Wednesday, February 20, 2013

| ఉగ్రవాద ఫలితాలింతేనా?

కపిల రాంకుమార్ || ఉగ్రవాద ఫలితాలింతేనా? ||

సర్వ జనుల సుఖముకోరి - వేదం ఘోషించినా
హాలికుల స్వేదంతో - నేల పునీతమైనా
సైనికుల రుధిరంతో - సరిహద్దులు సరిద్దినా

నిర్మాణం కుంటుపడె
నిర్వాకం తగులబడె
నిర్యాణం వెంట తరుమ
నిష్క్రమించు తీరమై
ప్రజాస్వామ్య వృక్షానికి
చీడపురుగు మాదిరిగ
పెద్దలను హతమార్చె
పిదప బుద్ధి హెచ్చినది!

హింసవీడి దారి మార్చి
నేటికైన కళ్ళుతెరచి
జనజీవన మార్గానికి
మనిషిలాగ మారండి!

ఎందుకంటె........

ఎదలు కరిగి గిరులు కూలె
మతులు చెదరి మందగించె !
అవీదన ఆక్రందన
యెల్లెడల వ్యాపించె !
సర్వజనుల మనసు నలిగి
దీనంగా విలపించె !

రక్తంతో స్నానమాడు - ఉగ్రవాద రాచక్రీడ
కత్తులతో రాజ్యమేల యింత కన్న దారిలేదా?
ఈ మాదిరి హత్యలతో యేలాభం పొందుతారు?
దొంగచాటు దెబ్బలతో పొందలేరు అధికారం!

పావురాల నట్యాలను ఈర్ష్యతోన త్రుంచుటేల?
పావులుగా మారిపోయి విధ్వంసం చేయనేల?
నేల విడిచి సాములా నేతల తల తెంచనేల?
తలపులు మార్చకుండ తలుపులు మూయుటేల!

నలుగురిలో కలువలేక - నలుగురిని కలుపలేక
పిరికితనపు చేష్టలతో - హతమార్చె రాచక్రీడ
గెలువబోదు యేనాడు - కలకాలం మనబోదు!

అందుకే......

స్వేచ్చగాను పావురాలు గగనంలో విహరింప
స్వచ్చమైన ప్రకృతికి నాందిపలుక కదలండి!
ఈ కత్తులు వదలండి - తుత్తునియలు కాకుండ
ఆ కక్షలు మానండి - శాంతి బాట నడవండి!

20.2.2013 మధ్యాహ్నం: 12.26

No comments: