగా మానేసి
ప్రైవేటు చదువుల ప్రస్థానం
మెట్రిక్ నుండి స్నాతకోత్తర విద్య వరకు
కాలేజి తెలియదు, రాగింగ్ తెలియదు,
మార్క్స్ ని చదవాల్సి రావడం వల్ల
ప్రైవేటుగా వెలగపెడ్తున్న
ఎం.ఏ (తెలుగు) చదువు
కుంటుపడింది
ప్రీవియస్ సీరియస్ గా చదవలేదు
మార్కులు తక్కువే వచ్చాయి!
చందోవ్యాకరణాలు సందు
యివ్వని కారణంగా వెనకబడినా
ఫైనల్ పరీక్ష నా వెనుక బడింది
చాల యిష్టంగా నాటకాలాడటం చేతనో,
చిన్నప్పుడు తాతయ్యగారి వద్ద
తెల్గు శతక పద్యాలు వల్లెవేయటం వల్లనో,
పల్లెటుర్లో రాత్రుళ్ళు
మాయింటివద్ద
గ్రామీణులు చిరుతల రామాయణం
ఆడటంవల్లనో,
ఐచ్చిక ఆంశాలైన
నాటకాలు, శతకాలు, జానపదగేయాల
పత్రాలలో తొంభై సగటు మార్కులు వచ్చీ
ప్రీవియస్ కు తోడు యివ్వక పోగా
తదుపరి కొనసాగింపు కై యేమాత్రం
నన్ను ఆదుకోలేకపోయాయి!
అనే కోపం యిప్పటికీ తగ్గలేదు!
ఐనా తెలుగులో పట్టు నాకు వుంది అని
అనుకుంటే కేవలం చిన్నప్పటి
తాతగారి ఉద్బోధలే కారణం పునాది!
చందస్సు వంటపట్టకపోయినా
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠపు సహచరుల్లో
కొంపెల్ల రామకృష్ణ వాడే
మాత్రా చందస్సు ఆకర్షించింది!
రేగడిమిల్లి సత్యమూర్తి వచ కవిత్వ ధోరణి
మరో ప్రేరణనిచ్చింది!
వచనంలోనూ మాత్రల పోకడలు
అందుకే కనబడతాయి
కేవలం సరదాగా చదివిన
చాత్ర స్నాతక విద్య
కూడ దూరవిద్యే అయింది,
అందుకు మాత్రం కాంటాక్ట్ క్లాసులు విజయవాడలొ
సెవెంత్ ఎడ్వెంచర్ స్కూల్ వేదికయ్యింది!
85 శాతం యువకుల మధ్య ఆ 15 శాతం పెద్దవాళ్ళ లో నేను.
***
ఇంతకీ యీ సోదెందుకంటే
గత నెలలో (జనవరి31 న)
నా చిన్నప్పటి అక్షరాభ్యాసపు చాయాచిత్రం
(నలుపు-తెలుపు) కంటపడింది,
కాని శిధిలావస్థలో యెవరెవరున్నరో గుర్త్రుపట్టలేనంతగా!
అది మదరాసులో 1957 లో తీసినది,
నాకు తెలిసిన వారి చిరునామా
అందిపుచ్చుకుని ఫోనుచేసి
మరీ వివరం రాబట్టాను
చిక్కుముడి వీడింది
ఇద్దరు ఉద్దండులు నా చేత పలకను
అక్షీకరింపచేస్సారట!
ఒకరు రెండు శ్రీల కళ్ళజోడు *
మరొకరు ఇది మల్లెలవేళయని ముందే కూసిన కోయిల **
పట్టరాని ఆనందం
లోకం బాధ
తన బాధ చేసుకొన్న దొకరు
తన బాధను
లోకానికే బాధను చేసిన మరియొకరు!
అందుకే నవ్య నవనీత సమానమైన
పదాల కూర్పుతో పాటు
దారుణాఖండల శస్త్రతుల్యమైన
తీక్షణ విప్లవ భావాలు
సమాంతర కవిత్వాని ప్రేరణై
నన్నిలా నిలబెట్టాయి
తలచుకుంటేనే చెప్పలేని
అనుభూతి నా కంట చెమ్మగా
....కేవలమిప్పుడు ఒక
జ్ఞాపకాల యాదిగా మిగిలింది!

21.2.2013 రాత్రి 7.40
________________
* శ్రీశ్రీ
** దేవులపల్లి
( మా నాన్నగారికి గరికిపాటి రాజారావు, గూడవల్లి రామబ్రహ్మం స్నేహితులు
పుట్టిల్లు సినిమా తీసేటప్పుడు వారితో పనిచే్సారు. మద్రాసులో వుండగా మా యింటికి వింజమూరి లక్ష్మి, సీత, దేవులపల్లి వారితో వస్తూండే వారు. మా మేనత్త సుభద్ర బర్త గారైన వేమరాజు భానుమూర్తి ( అప్పట్లో ఆంధ్ర ప్రభలో చేస్తూవుండేవారు....మామయ్య తరువాత ఢిల్లీ సమాచార పౌర సంబాధాల శాఖ్కు వెళ్ళారు ,పంజాబి బాషనుంది తెలుగు అనువాదాలు చే్సారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద రచనలకు బహుమతి పొందిన వారిలో ఒకరు) పక్కపక్కనే వూండేవారం కాబట్టి వస్తూవూండే వారు. అదీ ఫ్లాష్ బాక్ )

No comments: