Sunday, February 17, 2013

( జానపద గీతం ) ప్రేమతోటె బంధనాలు||

కపిల రాంకుమార్ ||( జానపద గీతం ) ప్రేమతోటె బంధనాలు||

అతడు: విందులొన తందనాలు - సందులోన పందిరేసి
అందమైన సిన్నదన - గంతులేయ వచ్చినావ!
గుండెలదరగొట్టమాకు - అండనీకు కడకంట
ఉండనీకి గడుసోణ్ణి - కండబలమున్నోణ్ణి!

ఆమె: పందెమేసి నెగ్గవోయి - సంకురాత్తిరి సంబరాలు
అందమైన జాతరలో పేమతోటి బందనాలు!
లగ్గమేల దాటకుండ ఒగ్గుకత సెప్పుకుంట
సిగ్గులన్ని మూటకట్టి బగ్గిలోన పెట్టినాను!

అతడు: రేతిరేల యెన్నల్లో రాజనాల పంటసేలో
కావిలేల నక్కకూసే కడుపులోన దిగులాయె!
యేరువాక నాటికల్ల వూరు దాటిపోకుంట
కారుమబ్బు చెర్వుమీన జోరువాన కురిసాది!

ఆమె: అలుగుపడ్డ సెర్వులోన బురదమట్టలేరుతుంటె
యెండ్రకాయ కరిసాది కలుగులోకి దూరాది!
కాలునొవ్వినాదని గట్టుమీన కూకుంటె
పూలు కుక్కు నెపమెట్టి జడకుచ్చు లాగమాకు!

అతడు: కొత్త యింత కాలువెట్టు అత్తమామ మెచ్చుకోను
సత్త చూపు కాపురాన విత్తగాను పదును చేయి!

ఆమె: రోజులేమొ లెక్కపెట్ట ఓపలేని పానమాయె
రాజుకున్న దిగులంత పారదోల వేగిరార!

ఇద్దరు: సల్లగాను సక్కగాను కంటిపాప మాదిరోలె
మింట సూరెసందురోలె జంట బిడ్డ మనకి సాలు!

17-2-2013 ఉదయం 5.30
(అముద్రిత జనపద్యం కావ్యం నుండి)

No comments: