Monday, February 4, 2013

తస్మాత్ జాగ్రత!

కపిల రాంకుమార్ ||తస్మాత్ జాగ్రత! ||

పడావు పదిన పొలంలా
యేపుగా పెరిగిన గుబు ముళ్ళపొదలా
పగ్గాల్లేని పరువాలు
యింగిత జ్ఞానం నశించి ఒడిగట్టుతున్న అత్యాచారాల్లా
హత్యలతో పాటు పెరిగిపోయిన బ్రూణహత్యల్లా
అంతులేని అవినీతి యెల్లడల వ్యాపించింది!
యే రంగం మినహాయింపు కాదు!
ఆఖరికి అంతరంగాలు సైతం అతీతం కాదు!
సర్కారు సుభాషితాలు వల్లించడానికే పరిమితమై,
పెరుగుతున్న ఆగడాలు అరికట్టే కనీస నైతికత కోల్పోయి,
చర్యలు తీసుకోకపోగా, వారికే వత్తసు పలుకుతూ
సపర్యలు - పరిచర్యలు చేస్తూ
అగ్నికి ఆజ్యం తోడైనట్లు ప్రజాస్వామ్య సూత్రాలు
స్థానభ్రంశం చెంది విరుగుట పెరుగుట కొరకేనన్నట్లు
మంగళ్సూత్రం కట్టుకుని
అవినితితో కలకాలం కాపురం సాగిస్తోంది!
**
కొన్నిసా మెతలు నిజమౌతున్నా
వాస్తవాలను అంగీకరించలేని వ్యవస్థైంది!
పైపెచ్చు సామెతల మీదే ఆగ్రహించేలా
వ్యవహరిస్తోంది, కులాల మతాల ముసుగులో
పబ్బం గడుపుతూ
సదరు అనుభవాలే త్రోసిరాజనటం,
మంచి మాటలకు సైతం వక్ర భాష్యాలు చెప్పటం,
నే చెప్పింది చెయ్యమంటూ, నే చేసేది చెయ్యొద్దు అంటోంది!
**
మనం శాంతమూర్తులం - యేమీ పట్టించుకోం!
పోరాటం చేసే వాళ్ళు యెలాగూవున్నారనే నిర్లిప్తత!
కష్టాలు, నష్టాలు భరిస్తూనే వుంటాం!
పల్లెత్తు మాట అనం!
అనుభవించడానికే సిద్ధపడ్డాం!
క్షుద్బాధలకు ' రోటీ' కరువైనా
ఆ బాధల ' రోటిలో ' తలదూర్చి రోకటిపోటుకు వెరువని వాళ్ళం!
మనమెవరో మనకే తెలియదు
తిరిగబడాలా?
పారిపోవాలా?
కూరుకుపోవlలా?
మీమాంసలో నలిగిపోయే జాతికి వారసులం
(రంథి సోమరాజు అన్నట్లు)
అలాగేవుందామా?
' సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్లా '
ఐక్యంగా పోరాడమన్న శ్రీశ్రీ దారి పడదామా!
పడావు పొలాలంలా ఉందామా!
తేల్చుకోవాల్సిన సమయం
మేలుకోవాల్సిన ఘడియ
వచ్చింది!
తస్మాట్ జాగ్రత! జాగ్రత!

4.02.2013 ఉదయం 10.10

No comments: