అంతస్సారం బతుకుపోరు!
- అరుణ్‌సాగర్
నిన్ను చదువుతుంటే నీతో మాట్లాడుతున్నట్లే ఉంది. నీదైన మాడ్యులేషన్‌లో
నిన్ను వింటున్నట్టే ఉంది. నువ్వెట్ల ఆలోచిస్తవో అట్లనే రాసినట్లుంది.
అందులోని ఫొనెటిక్ బ్యూటీ గుండె మడికి నీరు పెడుతూనే ఉంది. ఇదంతా నీ
స్నేహంలా నీ ప్రేమలా స్వచ్ఛంగా హాయిగా ఉంది. నీ గాంభీర్యంలా సూటిగా ధాటిగా
ఉంది. లవ్ యూ.
నువ్వయితే నవ్వుతా చెబుతావు, తమ్ములుంగారూ ఎవడికోసం
రాస్తున్నాం రా ఏమి రాస్తున్నాం. ఆర్టు పటాలు కట్టించుకుని ఏ స్టారు హోటలు
గోడకు వేలాడిపోతామ్‌రా అని. అందుకేనా గురూ కవిత్వమంటే సూర్యుడు చంద్రుడు
కాదు నేలతల్లి కదలికంటూ ఓ కొటేషన్ కొట్టావ్. స్టయిల్ పేరుతో క్రాఫ్ట్
పేరుతో కమ్యూనికేట్ కాని కవితలు రాస్తే గొప్పనుకుంటున్నావా మేస్టారూ అయితే
వినండొక ప్రకటన - ఇదే కవిత్వమన్నోళ్లు ఇలాగే ఉంటుందన్నోళ్లు చరిత్ర
చెత్తబుట్టలో కలిసిపోయారు. అందుకే కవీ భావాలు కురిసి వెళ్లు నీకు తోచినట్టు
రాసివెళ్లు. కవీ ఇవీ నీ మాటల్.
మరీ ఇంత కచ్చితంగా మాట్లాడితే ఏం
జేయగల్తం, ఓకే చదువుకుంటం. కానీ గురూ మునుషుల మధ్య ఉన్న అస్పష్టలతో
పోలిస్తే తొక్కలో కవిత్వంలోని అస్పష్టత ఏపాటిది చెప్పు? అయినను నీకే వేయవలె
ఓటు.
వచన కవిత్వాన్ని వండి పెట్టాలని వచ్చాడు గానీ, పుట్టడానికి
గిట్టడానికీ మధ్య కరుసైపోకూడదన్న ఒక్క కోరికే దీనికి బేస్! ఇది శీనన్న
విన్నపం : మనసు తొణికినప్పుడు ఒలికిన సిరాచుక్కలు పిడికెడు ఆసరాతో మన మనసు
కాగితంపై కవిత్వమై పుట్టేందుకు పడిన ఆరాటమిది పోరాటమిది అభ్యుదయగీతమిది.
ప్రతీకాత్మకత శ్రుతి మించినా ప్రత్యేకత సంతరించుకున్న తాజాదనపు పరిమళమిది.
ఇదే పాట ప్రతీచోట ఇలాగే పాడుకుంటున్న శిశువా, నువ్వయినా నేనయినా ఇదే
గీతానికి మరో రెండు పాదాలు పాడుకుంటూ వెళ్లిపోవాల్సిందే. కానీ, అన్నా
నువ్వు ఎక్కడున్నా నీ పాట జనం చెవుల రింగుమని మోగాలిఎంత చల్లని కవిత. ఎంత
స్పష్టమైన కవిత. ఎంత అందమైన కవిత. ఈన నిన్నూ నన్నూ వాళ్లావిడనూ
ప్రేమిస్తున్నట్టు ప్రకటించేందుకు కవిత్వం రాశాడు. ఈ మన్నునూ నాన్ననూ నాన్న
ప్రేమించిన ఎద్దునూ మిస్సవుతూ కవిత్వం రాశాడు. ఈన మట్టిగట్టు, మడిచేలూ
నుంచి మహానగరం వరకూ విస్తరిస్తూ కవిత్వం రాశాడు. ఎంతటి విప్లవాగ్రహం
రగిలించాడో అంతటి రొమాన్సిజం పండించాడు. చెప్పకూడదు కానీ, తలలో తలపు వూల
వలపు వాసన ఆఘ్రాణించాడు. ఏమి ప్రేమాస్పదుడు గురూ. నానమ్మ ధైర్యం, అమ్మమ్మ
ఊపిరిలో జనించిన శక్తి, వాళ్లావిడ ఇచ్చే బీపీబిళ్ళ, కూతురు ఇచ్చే
మరోఛాన్స్... ఈ కవిత్వం ఒక ప్రేమ ప్రకటన! ఈ వాక్యాలు కృతజ్ఞగీతాలు.
భూమంటే ఒక కమోడిటీ అయిపోయిన కాలంలో నేలనూ నేలమీది ఆవరణాన్నీ మానవ
సముదాయంలో భాగంగా చూడగలిగిన ఒక మట్టిమనిషి, అందుకే తను ఛాతీ మీద పూసుకున్న
మట్టినీ, తను ఈదులాడిన చెరువు నీళ్లనీ ఆఖరికి ఎణభై నంబరు వంకాయరంగునేత
చీరనీ తన కవిత్వంలో భాగం చేశాడు. తన జీవావరణంలో ప్రవహించిన సమస్త సంగతులనీ
సాహిత్యంలో రికార్డు చేశాడు. పొలిమేరకీ పడమరకీ మధ్యతెగిపోని పేగులాంటిదేదో
ముడిపడింది. అందుకే పొలిమేర దాటాడో లేదో పోగొట్టుకుంటాడు మనసు కొట్టాడితే
పయనమవుతాడేమో గానీ మట్టివాసన లేక ఉక్కిరిబిక్కిరైపోతాడు. నీకూ నాకూ కొంత
ఆక్సిజన్ కావాలి... మట్టిని తడిపి ఆవిరై పుట్టిన ప్రాణవాయువును మోసుకొచ్చే
కవిత్వం కావాలి. గుండె ఊపిరితిత్తులూ మలినాలను వీడి పరిశుభ్రమై
వికసించాలి. ఇదిగో ఇక్కడొక వాగ్దానం ఆశాదీపం వెలిగిస్తోంది.
చలనశీలి. ప్రవాహం ప్రియమైన జీవనశైలీ సూత్రం. కానీ శీనన్న
రాబర్ట్‌ఫ్రాస్ట్ కాదు. అందుకే - తను కలిసి పయనించే ప్రవాహం వేరు, తను
చెవులు రిక్కించి వినే ప్రవాహసంగీతం వేరు! అది ప్రజోద్యమహోరు క్రాశ్రీ
తల్లివేరు. అందుకే అంతిమంగా ఈ కవిత్వ పంక్తులలో అంతస్సారం బతుకుపోరు!
కొందరు వెంటిలేట్ అవడానికి ఆ చీకటి గదిలో అర్థరాత్రి గుడ్డిదీపం
వెలిగించుకుని కూర్చుంటారు. మరికొందరు అలవోకగా అల్లికలూ కుట్లూ వేసి
కళాతపస్వి కవితారత్నాలై తిష్టవేస్తారు. ఇంకొందరు సందేశాత్మక శిల్పాలు
చెక్కి పీఠాధిపతులై విలసిల్లుతారు. పలువురైతే ఎక్‌స్ట్రా ఆర్టిస్టులై
కేవల - అత్యాధునికులై వేలాడుతారు. (దేన్ని పట్టుకుని?)
అయితే
బాబూ ఇక్కడలా కాదు. ముసుగు వెయొద్దు మనసు మీద! పదునైన ఖడ్గం పట్టుకుని
చీరేయడమే. అందుచేత సోదరులారా మనం ముందే చెప్పుకున్నట్టు శీనుగారి వాక్యాలు
పోజు కొట్టవు. ఎందుకనగా అవి మంచి మాగాణిలో చేసిన అక్షర సేద్యంలో పుట్టాయి.
ఆయనెవరో బాధపడ్డారు : మాయమై పోతున్నడన్నో మనిషన్నవాడూ అని. ఇదిగో ఈ మనిషి
కవిత్వాన్ని చూడండి... పరిచయం చేసుకోండి. స్నేహం చేయండి. మీరు నమ్ముతారు -
మాయమైపోలేదని మనిషన్నవాడు.
మనకి ఆ మాత్రం కామన్‌సెన్స్ లేదు...
ముందుమాటకైనా ముందస్తుమాటకైనా కొన్ని కొటేషన్లు కొట్టాలని! కానీ,... కోట్
చేయాలంటే కోటి. పునర్ మూల్యాంకనము చేయుటకు నీవెవడవు, నేనెవడను? చివరాఖరికి
శీనన్న తమ్ములంగారలము.
ఈ కవిత్వాన్ని ఏవో కొన్ని రిఫరెన్సులతో
తూచి కొలచి ఒక చట్రంలో ఒదిగించి విశ్లేషించలేను. విమర్శకుడను కాను. సాటి
కవిని (మీరొప్పుకుంటే). మిత్రులారా నన్ను ఇకనైనా క్షమించి... ఈ పేజీల్లోని
కవిత్వాన్ని అనుభవించండి!
- అరుణ్‌సాగర్
(మువ్వా
శ్రీనివాసరావు కవిత్వం 'సమాంతర ఛాయలు' పుస్తకావిష్కరణ ఫిబ్రవరి 6న
ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది)
No comments:
Post a Comment