Tuesday, February 19, 2013

గజల్ స్థితిగతులపై కొత్త చూపు

గజల్ స్థితిగతులపై కొత్త చూపు
ఆయా పరిస్థితులూ, బతుకు తీరులో పాటించే విలువలలో అమరిపోయిన ఏ సంప్రదాయమైనా, కళా విషయమయినా రూపు మాసిపోవడం సాధ్యం కాని పని. ఇతరేతర శక్తుల దాడికి గురైనా పరిస్థితుల ప్రాబల్యానికి అణగారిపోయినా వెనుక తట్టు పడిపోవచ్చు. సరైనా స్థితిగతులు రాజుకుంటే తిరిగి మొగ్గ తొడగడం ఖాయం. కళారూపమేదయినా భౌతిక పరిస్థితులలో తగిన ప్రతిపాదిక, జీవితానికి సం బంధం ఉంటే దాని మునుగడ ఎల్లవేళలా ఉంటుంది. కాకపోతే రూపం మారవచ్చు. పోవడిలో మార్పులు చేర్పులు కొనసాగవచ్చు. ఇటీవల హైదరాబాదు నగరంలో పుంజుకున్న ఉర్దూ నాటకం, ముషయిరా, హిందుస్తానీ సంగీత కచేరీలు ఈ పరిణామ క్రమాన్నే సూచిస్తున్నవి. మొగలాయిల పాలనలో ఎన్ని అవాంఛనీయ పోకడలయినా పుట్టవచ్చు. ఆ రాజవంశం పాలన ఫలితం వల్లే భారతదేశానికి గాలీబు వంటి కవితో పాటు ఉర్దూ భాష, తాజ్ మహల్ సంక్రమించాయన్నది ఒక విశ్లేషణ. హైదరాబాదుకు చెందిన నిజాములైనా, ఢిల్లీ రాజులైనా మొగల్ రాజవంశానికి చెందినవాళ్లే. కనుక అది వాస్తవం కావచ్చు. ఉర్దూ సాహిత్యం గజల్ ప్రక్రియ, ముషయిరా సంప్రదాయాల పుట్టుక, వికాసం హైదరాబాదు కేంద్రంగా జరిగింది. ఢిల్లీ చేరుకుని దశదిశలా వ్యాప్తి చెందింది. ఈ వాస్తవాన్ని ఉత్తరాది ఉర్దూ సాహిత్యకారులు దాటవేస్తుంటారు. ఉంటే ప్రస్తావన మాత్రంగా ఉంటుంది. లక్నో సాహిత్య సంస్కక్షుతులపై ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించిన ఉర్దూ చరివూతకారుడు శరార్ నుంచి అకాడమీ ప్రచురణ వరకు ఇదే తంతు. ఈ పుస్తకం ఆ లెక్కలోకి చేరదు. చివరి మొగలాయి ప్రభువు బహుదుర్ షా జఫర్ కాలం నాటి ముషయిరా సంప్రదాయం గురించి దాని లోతుపాతులు, నియమావళి గురించిన రచన ఇది. ఉత్తరాది వారి చరిత్ర రచనా పద్దతులను అధిగమించిన ఆ రచయిత పేరు మిర్జా ఫర్హాతుల్లా బేగ్. ఉర్దూ భాష వికాసంలో హైదరాబాదు పాత్రను పట్టిచ్చుకున్న పుస్తకమిది. ‘పేరు ది లాస్ట్ ముషయిరా ఆఫ్ ఢిల్లీ’.

మొగలాయిల పాలన ఫలితంగా ఉర్దూ భారతదేశానికి సంక్రమించిందన్నది తెలిసిందే. అటువంటి కళాత్మక భాష అయిన ఉర్దూకు, గజల్ ప్ర క్రియ, ముషయిరాల మధ్య గల అంతర్గత, అంతరంగ సంబంధాన్ని అంతే కళాత్మకంగా విశదం చేసే గ్రంథరాజమిది. ఆంగ్లంలో సైతం సొంతరచన వలె కనిపించే ఈ పుస్తకం ఉర్దూ ప్రపంచంలో ప్రామాణిక రచనగా ఉన్నత స్థానం పొందిందని అనువాదకి ఆఖ్తర్ ఖంబర్ అంటారు. రచయిత ఉర్దూ వచన శైలి తనను ఆకట్టుకోవడం వల్లె తాను తర్జుమా కు ఉపక్షికమించినట్టు ఆమె చెబుతారు. ఈ రచన చేయడంలో ప్రేరణ మౌల్వీ కరీం ఉద్దీన్, ఆయన రచన తబ్‌ఖత్- ఉల్- షోరాబు- హింద్ అనే గ్రంథం. 1845 లో ఢిల్లీ దర్బారులో జరిగిన ముషయిరా విశేషాలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. అది చదివిన బేగ్ సాబ్‌కు గజల్, ముషయిరా సంప్రదాయాలను రచన రూపేణా పదిలం చేయాలన్న ఆలోచన తట్టింది. ఇందుకు ‘ఆత్మకత’ రీతిలో రచన చేస్తూ ఉర్దూ భాషావికాసం, గజల్ పుట్టుక, మొగల్ దర్బారు గురించి పరిచయం చేశారు. ఈ క్రమంలో హైదరాబాదు పాత్ర గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో పాత్రదారి రచయిత కాదు. తాను ఎవరి నుంచయితే ప్రేరణ పొందారో ఆ రచయితే పాత్రదారి. అతని పేరు కరీముద్దీన్. కథనమంతా స్వగతం వలె ఉండడంతో ఈ పుస్తకం చదివిన పాఠకులకు తాము ముషయిరాలో పాల్గొన్న అనుభూతి కలుగుతుంది. ఉర్దూ రాకపోయినా గజల్‌ను అర్థం చేసుకోగల్గిన ఆంగ్ల పాఠకులకు ఈ పుస్తకం సరికొత్త సాహితీ కళా ప్రపంచాన్ని పరిచయం కావడం ఖాయం. ఢిల్లీ పతనాన్ని ముషయిరా ముగింపును షమ్మా (దీపపు చెమ్మ) ఆరిపోవడంతో రచయిత సూచిస్తారు. ఇట్లా చెప్పడంలో రాజరికపు, దర్బారు సంప్రదాయాలకు కాలం చెల్లిందని రచయిత భావమని అనువాదకి అంటారు. నిజానికి గజల్ గానంతో వెలిగిన షమ్మా 1857లోనే కాదు, ఆతర్వాత వెలుగుతూ ఆరిపోతూనే ఉంది. ఈ పుస్తకానికి ప్రేరణ అయిన భూమిక 1845, 1848 (పోలీసు యాక్షన్),1979, 2010 వంటి సాంవత్సరిక సందర్బాలు కూడా గజల్, ముషయిరా వంటి కళా ప్రక్రియల ఉత్తాన, పతనాలను సూచిస్తాయి.

1979 నే తీసుకుందాం. దేశ విదేశాలలో ప్రసిద్ధి గాంచిన హైదరాబాదు ముషయిరా ఈ కాలంలోనే ఆగి పోయింది. స్థాపకుడు శంకర్‌జీ. ఆయనే నుమాయిష్ (ఎగ్జిబిషన్ సొసైటీ) స్థాపకుడు కూడ. నిజాం కాలంలోనే ప్రారంభించారు. ఆయన పేరుతో కూడ ఈ కవితా జాతర పేరు గాంచింది. మొత్తం భారత ఉపఖండంలో అంటే ‘పార్టీషన్’ కు ముందు అటు తర్వాత ఉర్దూ భాషా ప్రియులు ఎంతగానో మక్కువ చూపే కవుల కలయిక ఇది. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నుంచి పేరెల్లిన ప్రగతిశీల కవి ఫైజ్ వరకు, సరోజినీ నాయుడు నుంచి కాళోజి, దాశరథి, దేవులపల్లి రామానుజరావు, దాశరథి రంగాచార్య వరకు, సి. నారాయణడ్డి, సామల సదాశివ వంటి ఈనాటి ప్రముఖులు ఆ సభపై ఆసీనులై, కవితాగానం చేసినవాళ్లో, ప్రేక్షకులుగా పాల్గొన్న వాళ్లో అయి ఉంటారు. ఈ ముషయిరాలో అత్యంత ఆకర్షణ శక్తి గల వ్యక్తి షాయర్-ఏ - ఇంక్విలాబ్ మఖ్దూం సాబ్. అటువంటి మానవీయ కళాసంవూపదాయం 1978లో మతం పేర జరిగిన మారణహోమానికి అణగారిపోయింది. పెద్దలు దేవులపల్లి రామానుజరావు, దాశరథి వంటి వారు ఈ ముషయిరా గురించి రాసి ఉన్నారు. సరిగా అదే ఏడు ‘దిల్లీకా ఆఖరి షమా’పేరుతో ఉర్దూ సాహిత్య ప్రపంచంలో పేరు గాంచిన ఈ గ్రంథం ఆంగ్ల తర్జుమా వచ్చింది. అదే హైదరాబాదు నుంచి వెలువడడం మరో వైచిత్రి. రచయిత కూడా ఇక్కడి నివాసే. 1978 వరకు నిర్విరామంగా కొన్ని దశాబ్దాలుగా నడిచిన ఈ ముషయిరా గురించి ఈయాళ్ల కూడా చెప్పుకునే వాళ్లు అనేకం ఉన్నారు. సరిగా మూడు దశకాల కిందట అచ్చయిన ఈ పుస్తకం ఎన్నెన్ని ప్రభావాలు నెరిపిందో తెలియదు. ఎటువంటి ఆలోచనలకు పాదులు వేసిందో అందాజలేదు. కానైతే 2010లో వెలువడినప్పటికీ హైదరాబాదులో స్థితిగతులు మారిపోయాయి. 1979లో ఆరిపోయిన ముషయిరా సంప్రదాయం తిరిగి గత రెండు మూడేళ్ల నుంచి ఊపిరి పోసుకుంది.

గత ఏడాది ఒక వెయ్యి మంది సమక్షంలో అదే నుమాయిష్ హాలులో జరిగింది. మొత్తానికి 1979 నుంచి 2010 వరకు స్థానికంగా ఈ పట్టణపు జన జీవితంలో ఉర్దూ సాహితీ లోకంలో అనేక విపరీతాలు వచ్చిపడ్డాయి. స్వతంత్ర భారతావనిలో 1978 రాజకీయంగా కీలకమయినదే. ఇది చాలా మంది మేధావులు గుర్తించిన అంశమే. మతం, ప్రాంతం, కులం వంటి సామాజికాంశాలు రంగు మారి రంగం మీదికి వచ్చిన గడియ కూడ అదే. అవే అనేక రూపాల వైరుధ్యాలుగా మామూలు జనం జిందగీలోకి చొరబడ్డ కాలం కూడ అదే. మామూలు రీతి, రివాజులను అతలాకుతలం చేసిన గడియ అది. మతం పేరుతో బీజేపీ, భాష పేరుతో టీడీపీ రాజకీయ రంగపు అధికార పీటం పైకి వచ్చిన పూర్వరంగం కూడా అదే. ఇక అప్పటి నుంచి నాలుగైదు ఏళ్ల మునుపు వరకు హైదరాబాదు స్థానిక సంప్రదాయాలు, విలువలన్నీ తీవ్రమయిన నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురై కోస్తా పాలక వర్గాల ఆధిపత్యపు విధానాలకు అణగారిపోయాయి. ప్రభుత్వమే రహస్య ఎజెండాతో పనిచేస్తూ.. హైదరాబాదుతో సహా తెలంగాణ భాషా సంస్కక్షుతులను మట్టుపెట్టడానికి పూనుకుంది. వాటికి కొనసాగింపే ‘హైదరాబాద్ నగరం మాదే అన్న’ వాదన. తెలంగాణ సాహితీ సమరం ముందుకు తెచ్చిన అనేక చర్చల నేపథ్యంలో ఈ పుస్తకం ‘ది లాస్ట్ ముషయిరా’ వెలువడడం ఒక మ లుపు గానే చెప్పవచ్చు. ఈ ప్రచురణల కాలంలోనే తెలంగాణ లో మరో విపరీతం జరిగింది. శతాబ్దాలుగా ఉర్దూ భాషను తమదిగా చేసుకుని ప్రేమించిన స్థానికులు మరో చాపల్యానికి గురయ్యారు. దానిని పరాయిదిగా భావించి ముస్లింలకు, వారి మతానికి చెందినదిగా భావించడం మొదలు పెట్టారు. అదేరకంగా వారు కూడ ఆ భాష తమదేనన్న దురాలోచనలోకి పడిపోయారు. ఈ తరహా పోకడల వల్ల పెద్దలు, కాళోజి, సదాశివ వంటి వారు ఎంతగానో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే బేగ్‌సాబ్ రచనలో చానా ప్రజాస్వామిక వైఖరి కనబరిచారు. ఉర్దూ రచనా సంప్రదాయాలు, కళారీతుల వికాసానికి దక్కన్‌లో జరిగిన వృద్ధిని బాగా చెప్పుకొచ్చారు. ఇందుకు బేగ్‌సాబ్ ఢిల్లీలో పుట్టి హైదరాబాదులో ఉండవల్సిరావడం కావచ్చు. ఉర్దూ, గజల్, హిందూస్తానీ సంగీతం వికాసంలో హైదరాబాదు పాత్ర గురించి వారికి తెలిసింది కొంతే. ఉత్తరాది వారికి తెలిసిందల్లా తొలి దివాస్ (సంకలనం)ను ముద్రించిన కులీకుతుబ్‌షా మొదటి వచన గ్రంథాన్ని ప్రచురించిన వలీ దక్కనీ, ప్రగతిశీల కవి మఖ్దూం మాత్రమే. మొత్తం ఉప ఖండంలో ప్రసిద్ధి గాంచిన రెండు ఆంగ,్ల ఉర్దూ సాహిత్య చరివూతలలో ఒకటి హైదరాబాదు నుంచి వెలువడిన విషయం వారు తాపీగా విస్మరిస్తుంటారు. కానీ ఈ రచయిత ఆ తీరుకు తావు లేకుండా చేశారు.

ముఖ్యంగా హైదరాబాదు, ఢిల్లీ వంటి రాచనగరాలలో గజల్, ముషయిరా,మర్సియా లాంటి ప్రక్రియలు, వాటిని పెంచి పోషించిన దర్బారు, రీతి రివాజుల గురించి చెప్పే గ్రంథమే కావచ్చు. సాంతం చారివూతక చూపు ప్రతిఫలించిన రచన ఇది. అయితే విధించుకున్న పరిమితి 1857 వరకే కావడం వల్ల అప్పటి లోకపు స్థితిగతులకే ఇందులో పెద్దపీట దొరికింది. హైదరాబాదు, ఢిల్లీ అటు తరువాత రాంపూర్, అవద్ సంస్థానాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రచన ఇది. అనాటి ప్రతిఫలనాల సారాంశాన్ని పట్టుకోవడంలో రచయిత విజయం సాధించారు. అట్ట చివర చెప్పినట్టు ఉర్దూ భాషా, సాహిత్య పరిణామాలను సముచితరీతిలో విశ్లేషించారు. మొత్తంగా చూస్తే ఈ గ్రంథం ఉర్దూ భాష, గజల్, ముషయిరాల చరిత్ర కూడ. విస్తక్షుతమైన చదువరి కావడం వల్ల రచకుడు తనదైన స్వతంత్ర వైఖరి తీసుకోవడం వల్ల రచన సాంతం ఉర్దూ గుబాళింపులను ప్రతిఫలించింది. ఒక కవితా ప్రక్రియగా గజల్ క్రమ వికాసాలకు భూమికయిన మూడు రీతులను ప్రతిపాదించారు. ఒకటి దక్కన్, రెండవది ఢిల్లీ, మూడవది లక్నో. గజల్ ప్రక్రియ వికాసంలో దక్కన్ తండ్లాటకు ఆయన ప్రథమ స్థానం ఇచ్చారు. పైగా దాని స్వభావాన్ని నిర్ధారించి ఢిల్లీ, లక్నో రీతులకంటే ఎంతటి విశిష్టమయిందో తేల్చి చెప్పారు. దక్కన్ అంటే ప్రధానంగా హైదరాబాదు నగరంలో పుట్టిన గజల్ ఉర్దూ కవివూబహ్మా వలీదక్కనీ వల్ల ఢిల్లీకి చేరుకుని ఏ రకంగా బలోపేతమయిందో ఈ రచయిత విశదీకరించారు. సాధారణంగా ఉర్దూ సాహితీ ప్రక్రియలే కాదు మొగలాయిల పేరుతో,దక్కన్ పేరుతో చెలామణిలో ఉన్న ఏ ప్రక్రియ అయి నా పశ్చిమాసియాలో అరబీ, పార్శీ సంపర్కంతో పుట్టిందనీ ఉత్తరాది చరివూతకారులు రాయడం పరిపాటి. బేగ్ సాబ్ ఈ వైఖరిని కాదన కున్నా స్థానికతకు సరైన తావే ఇచ్చారు. నిజానికి భారతీయ వలస చరివూతలో దక్కన్‌ను, ఆదివాసీలను విస్మరించడం మామూలే. ఈ రచయిత అందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. కొంత ప్రజాస్వామిక వైఖరి కనబరుస్తారు. పరస్పరం పర్షియన్, అరబీ వంటి భాషా రీతుల ప్రమేయంతో గజల్ ఏమేరకు పుష్టిని పొందిందో చెబుతారు. గజల్ రచనకు అద్యు డుగా అమీర్ ఖుస్రూను చెప్పడం కూడ ఉంది. పార్శీ, ఉర్దూ, తెలుగు భాషలలో ప్రగాఢమైన పట్టుగల డా.సామల సదాశివ వంటి సాహితీవేత్తలు, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ఔత్సాహిక గజల్ ప్రి యులు ఈ వాదనను అంగీకరించరు. ‘గజల్ మినార్లు గోల్కొం డలో లేచాయి’అని అంటారు శేషేంద్ర శర్మ. అందులో కొంత వాస్త వం కూడా ఉంది. కులీకుతుబ్ షా ఉర్దూ దివాస్ ప్రచురించే వరకు గజల్ అనే మాట ప్రచారంలో లేదు. పశ్చిమాసియాలో అరబీ, పార్శీ భాషా సాహిత్యాల ప్రభావంతో పుట్టింది రుబాయత్ అని అమీర్ ఖుస్రూ రాసింది దోహాలనీ, దక్కన్ స్థానిక కవితా, సంగీత, సంప్రదాయాల ప్రభావంతో కులీ రచన వల్ల గజల్ రూపుదిద్దుకుందనీ వాదన ఉంది.

ఈ వాదనల జోలికి పోకుండా హిందూస్తాన్ కళా సంప్రదాయాల ప్రభావం అరబీ, పర్షియన్ భాషా సాహిత్యాలపై ఉందని అదేవిధంగా వాటి ప్రభావం ఉర్దూ భాషా సాహిత్యాలపై పడిందనీ రచయిత చెబుతారు. ఈ తరహా ఆలోచనతో ఎవరైనా అంగీకరిస్తారు. ఇదొక ప్రజాస్వామిక అవగాహన. ఇప్పటికీ గజల్ దక్కన్‌లో పుట్టిన కవితా విశేషమన్న అంశాన్ని ఉత్తరాది ఉర్దూ రచయితలు ససేమిరా ఒప్పుకోరు.దక్కన్, ఉత్తరాది ఉర్దూ సాహిత్య కవితా సంప్రదాయాలపై గాఢ పరిచయమున్న బేగ్‌సాబ్ తటస్థమయిన, ప్రజాస్వామికమైన వైఖరి తీసుకోవడం విశేషం. దక్కన్‌లో ముస్లిం రాజవంశాల ప్ర భావాన్ని పరిగణలోకి తీసుకుంటే ఉర్దూ సాహిత్య చరివూతకారుల ఢిల్లీ కేంద్రిత వైఖరి కొంతైనా తగ్గి ఉండేది. బేగ్‌సాబ్ ఢిల్లీ లో జరిగిన ఒక ముషయిరా ఆధారంగా ఈ రచన చేసినప్పటికీ చరిత్రకు సంబంధించినంత వరకు వాస్తవికమయిన వైఖరి తీసుకున్నారు. ఢిల్లీ పెత్తనాన్ని పక్కన పెట్టేశారు. ముషయిరా అనేది ఉర్దూ కవితా సంప్రదాయాలకు, సంబంధించినంత వరకు కవి సమ్మేళనమో, కవి సభోకాదు. అదొక కళావిన్యాసం. ఇది కేవలం ఉర్దూ బాషా సాహిత్యాలకే పరిమితం. దీనినొక విశేషంగా కూడ భావించక్కరలేదు. ప్రతి రచనా సంప్రదాయంలో ఈ తరహా అనేక సంప్రదాయాలు కనిపిస్తాయి. ముషయిరా నిర్వహణకు సంబంధించిన నియమాలు, సంప్రదాయాలపై ఈ పుస్తకంలో వివరమయిన చర్చ ఉంది. ఉర్దూ చదవరాని పాఠకులకు ‘ద ముషయిరా’ పేరుతో ఉన్న భాగం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సారాంశంలో ఒక కళా విశేషంపై చర్చ అన్నమాట. ఒక కళ నిర్వహణా తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చిత్రించడం ఈ రచనా విశేషం. ఈ పుస్తకం మొత్తంలో ప్రధానమయిన భాగమిదే. గజల్‌కు ముషయిరా శరీరం వంటిది. ఈ రెండింటిలో దేన్నించి దేనిని విడదీసినా మొత్తం ప్రక్రియ నిర్జీవమే. అయితే రచయిత వీటికి ఆత్మవంటిదయిన హిందూస్తానీ సంగీతాన్ని విస్మరించారు. గజల్, ముషయిరా, గాత్ర, వాయిద్య సంగీతం కలయిక వల్లే ప్రక్రియ మొత్తంగా అర్థవంతమౌతుంది. ఒకప్పుడు 1960 వరకు హైదరాబాదు నగరంలో గజల్ గానా బజనాలో రాత్రిళ్లు రాజుకునేవని స్థానిక పెద్దలు చెబుతారు.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడి హైదరాబాదు నగరం సీమాంధ్ర క్యాస్టిస్టు, ప్యూడలిస్టు పోలీసు అధికారుల చేతులలోకి వెళ్లడంతో వారి దాష్టికాల వల్ల ఆ సంప్రదాయం సైతం అడుగంటి పోయింది. స్థానిక జీవన రీతిపై ఏమాత్రం ఖాతరు లేకపోవడంతో జరిగిన విపరీతం ఇది. గత నాలుగైదేళ్లుగా పరిస్థితి మారింది. ఇంతేకాదు హైదరాబాదు నగరంలో కులీకుతుబ్‌షా కాలం నాటి సంప్రదాయాలతో ముషయిరాను పునర్జీవింప చేసే ప్రయత్నమూ కొనసాగుతున్నది.1956 వరకు ఎంతో జనాదరణ పొందిన ఘరేలు, మెహిఫిల్, (ఇంటింట గజల్ సంగీత కచేరీ) భూపాళం (తెలుగు, ఉర్దూ, హిందీ గీతాలాపన, భజనావళి) సంప్రదాయం అటు తరువాత కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా పెరిగిన సాంకేతికత వల్ల, పెరిగిన సంగీత సోయి వల్ల తిరిగి మొగ్గ తొడిగింది. వారాంతాన, నెలకోసారి పాతబస్తీ ఇండ్లల్లో ఈ కచేరీలు కొనసాగుతున్నట్లు తెలిసింది.ఆంగ్లంలోనయినా ఒక కొత్త కళా సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ పుస్తకం ఇందుకు మరింత దోహదం చేస్తుందనీ కచ్ఛితంగా చెప్పవచ్చు. పుస్తకం ఆఖరిలో రచయిత పొందుపరిచిన బిబ్లియోక్షిగఫి, నోట్సు రచయిత పడ్డ కష్టాన్ని, చిత్తశుద్ధిని, భాషా సాహిత్యాల పట్ల ప్రగాఢ అభినివేశాన్ని అందుకు తగ్గ గౌరవాన్ని తెలియచేసేవి. ఆఖరికి కొసమెరుపు ఏమిటంటే నిజాం మునిమనుమడు రెడ్ హిల్స్‌లో ఉంటారు.ఆయన ఇంట్లో ఇప్పటికీ మొగల్,ఆసఫ్ జాహీల కాలం నాటి సంప్రదాయంలోనే ముషయిరా జరుగుతుందట. అందులో మీర్ మహబూబ్ అలీఖాన్ తన దర్బారులో ముషయిరా సందర్భంగా ఉపయోగించిన షమ్మానే ఉపయోగిస్తారట!
-ఎస్. జగన్‌డ్డి

No comments: