6, నవంబర్ 2012, మంగళవారం

అనువాద కళ

రచన : వల్లంపాటి వెంకట సుబ్బయ్య

(వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మదనపల్లి కళాశాలలో ఉపన్యాసకులు. కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. “నవలా శిల్పం”, “కథాశిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” ఈ జనవరిలో సాహిత్య ఎకాడమీ అవార్డ్‌ను కూడా పొందింది. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలు అనువదించారు. తస్లీమా నస్రీన్‌ రచించిన “లజ్జ”, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ (E.H. C

arr) రచించిన “చరిత్ర అంటే ఏమిటి…?” ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.)

రచన కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల మీద సాము. ఒక భాష వచ్చిన ప్రతీవాడూ రచయిత కాలేడు. అలాగే, రెండు భాషలు వచ్చిన ప్రతీవాడూ అనువాదకుడు కాలేడు. కానీ అనువాదకునికి రెండు భాషలు ” బాగా ” వచ్చి ఉండక తప్పదు. అందులో ఒకటి మాతృభాష. రెండవది దాదాపు కృత్రిమంగా నేర్చుకొన్న ” పరాయి ” భాష. ఎవరైనా మాతృభాషలోకి మాత్రమే అనువాదం చెయ్యగలరని చాలా మంది నమ్ముతారు. ఇందులో సత్యం లేకపోలేదుకానీ, ఈ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. అలాంటి మినహాయింపులుగా పి. వి. నరశింహారావు హిందీలోకి అనువాదం చేసిన ” వేయిపడగలు ” నూ, పుట్టపర్తి మళయాళంలోకి అనువదించిన ” ఏకవీర ” నూ, పి. ఎల్‌ రెడ్డి హిందీలోకి అనువదించిన తెలుగు కధలనూ, ఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌ ఇంగ్లీషులోకి అనువదించిన తెలుగు కధలనూ చెప్పుకోవచ్చుననుకొంటాను. వీరి అనువాదాలు అంత బాగా ఉండటానికి కారణం బహుశా మనం పరాయి భాషలనుకొంటున్నవి వీరికి మరీ అంత ” పరాయి” వి కాకపోవటమేనేమో !

ఇప్పుడు భాష తెలియటం అంటే ఏమిటో ఆలోచిద్దాం. భాష ఆ భాషను మాట్లాడే ప్రజల సంస్కృతిలో ఒక ప్రధానమైన అంశం. అంతే కాదు ఆ సంస్కృతికి మాధ్యమం కూడా. కాబట్టి రెండు భాషలు తెలిసి ఉండటం అంటే రెండు సంస్కృతులు తెలిసి ఉండటం. రెండు జీవిత విధానాలు తెలిసి ఉండటం. భాషకు జీవం నుడికారం. ఏ భాష నుడికారం, ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలో నుంచీ, భౌగోళిక పరిస్థితుల్లోంచీ, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల్లోంచీ, ఆట పాటల్లోంచీ ఉద్భవిస్తుంది. ఉదాహరణకు, ఎస్కిమో భాషలో రకరకాలైన మంచును సూచించటానికి దాదాపు ఇరవై పదాలున్నాయట. మరాఠీ భాషలో యుద్ధరంగం ఆధారంగా పుట్టిన నుడికారం ఎంతో ఉందిట. ఇంగ్లీషు భాష నుడికారం వారికి ఆటలన్నా,నౌకాయానమన్నా ఉన్న ఇష్టంలో నుంచీ ఎంతో పుట్టింది. మన భాషలో చాలా నుడికారం మన వ్యావసాయక జీవితంలోనుంచీ పుట్టింది. భాషను తెలుసుకోవటమంటే దాని నుడికారం యొక్క మూలాలను తెలుసుకోవటం. వీటిని తెలిసి ఉండటం లేదా తెలుసుకోవాలని ఉండటం అనువాదకుని మొదట అర్హత.

అనువాదకుని రెండవ అర్హత మూలగ్రంధంలోని విషయాన్ని గురించి నిజమైన ఆసక్తి ఉండటం. అందరూ అన్ని విషయాలనూ అనువదించలేరు. ఆసక్తి లేని విషయాన్ని అనువదిస్తే, అది యాంత్రికంగా, నిర్జీవంగా ఉండక తప్పదు. వస్తువుకు సంబంధించిన మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది. ఒకే వస్తువును అనేక దృక్పధాలనుంచీ చర్చించ వచ్చు. ఉదాహరణకు భారతీయ తత్వ శాస్త్రాన్ని గురించి గోళ్వాళ్కర్‌ లాగా రాయవచ్చు. రాధాకృష్ణన్‌ లాగా రాయవచ్చు. దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ లాగా రాయవచ్చు. మూలగ్రంధ రచయిత అందులోని విషయాన్ని తనకు నచ్చిన, తాను నమ్మిన భావజాల ధృక్పధం నుంచి చర్చించి వుంటాడు. మూలగ్రంధ రచయిత భావజాల ధృక్పధం మీద కనీసం సానుభూతి కూడా లేకుండా ఆ గ్రంధాన్ని అనువాదం చేయటానికి అంగీకరించకూడదు.

అనువాదం ప్రారంభించటానికి ముందుగానే భాషకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన నిర్ణయాలను అనువాదకుడు తీసుకోక తప్పదు.

అనువాదకుడు తాను చేయబోతున్న అనువాదంలో వాడదల్చుకున్న భాషాస్థాయిని గురించి ఒక ఖచ్ఛితమైన నిర్ణయానికి రావాలి. ఒకే భాషను అనేక స్థాయిలలో రాయవచ్చు. ” భాషాస్థాయి ” పదజాలానికి మాత్రమే కాకుండా వాక్యనిర్మాణానికి కూడా సంబంధించిన విషయం. భాషా స్థాయిని గురించి నిర్ణయం తీసుకోటానికి పూర్వం, మూలగ్రంధం విషయాన్ని గురించి, మూలగ్రంధం ఎవరికోసం ఉద్దేశించబడిందో ఆ పాఠకుల్ని గురించీ, అనువాదం ఎలాంటి పాఠకుల కోసం చేయబడుతోందీ వారిని గురించీ, అనువాదకునికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇది ఇంగ్లీషు నుంచి శాస్త్ర గ్రంధాలను అనువదించేటప్పుడు మరీ చిక్కు సమస్యగా మారుతుంది. దాదాపు ఆరులక్షల పదసంపద ఉన్న ఇంగ్లీషు నుంచి పాతికవేలు వ్యావహారిక పదజాలం కూడా లేని తెలుగులోకి శాస్త్ర గ్రంధాలను అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అనేక పదాలనూ, పద బంధాలనూ సృష్టించుకోవలసి వస్తుంది. అవి తాను ఎన్నుకొన్న భాషాస్థాయిలో ఉండేలా జాగ్రత్త పడటం కత్తి మీద సాము వంటి క్లిష్టమైన పని.

భాషకు సంభందించిన మరొక ఇబ్బంది కంఠస్వరం. సమర్ధుడైన రచయిత శైలికి ” కంఠస్వరం ” ( Tone ) ఉంటుంది. అది రచయితకూ, విషయానికీ మాత్రమే కాకుండా, రచయితకూ, పాఠకునికీ మధ్య ఉన్న సంబంధాన్నివ్యక్తం చేస్తుంది. గొప్ప గాయకుని గొంతులో ఎన్ని భావాలు పలుకుతాయో, సమర్ధుడైన రచయిత శైలిలో అన్ని భావాలు పలుకుతాయి. అందులో కోపం ఉండవచ్చు, కసి ఉండవచ్చు, హాస్యం ఉండవచ్చు, వ్యంగ్యం ఉండవచ్చు.ఇంకా ఎన్నో భావాలూ, భావమిశ్రమాలూ ఉండవచ్చు.మూలరచయిత కంఠస్వరాన్ని పొరపాటు పడకుండా గుర్తించి దాన్ని లక్ష్య భాషలో వ్యక్తం చేయగలిగిన రంగు, రుచి,వాసన ఉన్న పదాలనూ, వాక్య విన్యాసాలనూ జాగర్తగా ఎన్నుకోవాలి.

వీటికితోడు మూలగ్రంధాన్ని అనేకసార్లు చదివి జీర్ణం చేసుకోవటం, గ్లాసరీని అనువాదం ప్రారంభించటానికి పూర్వమే తయారు చేసుకోవటం, పదప్రయోగస్థాయిని తరచుగా వెనుదిరిగి చూసుకుంటూ ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సాపు రాసే పనిని తానే స్వయంగా చేయటం, అనువాదకుడు తీసుకోవలసిన మరికొన్ని ఇతర జాగ్రత్తలు. అనువాదకుని చివరి అర్హతను గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సృజనకు భావోద్రేకం, Inspiration అవసరమేమో కానీ అనువాదానికి పరిశ్రమే ప్రాణం. పరిశ్రమ చేసే ఓపిక లేనివాడు మంచి అనువాదకుడు కావటం అసాధ్యం.

అనువాద కళను గురించి ఇంగ్లీషులో కొన్ని మంచి పుస్తకాలు వచ్చాయి. 1791లోనే అలెగ్జాండర్‌ ఫ్రేటర్‌ టైట్లర్‌ అన్న వ్యక్తి “Essays on the principles of Translation ” అన్న గ్రంధాన్ని ప్రచురించాడు. ఆ తరువాత థియొడర్‌ సేవరీ, రెనెటో సోగియోలీ వంటి విద్వాంసులు కొన్ని గ్రంధాలు రాసారు. ఈ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పాశ్చాత్యదేశాల్లో భాషాశాస్త్రం ప్రతిష్ట బాగా పెరిగింది. దీని ప్రభావం అనేక పరిసర రంగాలమీద ప్రసరించటం ప్రారంభించింది. జె. సి. కాట్‌ ఫోర్డ్‌ లాంటి భాషాశాస్త్రవేత్తలు ఈ రంగంలో చాలా కృషి చేసారు. అంతవరకూ ” కళ ” అని అందరూ భావిస్తున్నఅనువాదం ” శాస్త్రం ” గా పరిణామం చెందటం ప్రారంభించింది. కంప్యూటర్లను అనువాదాలకు కూడా ఉపయోగించుకోవచ్చునన్న అభిప్రాయం కూడా బలం పుంజుకొంటోంది. కానీ తెలుగులో అనువాదం మీద మంచి గ్రంధాలు ఇంతవరకూ రాలేదు. రా. రా. రాసిన ” అనువాద సమస్యలు “, పత్రికల వారూ, పత్రికారచయితలూ తయారు చేసిన కరదీపికలూ తప్ప తెలుగులో అనువాదాన్ని గురించి సమగ్రమైన, సాధికారమైన గ్రంధం రాలేదు.

000 000 000 000

వాదించుకోవటంలోనూ, అనువదించుకోవటంలోనూ తెలుగు వారు నిష్ణాతులు అని ఎవరో అన్నారు. వాదించుకోవటం మన రాజకీయ వ్యసనమైతే, అనువదించుకోవటం మన సాహిత్య వ్యాసంగం కావచ్చు. వాస్తవానికి తెలుగు సాహిత్యం అనువాదాలతోనే ప్రారంభమైంది. శతాబ్దాలపాటు అనువాదాలతోనే సంతృప్తి పడుతూ వచ్చింది.మన మహా కవుల్లో చాలా మంది కధనూ, కధా నిర్మాణాన్నీ, పాత్రలనూ, వారి మనస్తత్వాలనూ, ప్రాపంచిక దృక్పధాన్నీ, భావాలనూ, ఆలంకారికతనూ, కొంత వరకు శైలినీ మూలగ్రంధకర్తల నుంచి గ్రహించిన గొప్ప అనువాదకులే. అందుకు మనం సిగ్గు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అత్యంత ప్రాచీనమైన సంస్కృత, గ్రీక్‌ ,లాటిన్‌ సాహిత్యాలవంటివి తప్ప ఇతర సాహిత్యాలలో చాలా భాగం అనువాదాలతోనే ప్రారంభమయ్యాయి.

20వ శతాబ్దంలో తెలుగు వారు అనువాదం పట్ల గొప్ప శ్రద్ధను చూపించారు. ప్రేంచంద్‌ , టాగోర్‌ , శరత్‌ ,గోర్కీ, రాహుల్‌ మొదలైన ఎందరో మహా రచయితలు తెలుగువారైపోయారు. 1930లలో అభ్యుదయ సాహిత్యోద్యమంతో ప్రారంభమైన శాస్త్రగ్రంధాల అనువాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లీషులో తగినంత ప్రావీణ్యం లేని తెలుగు రచయితలు అనువాదాల ద్వారానే ప్రపంచ సాహిత్య ధోరణులనూ, ఆలోచనా ధోరణులనూ ఎంతోకొంతగా అందుకోగలుగుతున్నారు. ” విపుల” వంటి అనువాద కధాసాహిత్య పత్రిక తెలుగులో మాత్రమే ఉందేమోనని నా అనుమానం.

000 000 000 000 000 000 000

అనువాదకుడుగా నా అనుభవాలను గురించి చెప్పేటప్పుడు నన్ను గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.

నేను పద్యాలతో రచన ప్రారంభించాను. పద్యాలూ, గేయాలూ మాని కధలు రాయడం ప్రారంభించాను.కధలు రాస్తూనే మూడు నవలలు రాసాను. ఆ తరువాత రచనమీద ఆసక్తి కలిగి చదువుకుంటూ ఉండిపోయినకాలంలో నాకు తెలియకుండానే అనువాదకుణ్ణయ్యాను. 1981లో అనుకుంటాను హైద్రాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (H.B.T.) ప్రారంభమైంది.దాని ట్రష్టీలలో ఒకరైన సి.కె. గారు అనువాదం చేయించటానికి ఏమైనా మంచి పుస్తకాలు సూచించమన్నారు.నేను సూచించిన రెండు పుస్తకాల్లో E. H. Carr రాసిన What is History ? ఒకటి. H.B.T. వాళ్ళు ఆ పుస్తకాన్ని అనువదింపచేయటానికి తీర్మానం చేసి,అనువాదకుడి కోసం వెదకటం ప్రారంభించారు.కొందరు ఆ పుస్తకాన్ని అనువాదం చేయటం అసాధ్యమన్నారు. మరి కొందరు వృధా అన్నారు. చారిత్రకశాస్త్రం (హిస్టరియోగ్రఫీ) మీద ఆసక్తి ఉండి, ఇంగ్లీషు రాని వాళ్ళు ఎవరూ ఉండరన్నారు. చారిత్రక శాస్త్రం మీద ఆసక్తి ఉండి, ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు మూలగ్రంధాన్ని చదువుకుంటారు గానీ, అనువాద గ్రంధాన్నిచదవరని వాదించారు. మొత్తం మీద What is History ? కి అనువాదకులు దొరకలేదు. ” నువ్వు సూచించావు కదా, నువ్వే చేస్తావా ?” అన్నారు సి. కె. గారు. అంగీకరించాను. సంవత్సర కాలం నా విశ్రాంతి సమయాన్నిఆ అనువాద కార్యానికే వినియోగించాను. అర్ధంకాని విషయాలను తెలిసిన స్నేహితుల వద్ద తెలుసుకొన్నాను.సంవత్సరం తరువాత అనువాదం పూర్తయింది.

అనువాదం జరుగుతుందగా నా దృష్టికి రాని స్పష్టంగా రాని రెండు లోపాలు నా అనువాదంలో కనిపించాయి.మొదటిది మూలగ్రంధ పాఠకులూ, తెలుగు అనువాద గ్రంధం పాఠకులూ ఒకేస్థాయికి చెందిన వారు కాకపోవటం. కార్‌ గ్రంధం కేంబ్రిడ్జి హిస్టరీ సొసైటీలో ఇచ్చిన ఉపన్యాసాల సంపుటం. శ్రోతలందరూ చరిత్ర విద్యార్ధులూ, చరిత్ర ఉపాధ్యాయులూ కావటం చేత కార్‌ చారిత్రక సంఘటనలనూ, తాత్విక సిద్ధాంతాలనూ ఎలాంటి వివరణా లేకుండా ఉటంకిస్తాడు. తెలుగు పాఠకుల్లో తొంభై శాతం మంది కేంబ్రిడ్జి హిష్టారికల్‌ సొసైటీస్థాయి వారు కారు. అందుచేత Foot notes ఇవ్వాలనుకున్నాను. కానీ,ప్రచురణ కర్తలు ససేమిరా వద్దన్నారు. Foot notes ఉన్న పుస్తకాలను సాధారణ పాఠకులు చదవరన్నారు.అందుచేత అనువాదాన్ని ఒక అతి సాధారణ పాఠకుడికీ, ఒక చరిత్ర విద్యార్ధికీ ఇచ్చి, తాము నోట్సు అవసరమని భావించే పదాలకింద గీతలు గీచి పంపమన్నాము. వాటిని సేకరించి రెండు భాగాలుగా విభజించాను.మొదటి వర్గం text లోకి వెళ్ళాల్సిన notes . రెండవ వర్గం గ్రంధం చివర ఇవ్వాల్సిన నోట్సు. ఈ విధంగా కేంబ్రిడ్జి హిష్టరీ సొసైటీ స్థాయి గ్రంధాన్ని సాధారణ తెలుగు పాఠశాల స్థాయికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాను.

రెండవలోపం మరింత ప్రమాదకరమైనది. అనువాదం పూర్తయిన తరువాత మూలాన్నీ, అనువాదాన్నీ మరొకసారి చదివి చూసి దిమ్మెరపోయాను. మూలగ్రంధంలోని tone ను పట్టుకోవటంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. మూలంలో హాస్యవ్యంగ్య కంఠస్వరం అనువాదంలోకి రాలేదు. తెలుగు అనువాదంలోని కంఠస్వరం matter of fact గా neutral గా ఉంది. అందుచేత మళ్ళీ సాపు రాశాను. మూలంలోని కంఠస్వరాన్ని తెలుగు అనువాదంలోకి తీసుకు రావటానికి ప్రయత్నించాను. ఇంత శ్రమపడ్డా ” చరిత్ర అంటే ఏమిటి ?” ని వ్యాపార నవల చదువుతున్నంత అశ్రమంగా చదువుకోటానికి వీలుకావటం లేదని కొందరంటుంటారు. వారికి నా సలహా ఒక్కటే మూలగ్రంధాన్ని చదువుకోమని.

” చరిత్ర అంటే ఏమిటి ?” ఇప్పటికి మూడు ముద్రణలు పొందింది. దాదాపు పదివేల కాపీలు అమ్ముడైంది. చరిత్ర విద్యార్ధులు మాత్రమే కాకుండా రచయితలు ఆ పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదివారు.

” చరిత్ర అంటే ఏమిటి ?” మొదటి ముద్రణ ప్రతులు ఆరు నెలల్లో చెల్లిపోయాక వెరె గార్డర్‌ చైల్డ్‌ రాసిన ” What Happened in History ? ” ని తెలుగులోకి తేవాలని నిశ్చయించాం. ఈ రెండు పుస్తకాలూ ఒకసెట్‌ లాగా పరస్పర పూరకాలుగా ఉంటాయని HBT వారు భావించారు. ఈ పుస్తకాన్ని అనువదించటానికి నేను చాలా శ్రమ చేయ వలసి వచ్చింది. ఈ పుస్తకంలో గార్డర్‌ చైల్డ్‌ ఫిజిక్స్‌ , కెమిస్ట్రీ, గణిత శాస్త్రం మొదలైన అనేక శాస్త్రాలు చారిత్రక పరిణామ క్రమంలో ఎలా అభివృద్ధి చెందిందీ వివరంగా చెప్పాడు. ఆ శాస్త్రాలను గురించి నాకు సరైన జ్ఞానం లేకపోవటంచేత, తెలిసిన మిత్రులనుంచి ఆ సిద్ధాంతలను గురించి తెలుసుకొన్నాను. అలాగే పురాతత్వ శాస్త్రంలో ఉపయోగించే విధానాల గురించీ,ముఖ్యంగా కార్బన్‌ టెస్టుల్ని గురించీ తెలిసిన వారి వద్దనుంచీ తెలుసుకొన్నాను.

ఆ తరువాత నేను అనువదించిన సోయింకా నొబెల్‌ బహుమతి అంగీకరణోపన్యాసం నాకు అసంతృప్తినే మిగిల్చింది. ” నల్లవాడు ఈ వేదిక నెక్కకుండా తెల్లవాళ్ళైన మీరు ఎన్ని కుట్రలు పన్నారు. కానీ మీరు ఆపగలిగారా? చూడండి మిమ్మల్ని చీల్చి చెండాడి నొబెల్‌ బహుమతిని అందుకొంటున్నాను ” అన్న సోయింకాకసి బాగా నా అనువాదంలోకి రాలేదనుకుంటాను. సోయింకా ప్రస్తావించిన కొన్నిరెఫరెన్సులు కూడా నాకు అందలేదు. స్త్రీవాద దృక్పధం పై క్రిస్‌ బ్రెజియక్‌ రాసిన ” ప్రపంచచరిత్ర” ను అనువదించినప్పుడు కూడా అందులో వచ్చే కొన్ని పేరడీలు అనువాదం చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఉదాహరణకు ఈ గ్రంధం ” In the begining there was slime ” అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. అది ” In the begining there was the word ” అన్న బైబిల్‌ లోని St. John వాక్యానికి పారడీ. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మమైన కొన్ని అందాలు అనువాదానికి అందకుండానే పోతాయి.

అనువాదకునిగా నాకు సంతృప్తి నిచ్చిన గ్రంధం S.G.Sardesai గారి ” Progress and Conservation In Ancient India “. ఆ పుస్తకాన్ని ఒంట బట్టించుకోడానికి దాన్ని అనేక సార్లు చదివాను. ఆ పుస్తకంలో మొదటినుంచీ చివరిదాకా భగభగలాడే సర్దేశాయి గారి కోపాన్నీ, అసహనాన్నీ అనువాదంలోకి తీసుకురాగలనన్ననమ్మకం కలిగిన తరువాత రచన ప్రారంభించాను. వైదిక సాహిత్యాన్నీ, సమాజాన్నీ అభివర్ణించటానికి సర్దేశాయిగారు ఉపయోగించిన ఇంగ్లీషు మాటలకు అసలు రూపాలైన సంస్కృత పదాలను గాలించి పట్టుకొని ఉపయోగించాను. ” ప్రాచీన భారత దేశంలో ప్రగతి, సాంప్రదాయ వాదం” అనువాదంలాగా కాకుండా మూల గ్రంధంలాగా చదివించిందని పెద్దలు అన్నప్పుడు చాలా సంతృప్తి కలిగింది.

ఈ గ్రంధాలు కాకుండా Ralph Fox రాసిన ” The Novel and the People “, R.S.Sharma రాసిన ” Ancient Indian History “, తస్లీమా సమీర్‌ రాసిన ” Lazza ” అన్న పుస్తకాలను కూడా అనువదించాను. వీటిలో మొదటిది నవలా సిద్ధాంతం గురించిన పుస్తకం. మూడవది నవల. వీటిలో “లజ్జ” అనువాదానికి అనువాదం. అనువాదం ద్వారా మూలగ్రంధంలోని శైలిని ఎంత కష్టపడి ఊహించుకున్నా, అనువాదానికి చేసిన అనువాదం అంత సంతృప్తిగా రాకపోవచ్చు. ఇవన్నీ నేను ఇంగ్లీషునుంచి అనువదించిన గ్రంధాలు. వీటికి తోడు, కన్నడం నుంచి ” ఒడలాళ” అన్న నవలికను కూడా అనువదించాను. అది కన్నడంలో చాలా ప్రసిద్ధ నవలిక. దాన్నిరాసిన దేవమారు మహాదేవను “ఒడలాళ మహాదేవ” అని కూడా పిలుస్తారు. ఈ నవలిక అనువాదాన్ని H.B.T. వారు ” బతుకంతా” అన్నపేరుతో ప్రచురించారు. అది ఎవరి దృష్టిని ఆకర్షించినట్టు లేదు. అందుకు కారణం కర్ణాటక, ఆంధ్ర సామాజిక జీవన చైతన్యంలో ఉన్న తేడాలని అనిపిస్తుంది. వారికి బాగా అభ్యుదయకరంగా కనిపించిన పుస్తకం, మనకు మరీ అంత అభ్యుదయకరంగా కనిపించక పోవటమే అందుకు కారణం. ఇది కూడా అనువాదకునికి ఒక పాఠమే. ఒక భాష వారిని ఆకర్షించిన పుస్తకం, మరొక భాషవారిని ఆకర్షించక పోవచ్చు. అందుకు ఒకే విషయానికి సంబంధించిందే అయినా వారి చైతన్య స్థాయిలోని తేడాలు కారణం కావచ్చు. అందుచేత అనువాదకుడు లక్ష్య భాషలను మాట్లాడే ప్రజల నాడిని పట్టుకోవటం చాలా అవసరం.

ఈలోగా అనువాదకుడిగా నేను మరో పాఠం కూడా నేర్చుకొన్నాను. ” Soil and civilization ” అన్న పుస్తకాన్ని పంపుతూ H.B.T. వాళ్ళు దాన్ని అనువదించమని కోరారు. ఆ పుస్తకాన్ని చదివి ఆశ్చర్య పోయాను.జీవావరణానికీ, సంస్కృతికీ ఉన్న సంబంధాన్ని మొత్తం ప్రపంచ చరిత్రను ఆధారంగా చేసుకొని చర్చించిన పుస్తకం అది. ఆ పుస్తకంలోని వస్తువు అర్ధమైందిగానీ ఆ పుస్తకం మొత్తంగా నా నరాలలోకి ఎక్కలేదు. అందుచేత ఆ పుస్తకాన్ని నేను అనువదిస్తే బాగా రాకపోవచ్చు ననిపించింది. సరైన అనువాదకుడు ఎవరా అని అలోచిస్తే తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు. వారు చరిత్రను చదువుకొన్న వారు.సాంస్కృతిక అధ్యయనాలలో నుంచి పర్యావరణంలోకి వచ్చినవారు. పర్యావరణ కార్యకర్త. కధా రచయిత. ” మీరు ఆ పుస్తకాన్ని అనువాదం చేస్తారా ?” అని అడిగితే వారు సంతోషంగా అంగీకరించారు.ఇప్పుడు అనువాదం సాగుతోంది. రచయితకు కధా వస్తువుతో హృదయ సంవాదం కుదిరినట్టుగా అనువాదకునికి కూడా మూల గ్రంధంలోని విషయంతో హృదయ సంవాదం కుదరాలి. అందరు అనువాదకులూ అన్ని విషయాలనూ బాగా అనువదించలేరు. కొందరు కొన్ని విషయాలను ఇతరుల కంటే మెరుగ్గా అనువదించగలరు. ఈ సత్యాన్నిగుర్తిస్తే అనువాదం కొందరు భావిస్తున్నట్టుగా వృత్తిరచన కాదని అర్ధమౌతుంది.

ఇవి నేను ఇతర భాషల్లోంచి తెలుగులోకి చేసిన అనువాదాలకు సంబంధించిన అనుభవాలు. నేను తెలుగునుంచి ఇంగ్లీషులోకి కూడా కొన్ని అనువాదాలు చేశాను. కొంత కవిత్వాన్నీ, తిలక్‌ , పెద్దిభొట్ల, సింగమనేని, వివిన మూర్తి,వల్లంపాటి గార్ల కధల్ని ఇంగ్లీషులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రచురించాను. ఆ అనువాద కార్యంలోని అనుభవాలూ, సమస్యలూ వేరు. వాటిని గురించి మరొక సారి మాట్లాడుకుందాం.

మొత్తం మీద అనువాదం రెండు భాషలకూ, రెండు సంస్కృతులకూ మధ్య అక్షరాల వంతెన. ప్రపంచంలోని అన్ని భాషల్నీ, సంస్కృతుల్నీ సర్వ మానవ జీవితానుభవాలనూ, విజ్ఞానాన్నీ ఏకం చేసే విశ్వకుటుంబీకుడు అనువాదకుడు.
 

5, నవంబర్ 2012, సోమవారం

దళిత చైతన్యం ఒక అనువాదమై...

    - దేవరాజు మహారాజు devaraju.maharaju@gmail.com
    05/11/2012

TAGS:

తెలుగునాట దళిత స్పృహ ఉద్ధృతం కాకమునుపే 1980లలో మరాఠీ దళిత కవిత్వం తెలుగు పత్రికలకెక్కింది. పందొమ్మిదవ శతాబ్దంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థలపై నిరసన భావంతో దళితవాద రచనలు ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీ హరిజనోద్ధరణ ప్రారంభించిన తర్వాత అన్ని భారతీయ భాషల వలెనే తెలుగులో కూడా కావ్యాలు వెలువడ్డాయి. జాషువా ‘గబ్బిలం’, కాటూరి వెంకటేశ్వరరావు ‘గుడిగంటలు’ వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సాంఘికంగా దోపిడీకి గురవుతున్నవారు, అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, కేవలం శారీరక శ్రమపై బతుకుతున్నవారు దళితులు. విద్యావంతులైన కొందరు దళితులు సాటి సోదరులను చైతన్యపరచడానికి సాహిత్యాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఇదే దళిత సాహిత్యమైంది. ఇదే దళిత ఉద్యమమైంది.
త్రియంబక్ సప్‌కాలే, వహరు సోనావనే, భీమ్‌సేన్ దితె, ప్రశాంత్ ఖరత్, డుధాల్కర్, కేశవ్ మేష్‌రామ్, వామన్ కర్‌దక్ మీనా గజభియే, ఎల్.జ్యోతి, ఎఫ్.ఎం.షిండె, శరణ్‌కుమార్ లింబాలే వంటి ప్రముఖ దళిత కవులందరూ వందల సంఖ్యలో తెలుగు పాఠకులకు పరిచయమయ్యారు. వీరందరిలో కనిపించే సుగుణమేమంటే సాఫీగా, సరళంగా సాగుతూనే కవిత భావస్ఫోరకంగా, ధ్వని ప్రధానంగా ఉంటుంది. కొందరి రచనల్లో నినాదాలు, కసి కనిపించినా ఎక్కువమంది రచనల్లో కవితాత్మ కొట్టుకుంటుంది. వహరు సోనావనె - కవిత అడవిలో ఆదివాసుల జీవితమంతా కళ్ళకు కట్టిస్తుంది.
‘‘ఆకు పచ్చని ఆరోగ్యవంతమైన అడవిలో
రాలిపడిన టేకు ఆకుల్లా
దూరంగా విసిరేసిన గుడిసెలు
కీకారణ్యం మధ్యన ఆదివాసులు
వ్రేళ్ళూ, కందలు, దుంపలు తింటూ

అయినా ఇప్పుడేమున్నాయనీ?
దుంపలూ లేవు, వ్రేళ్ళూ లేవు
నోరు తెరచిన భయంకర
నాగరిక ఆకలి జ్వలలకుర
అన్నీ ఆహుతైపొయ్యాయ్
ఇప్పుడు అడవిలాంటి అడవిలో
ఆదిమ సమాజంలోని బానిసల్లాగ
పిల్లలు నగ్నంగా గుడిసెల ముందు బురదలో
ఆటవికంగా ఆడుకుంటున్నారు’’
నాగరిక ఆకలి జ్వాలలకు ఆహుతైపోయిన జీవితాల నేపథ్యం ఇందులో స్పష్టంగా ఉంది. ప్రశాంత్ ఖరత్ ‘కళ్ళు మూసిన ఆకాశం’ కవితను ఇలా ముగిస్తాడు.
‘‘మరి ఈ ఆకాశాన్ని శవపేటికలో పెట్టిందెవరు?
ఈ ఆకాశం మీద మబ్బుల తెల్ల వస్త్రాన్ని కప్పిందెవరు?’’
సరికొత్త ఆలోచన. సరికొత్త ఇమేజరి. తెలుగులో విప్లవ కవిత్వం చాలా వచ్చింది. అది విషయాన్ని ప్రజలకు చేరవేసే కరపత్రంలా పనికొచ్చిందేర కాని, ఒక ఉన్నత స్థాయిని సంతరించుకున్న కవిత్వంగా తన స్థానం సుస్థిరం చేసుకోలేదు. కేశవ్ మేష్‌రామ్ అనే కవి ‘మా గూడెం’ శీర్షికతో ఎంత గొప్ప వర్ణన అందించాడో చూడండి.
‘‘మా గూడెంలో / పోస్ట్‌మ్యాన్ ఠోకరా తింటాడు / సుభాషితాల అర్థాలు తారుమారవుతాయి / నాగరికత గజగజ వణుకుతుంది / సూర్యుడంతటి వాడు కమిలి నల్లబడతాడు / బురదలో పశువుల కాలి గుర్తుల్లాగ - మా ఇళ్ళు / వాటిమధ్య విద్యుత్తులా / ఈదుతూ పొగలా మా గుండె ధైర్యం / సంప్రదాయపు చట్రాల్లోంచి బయటపడి / భూమిలో ఇంకిపోతూ మా గూడెం / నల్లని వెంట్రుకలతో, నల్లని శరీరాలతో / గర్జిస్తూ మెలి తిరుగుతూ, ఉవ్వెత్తున లేచిపడే / తిరుగుబాటు సముద్రం - ఇక్కడి ప్రజలు / దూది మూటల్ని భుజాలమీద మోస్తుంటారు / పీలగా గరుకుగా ఉన్నవాళ్ళ చేతి గాజుల్లో / పగిలిన ఆకాశం కనిపిస్తుంటుంది / ఉష్ణాన్ని పీల్చి వడగట్టడమే తమ పనైనట్లు / పిల్లలు అన్నిచోట్లా తిరుగుతుంటారు’’ - అంటూ సాగే కేశవ్ మేష్‌రామ్ దీర్ఘకవిత ఇలా ముగుస్తుంది.
‘‘ఇప్పుడే మా పిల్లలు విషయం గ్రహిస్తున్నారు / కవితలు రాస్తున్నారు / కథలు, భారతీయ సాహిత్యం సృష్టిస్తున్నారు / సంప్రదాయపు వృక్షాల్ని పదాల గొడ్డళ్ళతో తెగ నరుకుతున్నారు / సాహిత్యపు కలలమీద / వేడెక్కిన కఠోర నిజాల్ని భోరున వర్షిస్తున్నారు / పోలీస్, పోస్ట్‌మేన్‌లు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు / చీకటి, సూర్యుణ్ణి కబళించే వృధా ప్రయత్నమది’’
వ్యాఖ్యానమక్కరలేని దళిత కవిత్వం ఇది. తల దాచుకోవడానిక్కూడా సరైన గూడు లేని నిర్భాగ్యులైన దళితుల గూర్చి ఉత్తమ్ కోల్గాంకర్ ఇలా వర్ణిస్తాడు. శీర్షిక ‘‘గృహముంటే కదా స్వర్గసీమ’’.
‘‘అతడు ఇంట్లోకి పోయి తలుపు వేసుకుంటే
వెనక గోడ పూర్తిగా కూలిపోయే ఉంటుంది
భూమ్యాకాశాలు కలిసినట్టే ఉంటాయి
ఆకాశం ఆకాశమే వేలవేల కళ్ళతో
అతని ఇంటిమీద దాడి చేస్తున్నట్టే ఉంటుంది
ఆకాశం కూలి మీద పడుతున్నట్టే ఉంటుంది’’
కేవలం దళితుల సమస్యలమీద మాత్రమే కాకుండా, దళిత కవులు దేశ పరిస్థితుల మీద కూడా వ్యాఖ్యానించారు. బాబూరావ్ జగ్‌తాప్ అంటాడు.
‘‘ఈ దేశం వేయి ముక్కలయ్యింది
నగరాలుగా, మతాలుగా, కులాలుగా
ప్రజలూ, వాళ్ళ మెదళ్ళూ అన్నీ ముక్కలయి పొయ్యాయి
తుత్తునియలయి పొయ్యాయి
ఈ దేశంలోని ప్రతిరోజూ కాలిపోతోంది
మా జీవితపు ప్రతి క్షణాన్ని మాడ్చేస్తోంది
హృదయం లేని మతంతో ఈ దేశం నగ్నంగా నిలబడి ఉంది
ఇక్కడి నేతలు దొడ్డిదారి చట్టంతో ఖుషీఖుషీగా
జల్సాలకు అలవాటుపడ్డారు
అసలు మేమిక్కడ పుట్టి పెరిగామన్నది కూడా మరిచిపొయ్యారు’’
- ఈ విధంగా ఎంతో దళిత సాహిత్యం తెలుగులోకి అనువాదమయ్యింది. తెలుగులో వచ్చిన విప్లవ సాహిత్యం తాడితులు, పీడితులు అణగారిన వర్గాలన్నింటి గూర్చి, అణచివేయబడ్డ స్ర్తిల గురించీ వెలువడింది.
అదే తర్వాత కాలంలో దళితవాదం, స్ర్తివాదం, మైనార్టీవాదంలాగా విడివడి స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకున్నాయి. ఉద్యమ స్ఫూర్తి ఏదైనా గొప్పదే! కాని, ఆ స్ఫూర్తినిరి నిలుపుకునే సహేతుకమైన శక్తిమంతమైన కవిత్వం రావడం చాలా అరుదు.

సమకాలీన సాహిత్యానికి దిశా నిర్దేశమేది? | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

సమకాలీన సాహిత్యానికి దిశా నిర్దేశమేది? | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

4, నవంబర్ 2012, ఆదివారం

స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోదనలు

స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోదనలు

ఆధునిక సాహిత్యరంగంలో:

గత వేయి సంవత్సరాల ప్రాచీన సాహిత్యం ఒక ఎత్తు కాగా 1900 తరువాత పుట్టిన ఆధునిక సాహిత్యం మరో ఎత్తు. వైవిధ్యం, ప్రజాజీవిత ప్రతిఫలనం, మార్పునాశించటం ఆధునిక సాహిత్య ప్రధాన లక్షణాలు. చలం, శ్రీశ్రీ, కుటుంబరావుగార్లు రచయితలుగా మాత్రమే కాకుండా విమర్శకులుగా ఆధునిక పరిశోధనరంగాన్ని బహుధా ప్రభావితం చేశారు. వీరందరూ సాహిత్య ప్రయోజనాన్ని గురించి ప్రశించినవారే. ఫలితంగా ఆధునిక సాహిత్య పరిశోధన ''ప్రయోజ''నాన్ని ఉద్దేశించి జరిగింది.
ఆచార్య సి.నారాయణరెడ్డిగారి ''ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు - ప్రయోగములు'' ఒక విధంగా ఆధునిక కవిత్వం మీద పరిశోధనకు కరదీపిక అయింది (1967). అంతకు ముందు కెవి.రమణారెడ్డిగారు గురజాడ మీద రచించిన ''మహోదయం'' ఒక విధంగా రచయిత మీద పరిశోధించే సూత్రాల్ని అందించిందని చెప్పవచ్చు (1958-1969).
వీరి కంటే ఒక దశాబ్దం ముందే ''తెలుగు సాహిత్యం మీద పాశ్చాత్య ప్రభావం'' గురించి ఆచార్యులు జి.యస్.రెడ్డి, కొత్తపల్లి వీరభధ్రరావులు పరిశోధించారు. నాటకరంగం మీద సి.యస్.ఆర్.అప్పారావుగారు, కథానిక మీద పోరంకి దక్షిణామూర్తిగారు, వ్యాస పరిణామం మీద కొలకలూరి ఇనాక్ గారు రచించిన సిద్ధాంత గ్రంథాలు గొప్ప ఆకర గ్రంథాలు. ఈ దశలోనే స్వాతంత్ర్యోద్యమ కాలంలోని జాతీయ గేయ కవిత్వం మీద ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి గారి పరిశోధన జరిగింది (1970 - 1980).
ఈ దశకంలోనే ఆధునిక సాహిత్య ప్రచారమూ ముమ్మరంగా సాగింది. కె.కె.రంగనాధాచార్యులుగారు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఆధునిక సాహిత్యం మీద, ఉద్యమాల మీద, కవుల మీద, రచయితల మీద - ఉపన్యాసాలిప్పించి, ఆయా గ్రంథాలకు విపులమైన పీఠికలు రచించారు. ఆ పీఠికల్లో కొత్త కోణాలు సమగ్రంగా ఆవిష్కరింపబడ్డాయి. 1974లో వెల్చేరు నారాయణరావుగారు ''తెలుగులో కవితా విప్లవాల స్వరూపం'' మీద ఒక సిద్ధాంత వ్యాసం అమెరికాలో వుండి రచించారు. తొలిసారిగా తెలుగుదేశంలోని సాహిత్య ప్రియులంతా ఒకసారి కవితా విప్లవాల్ని గురించి ఆలోచించేలా చేసిన గ్రంథమిది. తరువాతి సంవత్సరాల్లో డా.సంజీవమ్మ, డా.వరవరరావు, డా.టి.ప్రభాకరరెడ్డి క్రమంగా నవలల్లో సామాజిక వాస్తవికత, భూమి సమస్య, విప్లవ కవిత్వంలో ప్రతీక అనే అంశాల మీద పరిశోధించారు. ఈవాళ దాదాపు ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఆధునిక, జానపద సాహిత్యాల మీద పరిశోధన సాగుతోంది. కేతవరపు రామకోటి శాస్త్రి, ముదిగొండ వీరభద్రయ్య, కేతు విశ్వనాథరెడ్డి, కేతవరపు కాత్యాయని, ఆధునిక సాహిత్యా పరిశోధన సూత్రాలను అన్వేషిస్తున్నారు

వచన కవితా ప్రక్రియ - కుందుర్తి కృషి -- డా. అద్దేపల్లి రామమోహన రావు

వచన కవితా ప్రక్రియ - కుందుర్తి కృషి

-- డా. అద్దేపల్లి రామమోహన రావు

శిష్ట్లా, శ్రీశ్రీ,నారాయణ బాబు, పఠాభి - మొదట్లో వచన కవితకి ఒక రూపమిచ్చినట్లుగా సాహిత్య విమర్శకులు పేర్కొంటారు. వచన కవిత అనేది పాశ్చ్యాత్య కవితా ప్రభావం వల్లనే వచ్చింది. దీన్ని ఫ్రీ వర్స్ అంటారు. ఫ్రీ - అంటే అన్ని సంకెళ్ళనూ తెంచుకుని, స్వేచ్చగా భావాన్ని వెల్లదించే ధోరణి. దీని అవసరానికి సంబధించిన ముక్యాంశాలు కొన్నిటిని విశ్లేషింవచ్చు.

  • 1. గతులు, యతి, ప్రాస మొదలైన చందస్సుకి సంబందించిన నియమాల్ని విడిచి పెట్టడం.
  • 2. పూర్తిగా ప్రజలు వాడుకునే వ్యావహారిక భాషకు ప్రాధాన్యం ఇవ్వడం.
  • 3. వాక్యాల్ని మాట్లాదుకునే క్రమంతోనే రాయడానికి అవకాశం రావడం.
  • 4. ఎటువంటి శిల్పానికైనా ఏ కష్టం లేకుండా ప్రయోగించడం
  • 5. పాదాలుగా విరవడంలో ఒక్కొక్క సంపూర్ణ భావానికి ప్రాధాన్యమివ్వడం.
ముఖ్య్మైన విషయాలు ఇవి కాగా, ఆత్మ లక్షణం 'భావభారా కవి లోని భావాల ధార మాత్రమే ప్రధానమై, మిగిలిన ఏ ఆటంకాలు లేకపోవడం వచనకవిత వల్ల వచ్చిన ఒక గొప్ప ప్రయోజనం.
ఒక ప్రక్రియ నుండి మరొక ప్రక్రియ పరిణమించేడపుడు పాత ప్రక్రియ తాలూకు అవశేషాలు ఒక్కసారిగా తొలగిపోవు. క్రమక్రమగా తొలగిపోతై. అందుకే మొదటి వరసకు చెందిన పై కవుల్లో పద్యంకి సంబధించిన ఎన్నో లక్షణాలు మిగిలి ఉనాఇ. వాటిని ఈ క్రింది విధంగా వింగడించవచ్చు.

  • 1. మధ్య మధ్య లో అనేక గజాలు లయ బధ్ధంగా కనిపిస్తూ ఉండడం
  • 2. అక్షరాల సంఖ్యని బట్టి కాకుండా ఎక్కడో ఒక చోట యతి రావడం
  • 3. నియమాల్ని బట్టి కాకుండాఆ ప్రాసలు అంత్య ప్రాసలు తరచుగా రావడం
  • 4. సంస్క్రుత భాషనూ, సమాసాల్ని విరివిగా ప్రయోగించడం
  • 5. సంక్లిష్టమైన భావాల్ని, శైలిని కూడా అనుసరించడం
ఇలాటివన్నీ పై కవుల్లో తరచుగా గమనించవచ్చు.
వచన కవిత ప్రజల భావాల్ని ప్రజలకి చెప్పడానికి చాలా అనువైన రూపం. దీనికి భినామైన లక్షణాలు కూడా పై వారిలో కొంత వరకు ఉన్నై. సామాజిక వస్తువును కాకుండా ఎటువంటి ప్రయోగాత్మక భావరీతికైనా వచన కవితలో చెప్పే అవ్కాశం ఉంది. కాని ఒక రూపం ముందుగా బయల్దేరడానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. వచన కవిత, కవిత్వాన్ని ఉన్నతమేధా స్థాయి నుండి, ప్రజాప్రయోజకరమైన స్థాయికి తీసుకురావడానికే ఉడ్డేశింపబడింది.
కవులు, తమతమ లక్ష్యాలతో, కవిత్వాన్ని రాస్తూ ఉన్న సమయంలో, కొంత కాలానికి గాని స్థిరమైన విశ్లేషలూ, నిర్దేశాలూ, నిశ్చిత నియమాలూ ఏర్పడవు. అలా శిష్ట్లా కవులు రాస్తున్న వచనకవితకి, 1958 ప్రాంతాలనుండి వివేచనాత్మక విశ్లేషణలు ప్రారంభమైనై. ఈ సమయంలో ఈ అవసరాన్ని నేపధ్యంల్గా తీసుకొని, వచన కవితకు వస్తు, శిల్ప పరమైన స్థిరీకరణ కోసం ప్రయత్నించిన వారిలో 'కుందుర్తీ ముఖ్యమైనవారు. ఆయన వచన కవితకు అనువైన లక్ష్ణాల్ని ప్రతిపాదిస్తూ, వ్యాసాలు రాస్తూ, ఆ లక్ష్యంతోనే ఎన్నో వచన కవితల్న్ని రాసినవారు. ఎంతోమంది చేత వ్యాసాలు రాయించినవారు.

'పాతకాలం పద్యమైతే

వర్తమానం వచనగేయం'


అన్నది ఆయన ప్రసిధ్ధ్మైన నిర్వచనం.
వచన కవిత అనేది ఆ తర్వాత వచ్చిన పదమేగాని, కుందుర్తి కాలంలో 'వచనగేయం' అనే మాటె ఎక్కువగా ప్రయోగించేవారు. అంతకుముందు 'వచన పద్యం' అనేవారు. కాలక్రమాన వచన కవిత అనే పదం వచ్చింది. ఈ నాడైతే 'కవితా అంటే వచన కవిత అనే అర్ధం. కుందుర్తి వచన కవిత్వాన్ని విదేశ ప్రభావంవల్ల వచ్చిందని అంగీకరించడు. భావావిష్కరణలోని సహజణామం మాత్రమే ఇందుకు కారణ మంటాడు. ఒక వ్యాసంలో ఆయన ఇలా అంటాడు.
'పద్యం మాత్రా చందస్సు, ఫ్రీ వర్స్ - ఇదొక సహజ పరిణామం. విదేశాలలో ఈ పధ్ధతి ఉండవచ్చు. అంత మాత్రాన విదేశాల నుండి దిగుమతి చేసుకున్నదిగా ఫ్రీ వర్స్ను చూడనవసరం లేదు. అది నా దృష్ఠి. సుప్రసిధ్ధ కవులు దీనిని ఎందుకు అనుసరిస్తున్నారంటే, ఇదొక నూతన ప్రయోగం కాబట్టి. ఏ కాలంలో నైనా పాతరీతులను పగులగొట్టవలసిందే. కొత్త బొమ్మలు చెక్కవలసిందే.'
వచన కవితకు కుందుర్తి ఒక ఉద్యమంగా భావించాడు. కవులందరూ, సామాజిక వస్తువు కోసం వచన కవితను రాయడం బాగా ఎక్కువైన కాలంలో కుందుర్తి, ఆ అధిక్యాన్ని సూచించడానికే దాన్ని ఉద్యమం అన్నాడు. ఆ రోజుల్లో కొందరు, ఒక రూపమే ఉద్యమమెలాగౌతుంది అనిగూడా ప్రశ్నించారు. అయితే, ఆయన దీన్ని సామజిక ఉద్యమమనే అర్ధంలో అనలేదనీ, సామాజిక వస్తువినియోగంలో అత్యంత ప్రసవితం కావడాన్నే ఉద్యమంలాంటిదిగా చెప్పాననీ అన్నారు. 'భావ కవితోద్యమా మొదలైన చోట్ల ఉన్న అర్ధంలోనే ఈ సందర్భాన్ని కూడా గ్రహించవచ్చు.
కుందురి దృష్ఠి పూర్తిగా సామాజిక వస్తుపరమైనదే. సమాజం లోని సమస్యల్ని మాత్రమే వచన కవితలో చెప్పాలని కుందుర్తి వాదం. 'వచన గేయం ఒక ఉద్యమం' అనే వ్యాసంలో ఆయన ఇలా అంటాడు.

'ప్రజా జీవితాలను సర్వసమగ్రంగా చిత్రించే ప్రయత్నించడం ఆధునిక కవితా లక్షణం. అందుకే వచన గేయాన్ని ఆశ్రయించవలసివచ్చింది. సంఘంలో పై అంతస్తులంకు మాత్రమే పరిమితం కాకుండా, కిందికిదిగి సామాన్య ప్రజల మధ్య నిలబడి చిత్ర విచిత్ర మైన, బహు క్లిష్టమైన, ఆధునిక జీవితంలోని వివిధ ఘట్టాలను వర్ణిచాలంటే, అది ఒక వచన గేయమే చేయగలదు!
కుందుర్తి సామ్యవాద ఉద్యమాల్లోంచి రూపు దిద్దుకున్న అభ్యుదయ కవి. అందుకే వర్గ దృష్ఠి ఆయనకు అన్నిటికంటే ముఖ్యమైన అంశం.
వచన కవితలో ఉన్న మరో గొప్ప అవకాశాన్ని గూడా ఆయన గర్హించాడు. అదే 'కధా కవితా. వచన కవిత సుస్థిరం కావాలంటే, ఈ రూపంలో దీర్ఘ కధా కావ్యాలు రావాలని ఆశించాడు. ప్రాచీన కావ్యాల్లో ప్రాచీన జీవితానికి సంబధించిన కధా కావ్యాలు వచ్చినై కనుకనే వాటికి స్థిరత్వం వచ్చింది కాబట్టి, ఆధునిక కావ్యాల్లో ఆధునిక జీవితానికి సంబంధించిన కధా కావ్యాలు వస్తే, అది వచన కవితని స్థిరరూపంగా చేస్తుందని ఆయన వాదించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే,

'నేటి వరకూ వచన గేయం కవితా బండికల రూపంలోనే కలం గడుపుతున్నది. సంపూర్ణ కావ్య దృష్టి అలవరచు కోలేదు. శ్రవ్య కావ్యం సమగ్రంగా ఉండాలంటే జీవితంలోని వివిధ సంఘటనల చిత్రణ, పారల స్వభావ పరిశీల ఉండాలి. అంటే నాటకీయత ఉండాలి. సామాన్య ప్రజల క్ధా వస్తువులను తీసుకుంటే వచన గేయం చేయలేని పని అంటూ ఉండదు. పూర్వ చందస్సులను త్రోసిరాజన్నందుకు ప్రతిఫలంగా మహా కావ్యాలు సృష్తించవచ్చు.'
దీర్ఘ కధాకావ్యాల గురించి, కుందుర్తి ఊహ అనంత కాలంలో మరో విధంగా సఫలమయింది. కధ, పాత్ర, నాటకీయత మొదలైనవాటి కోసం కధలూ, నాటకాలూ, నవలలూ మొదలైనవి అసంఖ్యాకంగా వచ్చినై కాబట్టి, కధ లేకపోయినా, భావాల్ని విస్త్రుత రూపంలో చిత్రించే 'దీర్ఘ కవితా అనే రూపం వచన కవితా పరిణామంలో విశిష్ట రూపంగా బయటికి వచ్చింది. అన్ని రంగాల్ని గురించి విస్త్రుతంగా, వివరంగా చెప్పాలనే తపన కవిలో పెరగడం ఇందుకు కారణం. మొదట్లో కవి కవిత్వాన్నే చెప్పాడు గాని, ఆధునిక కాలంలో రాజకీయం, చరిత్ర, శాస్త్రజ్ఞానం మొదలైన అనేక అంశాలు కవి ప్రధాన చైతన్యంలో మిళితమై పోయినై. ఈ సమగ్ర చైతన్యమే దీర్ఘ కవిత రావడానికి ముఖ్య కారణం. అంతే కాక కవిలో వక్త, ప్రవక్త కూడా తమకు తగిన స్థానంలో కలిసిపోయారు. ఈ నేపధ్యమంతా ప్రభావితం చెయ్యడం వల్ల, వచన కవితా ఖండికలే కాక, దీర్ఘ కవిత కూడా వచన కవితా పరిణామంలో ఒక ముఖ్య భాగమయింది.
కుందుర్తి తాను నిర్దేశించిన అభిప్రాయాలకనుగుణంగానే, తన కవిత్వమంతటినీ రాశాడు. ప్రజా సంబంధమైనవస్తువు, ప్రజా సంబంధమైన భావన, భాష, అలంకారం - ఇవన్నీ ఆయన్ని సంపూర్ణ ప్రజాకవిగా మలచినై. ఉదాహరణకి 'నగరంలో వాన' నుండి కొన్ని పంక్తులు.
కవిత్వంలా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు

జల్లులుజల్లులై కురుస్తుంది

ఆశుకవితలో నగర ప్రజలకు

ఆశీస్సులు పలుకుతున్నట్లు

అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది

నగరంలో వాన

అంబరానికి అంతసంబరమెందుకంటే

నున్నగా తెల్లగా తళతళలాడే

సిమెంట్ రోడ్ల అద్దాలలోకి

మింటె నుండి మెడలువంచి చూసి

తమ అందం చినుకుల కుప్పలుగా పోసి

అంతులేని ఆకాశమంత ఆనందంతో

మెలికలు తిరుగుతూ మిలా మిలా మెరుస్తాయి మేఘాలు
పై పాదాల్లో అతి సరళమైన భాష. తేలికైన వాక్యాలు. భావ చిత్రాలు కూడా ఏ మాత్రమూ క్లిష్టమైనవికాక వెంటనే అనుభూతి కలిగించేది.
వచన కవితలో ఉన్న మరో అభివ్యక్తి అవ్కాశాన్ని కూడా కుందుర్తి చెప్పాడు. అది 'విసురూ అనే లక్షణం. భావాన్ని తీవ్రతతో చెప్పవలసి వచ్చినప్పుడు, దీర్ఘ వాక్యాల విరుపులు, పాదాల చివర క్రియా పదాలు కుండ పోతగా వచ్చే ఉపమానాలు మొదలైన వాటి వరుసలు ఈ విసురును ప్రతిబింబిస్తై. కుందుర్తి, గోపాలచక్రవర్తి కవిత నుండి ఒక ఉదాహరణిస్తాడు.
'ఆకసం నిండా మేఘాలు

వేలాడే ఏంగులవలె

దేవ వేశ్య ఊర్వశి శిరోజాలవలె

ఉన్మత్త మనో వల్మీకంలో

ఊర్ధ్వంగా ప్రసరించే

వేడివేడి మజా తలపులవలే
'విసురూ కాకుండా 'భావలయా అనే మరో లక్ష్ణాన్ని కూడా వచన కవితలో ఉండాలని కుందుర్తి చెప్తాడు. చందస్సుకి సంబంధించిన లయలో కాకుండా, భావాలు తీర్చడంలో, లయ 'భావలయా. దీని కుదాహరణగా కుందుర్తి చెప్పిన నాలుగు పాఠాలు
'నాకీలోకం మీద అంతగా మమకారం లేకపోయినా

ఇదిమాత్రం నన్నొదిలేట్లులేదు

లోప్పలు ఎత్తి చూపితే ప్రయోజనం లేకపోయినా

ఈ కవిత్వపు పాటలవాటుతో మనసేఊరుకోదూ
ప్రాచీన చందోలక్షణాల్నించి వచన కవిత పరిగమించడంలోని అనే అంశాల్ని గూర్చి కుందుర్తి చెప్పారు. అయితే, ఆయన కవిత్వం ఎంత స్వేచ్చా లక్షణాల్ని ప్రతిబింబించినా, కొద్దిపాటి అవశేషాలు ఆయన్లోనూ మిగలకుండా పోలేదు. ప్రతి కవితకీ ఆయన కొన్ని భాగాలుగా విభజిస్తాడు. ఒక భాగంలో రెండు, ఒక భాగంలో మూడు, మరో భాగంలో ఐదు - ఇలా ఎన్ని విధాలుగానైనా ఉండవచ్చు. కాని భాగాలుగా విభజించడం కూడా ఒక ప్రయత్న పూర్వకమైన అంశమే. అంతేగా 'భావలయా కూడా చందస్సుతో పనిలేకపోయినా, ప్రత్యేకంగా ఆలోచించి చెయ్యవలసిన విషయమే. 'భావధారా అనేది ప్రధాన లక్షణంగా తీసుకొంటే, భావంతోపాటు శైలె నడచిపోవాలిగాని, ఒక 'తీర్పూ అనేది ఉందరాదు. ఎక్కడైనా భావానుగుణమైన తీర్పుకి విసురు, భావలయ మొదలైనవి సహకరించవచ్చు. కాని వీటిని లక్షణాలుగా చెప్పడం తర్వాత కాలంలో నిలబడిన విషయం కాదు. 'భావధ్హరా మాత్రమే వచన కవితకి ఆత్మ వంటి లక్షణం.
తిలక్, అజంతా, ఆరుద్ర,, అప్పుడు వచన కవితకి ఎన్నో నడకల్ని నేర్పితే, తర్వాతి కాలంలో వేగుంట, నగ్నముని, సి. వీజయలక్ష్మి, దిగమర కవులు, అద్దేపల్లి మొదలైన వాళ్ళు భావధారననుసరించిరాస్తే, ఈనాటి దాకా వచన కవిత వస్తు శిల్పాల్లో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, వందలాది ప్రతిభావంతులైన కవులతో, సమకాలీన కవితా ప్రక్రియగా ముందుకు సాగిపోతోంది.

అంటురోగం

కపిల రాం కుమార్// అంటురోగం// **

కులమన్నది పిచ్చిరా - వ్యాకులము నిచ్చురా!
మతమన్నది మచ్చరా అభిమతము చచ్చురా!

కాగితాల దండలు గుబాళింపులీయవు
శాసనాల తోటల్లో గులాబీలు పూయవు!

భాష పేర, జాతిపేర పెరుగనీకు విద్వేషం
విధ్వంసంకాకుండ తుంచవోయి కులతత్వం!

అంటరాని వాడంటే మన వెంటరానివాడే
లంచగొండి మనిషికన్న అంటురోగి యింకెవ్వడు?

కళ్ళు లేని కామానికి అంటరానితనంలేదు
కుళ్ళుబోతు సంస్కృతిని ఆపకుంటె బుద్ధిరాదు!

యాగాలకు వ్రతములకు వ్రణములిట్టె మానినా
పాటలకు మాటలకు రోగాలే తగ్గినా
యిన్ని వేల్ ఖర్చుల్తో వైద్యశాలలేలరా?
విశ్రాంతిపొందగ మరుభూమి మేలురా!

వ్యర్థమైన భావాలకు తలవంచుట్యెందుకు!
స్వచ్చమైన పోకడలో విషము కలుపుటెందుకు?
యోచనలేని మానవత్వ మనుగడ నీకెందుకు
అంటురోగమందరికి అంటించుట యెందుకు?

4.11.2012

** నగారా సంకలనం నుండి.

26, అక్టోబర్ 2012, శుక్రవారం

Andhra Pradesh Theme Song, Beauty of Andhra

తేనెల తేటల మాటలతో : Tenela Tetala Matalato [HD]

Ee visala prasantha ekantha

పాలగుమ్మి విశ్వనాథం


పాలగుమ్మి విశ్వనాథం (1919-2012)
More articles by పుస్తకం.నెట్ »
Written by: పుస్తకం.నెట్
Tags: Palagummi Viswanatham
palagummi

ప్రముఖ లలిత సంగీత కళాకారులూ, గేయ రచయితా అయిన పాలగుమ్మి విశ్వనాథం గారు అక్టోబర్ 25, గురువారం నాడు కన్నుమూశారు.

“ఆకాశవాణి” ద్వారా ఆయన తెలుగు ప్రజానీకానికి సుదీర్ఘ కాలంపాటు వివిధ సంగీత రూపకాలు అందించారు. ఎందరో గొప్ప కవుల పాటలకి స్వర కల్పన చేశారు, స్వయంగా గానం చేశారు. తెలుగు లోగిళ్ళలోకి లలిత సంగీతాన్ని తెచ్చిన వారిలో ఆద్యుడిగా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. బాలమురళీకృష్ణ, ఎస్.పి.బాలు, పి.బి.శ్రీనివాస్, ఎమ్మెస్ రామారావు వంటి ప్రముఖులు ఎందరో ఈయన శిష్యరికం చేసినవారే.

1919లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆయన బాల్యంలోనే సంగీతాసక్తి తో వీణ అభ్యసించారు. తరువాత కొన్నాళ్ళు సినిమాల్లో కూడా పనిచేశాక, 1955లో ఆల్ ఇండియా రేడియో లో చేరి, స్థిరపడ్డారు. కాలక్రమంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎందరో కవుల రచనలని తమ సంగీతం రూపంలో జనాల మనసులో నిలిచిపోయేలా చేశారు. తెలుగు యూనివర్సిటీ వారి లైట్ మ్యూజిక్ విభాగ స్థాపనకూ, సిలబస్ రూపకల్పనకూ కూడా చేయూతనందించారు. అలాగే, వారికోసం లలిత సంగీతం పై పుస్తకాన్ని కూడా వ్రాశారు. కొన్నేళ్ళ క్రితమే ఆయన జీవిత, సంగీతానుభవాలను చెప్పుకున్న ఆత్మకథను సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు పుస్తకంగా ప్రచురించారు.

ఆయన తొంభైయవ పుట్టినరోజు సందర్భంగా సిలికానాంధ్ర వారు ప్రచురించిన వ్యాసం ఇక్కడ చదవండి.

ఆయన ఆత్మకథను సంకలనం చేసిన జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి గారే ఆయన గురించి హిందూ పత్రికలో గత ఏడాది రాసిన వ్యాసం ఇక్కడ చదవండి. ఈ కథనాన్నే తెనిగిస్తూ బ్లాగర్ నెమలికన్ను మురళిగారు పాలగుమ్మి విశ్వనాథం గారి గురించి చెప్పిన వ్యాసం ఇది.

“లలిత సంగీత స్వరాలకు ఆదిగురువు పాలగుమ్మి” అంటూ ఆయన గురించి చెప్పిన సూర్య పత్రిక వ్యాసం ఇది.

ఆయన రాసి, స్వరపరచగా వేదవతీ ప్రభాకర్ గారు పాడిన “అమ్మ దొంగా..” యూట్యూబు లంకె ఇక్కడ. ఆయనే రాసి, స్వరపరచి పాడిన “మా వూరు ఒక్కసారి పోయి రావాలి” పాటని “సరిగమలు” బ్లాగులో ఇక్కడ వినవచ్చు.

విశ్వనాథం గారు సంగీతం కూర్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి నాటకాలు – శర్మిష్ట, వేణుకుంజం లలోని పాటలని ఈమాట పత్రిక ద్వారా ఇక్కడ వినవచ్చు.

16, అక్టోబర్ 2012, మంగళవారం

http://service.vishalon.net/pramukhtypepad.aspx

పచ్చనీ హారాలు ( కపిల కైతలు)

కపిల రాం కుమార్// పచ్చనీ హారాలు ( కపిల కైతలు)

1.పట్టుదల లేక
ఓటమి
తల పట్టుకుంది

2. పెట్టుబడి లేక
ఇంటి కట్టుబడి
ఆగింది.

3. కట్టుబాటు తప్పి
బతుకు బాట
తప్పింది

4. గురి తప్పి
లక్ష్యం
పరువుదీసింది

5. గిట్టుబాటు లేక
సేద్యం
కాలి బూడిదైంది.

6. ఎంపికలో
నిర్లక్ష్యం
ఐదేళ్ళ శాపమైంది

7. గతించిన
బాల్యం
గోడపటమైంది

8. ఐక్యతలేక
ఉద్యమం
అమ్ముడుబోయింది

9.సఖ్యతలేక
జంట
చీలిపోయింది

10. చిగురించే ప్రేమ
ద్వేషానికి
బలైంది

11. నిజం చెప్పని
అహం
కారాగారమైంది

12. కూట సాక్ష్యం
జైలునుండి
విడుదల

13. ఆయువు ఆగి
క్షణంలో
మట్టైంది

కాని.....

14. పచ్చనీ బతుకున
పచ్చడీ మెతకకు
పచ్చలా హారం

అందుకే

15. ఉదయించే 
రాగమే
విప్లవ గీతమైంది!

16-10-2012 ఉదయం 4.56

7, అక్టోబర్ 2012, ఆదివారం

Dr K Harish 6th Anniversary 22 09 2012

ఎదురుచూపు

కపిల రాం కుమార్ //ఎదురుచూపు//

మసిబారిన మనుగడలో - ఎన్నాళ్ళీ మౌనాలు?
తలయెత్తుకు తిరిగేలా కలిగిస్తా ధైర్యాలు!

సాంఘిక ధర్మపు జాఢ్యాలు - డబ్బూ జాతీ హోదాలు
సామాన్యుని రక్తం పీల్చే అధునాత్నాతన రోగాలు!
కులము మతము వంకలతో కుళ్ళిపోయెను మానవసంఘం
నాకేమని ఊరుకుంటే ఊరంతా మారణ హోమం!

రక్తాలను తాగే మత్తులో అనురాగం చిత్తై పోయెను
సంస్కారం చంకలు నాకి దహనాలకు ఆజ్యం పోసెను!
బాధితులు ఊరట పొంద, పోరాడగ ముందుకు కదులు
వేదనలే తొలిగేలా వెలిగించు దీపాలు!

నా పాటే సూర్యుని కిరణం వెలుగు బాట నీకు శరణం
చైత్తన్యపుటక్షర వెలుగు నీ అండగ నిలిచెను చూడు!
ఒక వ్యాసుని జననం కోసం నవ శిల్పుల రాకడ కోసం
అను నిత్యం ఈ  యత్నం  కొనసాగును కడ వరకు!

7-10-2012

(నా కవితా సంపుటి నగారా నుండి - 2004)

5, అక్టోబర్ 2012, శుక్రవారం

చెకుముకి/

కపిల రాం కుమార్// చెకుముకి//

రాయి రాయి రాపిడిలో నిప్పు పుట్టినా
వెదురు పొదల గాలి చేరి పాట పుట్టినా

అవసరాలు తీరుటలో సాధనాలు ముఖ్యం
సాధనాల పుట్టుకయే విజ్ఞానపు గమ్యం!

నీటిలోని చేప - నేల మీద జీవి
చెట్టుపైన కోతి - కోతి నుండి మనిషి
రాతి యుగం లోహయుగం - మానవ పరిణామ క్రమం
పరికరాల సంపాదన - విజ్ఞానపు ప్రగతి పథం!

గాలి ధూళి - ఎండ వాన - ప్రకృతిలో సహజం
జీవరాశి వయసు తెలుప శిలాజాల నైజం!
అనుమానపు భ్రమలు తీర్చు - వివరించును విజ్ఞానం
అనుసరించ లేకపోతే మింగివేయునజ్ఞానం!

మోసగాళ్ళ చేతిలో కీలుబొమ్మ దైవం
వ్యాపారపు సరళిలో ప్రజలనుండి దూరం!
నోట మంట మింగటం నిప్పులపై నడవటం
మహిమలేమి కావులే కృషివుంటే సాధ్యములే!

కాటిలోని కొరివి చూసి కలవరాలు వీడు
బొమికలోని భాస్వరం గాలి చేత మండు!
భూభ్రమణపు క్రీనీడలు సూర్య చంద్ర గ్రహణాలు
మినుకు మినుకు తారలన్ని నింగిలోని తోరణాలు

నేల మీద చెట్లుంటే - నింగి నుండి నీరు
లేకుంటె కాలుష్యం - జీవనమే కన్నీళ్ళు!
సాధనాల వినియోగం సమాజాన కళ్యాణం
గాడి తప్పి పయనిస్తే - జీవకోటి వినాశం!

తేనెపూత కత్తులేమొ కుత్తుకలను తెంపును
నిజమెపుడు చేదు మాత్ర - రోగాలను తుంపును!
చీకటిలో పయనించకు - నిను నీవే నిందించకు
మేలుకొలుపు పాటలతో విజ్ఞుడిగా మసలుకో!

4-10-2012

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

Women's Bank - ViewChange.org

Women's Bank - ViewChange.org

ViewChange: To Educate a Girl (Promo)

ViewChange: To Educate a Girl (Promo)

Women on the Frontline: Nepal - A Narrow Escape

Women on the Frontline: Nepal - A Narrow Escape

రన్నింగ్ కామెంటరీ కాదు బర్నింగ్ కాంటెంపరరీ చూడు!

కపిల రాం కుమార్ //రన్నింగ్ కామెంటరీ కాదు బర్నింగ్ కాంటెంపరరీ చూడు!//

బంద్ కు పిలుపిస్తే పనీ పాట లేదంటారు
సమ్మె కట్టితే నిమ్మకు నీరెత్తుతారు
బలగాలను దింపి శలభాలను చేస్తారు!

టిక్కట్టు పెరిగితే యిక్కట్లు పడుతూ
తిట్టుకుంటూ ఎక్కుతారు ప్రయాణం మానరు!
ధరాఘాతానికి మాడతారే కాని సూటిగా ప్రశ్నించరు!

అధికారం పోతుందని భయంతో గుండెమీద చేయ్యేసి చెప్పరు
ఇంట్లో వ్యతిరేకిస్తున్నా నిజం మాత్రం ఒప్పుకోరు!

దిమ్మ తిరిగే బుద్ధి చెప్పి గద్దె దించే సత్తవున్నా
ఓటుతో వేటు వేస్తారా? అదీ అనుమానమే!
వేయలేని వారు కొందరు! పేరులేని వారు మరెందరో్!

చట్టం చట్ట్రంలో యిరుక్కుంది - రాజకీయం కుర్చీకే బందీయయ్యింది
ఉద్యమాల సవాల్ ఉధృతమైనా చాప మిందికి నీరు వస్తేకాని కదలరు!

మూకుమ్మడి కవాతు చేయించే తాహతు
కలిగినోడు లేడు - కలవడానికి రారు!
గమ్యం ఒకటే దారులు వేరు
అజెండా అంటూనే జెండాలు వదలరు!

చెట్టు పేర కాయలు - కుక్క మూతి పిందెలు
గొర్రె దాటు నేతలు బురదలోని పందులు
కాగ్ యిచ్చిన షాకులకు , కోర్టులిచ్చిన వాతలకు
కోవర్టులౌతారే కాని కరెక్ట్ చేసుకోరు!

శీలాలి చిద్రమైనా - చదువులు చంక నాకినా
వ్యవసాయం ఎత్తు పడినా మౌనవ్రతం వీడరు!
ఆదుకొమ్మని రోదిస్తే పగ పడతారు
వద్దు పొమ్మని అడ్డగిస్తే పొగ పెడతారు!

గలించే నెపాన గాలిలో కలిపి
కాల్చిన బూది చేతిలో పెడతారు!

అదును రావాలే కాని పదునైన కరవాలంలా
ఎవరో ఒకరు వేయరా అడుగు!
ఏదో ఒక రోజు మారదా బతుకు!..అని
ఎదురు చూడటం మాని తిరుగుబాటు జెండ ఎత్తుతారు!
వ్యవస్థ కొమ్ములు తుంచుతారు!
జాతికి ఉప్శమనం కలిగించుతారు!
దానికి మనమే పూనుకోవాలి!
జనానికి ఊతమవ్వాలి!

30-09-2012

26, సెప్టెంబర్ 2012, బుధవారం

తిరగ రాసే శక్తివమ్మా

కపిల రాం కుమార్// తిరగ రాసే శక్తివమ్మా!//

అమ్మదనపు కమ్మదనం - విషతుల్యం చేస్తున్నారు
కాలుష్యపు తుపానులో సతమతమవుతున్నది.
పనిచేసే ప్రతిచోట కసిచూపులు మామూలే
ప్రతివాడి వాడి పలకరింత మసిపూసిన కోరికలే
ఎవరమ్మ తలచేది పదేపదే ' అమ్మా ' అని
గాయమైన వేళ వినా - ఆకలైతే తప్ప ఆతృతపడేది!

అవనిలో సగమన్నది పచ్చి నిజం!
మగడు సగమన్నది - సగమే నిజం!
సమానమైన సగాల్లో సమాజాన విలువేది?
ఆటబొమ్మలాగ ఆడుకోచూస్తారు!
ఆదుకోమంతేను అదోలా చూస్తారు!

ఎందుకమ్మా ప్రేమను - అంతయిదిగ పంచుతావు
విలువలు (వలువలు) తుంచుతున్నా
మమతలు పెంచుతూనే పశువులనాదరించుతావు?

తల్లిగా ముద్దులిచ్చి - గోరుముద్దలందించి
తల్లడిల్లునీకు చివరికేమి దక్కు?
పనిపాటల అలసినా ఆలంబన లేదు నీకు
కనిపెంచిన (కన్న తరువాత పెంచక చస్తుందా)
బిడ్డలకూ లోకువేనా?

మగనితోటి - అత్తతోటి-ఆడపదుచు మనసుతోటి
అల్లుకొను, సర్దుకొని సంసారమీదుతావు!
నుదుట రాసిన గీతంటూ, మనువు పెట్టిన షరతులన్నీ
తలచుకుంటే తిరగరాసే శక్తివమ్మా
తరతరాల పొగరు దింపు!

26-09-2012

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లి

కపిల రాం కుమార్//ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లి//

ఏడవకు ఏడవకు వెర్రి నా తల్లి
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు !
ఈ నాఅటి లోకాం మోసాలు ఎన్నో
తెలవకుండ నీవు కాలిడకు తల్లి !

ఎర్రాని ఎండల్లో చెమటోడ్చు నీ తల్లి
వచ్చేను యిచ్చేను మురిపాల లాలి !
ఆందాక ఉయ్యాల నీకు తోడమ్మ
ఊగేటి కొమ్మల్ల గాలి నీదమ్మ !

పొట్టకూటికి మట్టి తవ్వే
పలుగు పారలె నేస్తగాళ్ళు !
గుడిసె బతుకున మట్టిపరుపులు
గుట్టుచెప్పీ గుజ్జన గూళ్ళు !

ఇంటిలోనివారు యినుమువంటివారు
కార్ఖాన గుట్టల్లొ కరిగిపోతున్నారు !
రేపటి నీ బతుకు వెన్నెలా కాయాల
మాపిటేలా దాక సద్దుచేయకనుండు !

గుక్కపెట్టి నీవు రోదించకమ్మ
అమ్మ నీకిపుడు పాలివ్వకున్నాది !
కమ్మటి ముద్దిచ్చి కదిలిపోనుంది
ఎండిన రొమ్మున పిండినారావు !

గంజి కరువైన కడుపున పుట్టావు ! పాలు రాని రొమ్ములో
రక్తమైనా మిగలనీ ! కన్నీళ్ళు దాచేసి బోసి నవ్వులు రువ్వు!

25-09-2012

24, సెప్టెంబర్ 2012, సోమవారం

చిటికలోనే కరుగునోయ్!

కపిల రాం కుమార్// చిటికలోనే కరుగునోయ్!

గుడిసెమీది కోడి కూసె - ముసుగు తీసిలెగవేమీ?
కూలిదొరక కట్ట మైతే -కడుపునిందు దారుయేది?

ఎండ చచుర్రుమన్నకూడ సీమకుట్టినట్టులేదు
బండాళ్ళుకొట్టికొట్టి కండబలమూ తగ్గినాద?
చిన్న చితక పనులు చేసి చిన్నగానే కూడబెడితే
చిన్నపోరికి మనువు చేయ చింతలింక దూరమగును!

సారకొట్టుకెల్లనీకి సంబరంగ పోయినట్లు
కూలికెళ్ళి కడుపు నింప జాగులేక నిదురలే
రెక్కలాడిన డొక్క నిండు, రొక్కమెవడు ఉద్దరీడు
బిక్కమొగమిడిసినీవు సక్కగాను కదులుమిపుడు!

చేయి కలిపి పనికిపోతేనే చేవ కలుగు నిజమోయి
చేదుమాత్ర లెన్నైనా చిటికలోనె కరుగునోయి
ఆడుతు పాడుతు పనిచేస్తేనే నాలుగు యేళ్ళులోనికెళ్ళు
నేటి రోజున మనుగడ ప్రియము కానున్నాది చూడవే?

24.9.2012

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

/పలుగుతో పాటు ఎలుగెత్తు/

కపిల రాం కుమార్//పలుగుతో పాటు ఎలుగెత్తు//

ఊడల మర్రికి ఊయల కట్టి ఉఫుతున్న ఊర్మిళా
జోల పటపాడే ఊర్మిళా నిదురోయేటి బిడ్డనుచూసి
మురిసిపోతోందమ్మ ఊర్మిళా ఆద్మరచివుండకంటూ
ఆన యిచ్చెనమ్మ ఊర్మిళా..పనికు పైనమాయె ఊర్మిళా!

కాయకట్టపు బతుకిలోన కాయా పండా తేడాలుండవు
కాలంచెల్లిన గతుకులు వినా గాయం మానే రోజులుకావు!
కటిక చీకటి రాతిరేల నుదుటి కుంకుమ చెరిగిపోయె
బరమ పేలి బతుకునావ బెరుకులేక లాగవమ్మా!

మగడులేని బతుకు బారం మేయునపుడు దిగులుపడకు
కట్టకాలపు మోత బరువు తలచుకుంటూ కలత వలదు!
కొమ్మకు వూగే అన్నంమూట కాకులు ఎత్తూకెళ్ళవులే
కాకులు కావు పలుకాకుల లోకపు పాపపుకళ్ళకు తూలకులే

ఒక్కరోజే ఓదార్పు - ప్రతిరోజూ నిట్టూర్పు
వేన వేల కట్టాలు పనులముందు దిగతుడుపు
కుక్కలు చించిన విస్తరికాకు - రెక్కలు తెగిన పక్షివి కాకు
రాతిని తవ్వే పలుగును యెత్తి నారీ హక్కులకు యెలుగెత్తు!

23-09-2012

22, సెప్టెంబర్ 2012, శనివారం

నగారా

కపిల రాంకుమార్// నగారా//

నిదురించే యువతా మ్రోగింది నగారా !
కదం త్రిక్కి కదలందే మనుగడె లేదంట!
ముక్కాలు పెట్టుబడి ప్రజలనుండి రాబట్టి
వ్యాపారపు నరసింహాలు తప్పుదారి పదుతుంటే !

విదేశీ హస్త లాఘవం స్వదేశీ హస్త ఖండనం
సన్నకారు కృఇంగిపోవ చప్పపడిపోతుంటే !
నోట్ల ఓట్లు ఆశపెట్టి పార్లమెంతు మెట్లు యెక్కి
రేవుదాటి తెప్పముంచి తప్పుకోను చూస్తుంటే !

పంటలేమొ పండుతున్న పంటికేమొ అందవాయె
దళరీల మాయలోన రైతు ''కూలి'' (కి) పోయె !
గింగరాలు తిప్పగాను దొంగ దెబ్బతీయగాను
ఎఫ్.డి.ఐ. వృషభంలా రంకె డొంకదారినొస్తుంటే !

జన్మ నిచ్చు జనని నేడు జనారణ్య శిబిరంలో
రాబందుల ఆకలికి ప్రతిరోజు నలుగుతుంటే !
విద్య్ల లేని శ్రమ జీవులు సంక్షేమం పేరుమీద
వధ్యశిలకి నైవేద్యమవుతుంటే !

చర్ఖాలకు బురఖాలు గొయ్యి తవ్వుతుంటే
చేతుల పని తెగ్గొట్టి యంత్రాలు వస్తుంటే !
నినాదాల హోరులోన విధానాలు మారుతుంటే
ఉద్యమాల లక్ష్యాలు గోడదాటి పోతుంటే !

మోసగాళ్ళు, వేషగాళ్ళు, భక్తిపేర పచ్చిమూతు
ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు చేస్తుంటే !
ఈ రాజ్యపు టధికారం ప్రజకెలా రక్షణిస్తుందో
మత వాదపు గాడ్సేలు ఊచకోత కోస్తుంటే !

స్వతంత్రాన్ని చంపేసి పరతంత్రం పెంచేసి
కుతంత్రాల్ కులతంత్రపు మంత్రదండమొస్తుంటే !
ఎవరికొరకు ఈ రాజ్యం! ఎవరి సర్లు ఈ భోజ్యం !
సొంతకాళ్ళ నిలిచేలా జనులందరు కదిలేలా !!

కళ్ళుతెరచి ఉద్యమించు స్వతంత్ర్యాన్ని రక్షింప
ప్రజలకొరకు పథకాలు ప్రజల పరమయ్యేలా !
పరాధీన కౌగిలి కబందుడ్ని మించిపోయె !
త్రిప్పి కొట్టు తుప్పు వదల - కర్ర కన్న బుర్ర మిన్న !!

22-09-2012>>>.....

20, సెప్టెంబర్ 2012, గురువారం

పచ్చి నిజం

కపిల రాంకుమార్ // పచ్చి నిజం//

చక్కెర మిల్లు సైరనుకూసె - సైకిలెక్కు మామయ్యో!
డొక్కలునింప రెక్కలకట్టం తప్పాదింక మామయ్యో!

ఇంటికి వచ్చే దారిలోన కోతి చేష్టలు చెయ్య కుండ
యిద్దరి ఇజ్జతు నిలిచేలా దిక్కులు సూడక యింటికే రా!
వచ్చీపోయె దారీలోనా మాయదారి లారీలుంటాయ్
సైకిలెక్కి సోకులు పోతే గోతుల పడతావ్ మామయ్యో!

కొంపకు నీవు చేరే దాక పానం నీ మీదుంటదిరా
పసుపు తాడుగట్టికోసం రోజూ నిన్నే మొక్కుతవూంటా!
సారాకొట్టు, బ్రాంది షాపు కళ్ళతోన చూడమాకు
అంతకంటే మత్తునిస్తా గుండెమీద హత్తుకుంటా!

మల్లెపూల చెండు తోబాటు, పిండివంటకి శెనగపిండి
మర్చిపోక తెస్తివంటె మిర్చి బజ్జి చేసిపెడతా!
పెందలకాడె యింటికి చేరి తొందరగ్గ స్నానంచేస్తే
సందకాడ సరదా చేయ విందు భోజనమందిస్తా!

వెర్రి తలల కోరికతో కుర్ర చేష్టలు చేయమాకు
పక్క దారిన గడ్డికొరికి బక్క రోగం తెచ్చుకోకు
నీకు కట్టం-నాకూ కట్టం -బ్తుకు చీకటికొట్టం!
పయన మౌట కాష్టాలకే -ఎదురులేని పచ్చి నిజం!

20-9-2012

19, సెప్టెంబర్ 2012, బుధవారం

అందరానిది

అందరానిది ఎందుచూచిన
కానవచ్చునుజగతిని
చేతకానిది చేయబూనగ
బయలుదేరిరి భడవలంతా
చేయతగినదిచేయచాలక
గొర్రెదాటుడు చేయగలరు!

గొప్పకోసం అప్పుచేసియు
తప్పటడుగులు వేయగలరు!
దారి తప్పిన బాటసారిని
పోలియుందురు తెలివిమీరి!
తెలివితేటలు తెల్లవారగ
తెచ్చుకుందురు తిప్పలెన్నో

మమతలేని మనసునందున
ద్వేష మెంతో పెంచుకుందురు
ప్రగతికోసం అడుగువేసి
నడువలేరు సుంతయయిన

సోదరత్వఫు సొగసులేకను
మిడిసిపడుదురుపుడమియందున
ద్వేషభావపు బుద్డియందున
పెద్దలవుదఉరు త్రుంచివృయగ

వళ్ళువంగని సుఖములబ్బిన
మూర్ఖులంతా నేటిరాజులు
రాజకీయ బురదలోన
పొర్లుచున్న పందులండి!
>>>>>
కపిల రాంకుమార్

తగదు-తగదు

కపిల రాం కుమార్ . బి.వి.కె. ఖమ్మం// తగదు-తగదు

ఇంట్లో అల్లరి చేస్తున్నారని ఒంట్లో ఓపిక లేదంటూ
వంటింట్లో గిన్నెలనన్నీ నట్టింట్లోవిసిరారంటూ
వయసెదగని బాలలను జయిలు పాలుచేయద్దు
వ్యామోహపు చదువు పేర బడికి బందీ చేయద్దూ!

ఆడుతు పాడుతు గంతులు వేసే
పాల బుగ్గలను బడికి పంపే
క్రూరమయిన ఆలోచనలెందుకు?
బాల్యాన్ని తుంచటమెందుకు?

ఎంత విసిగిస్తే మాత్రం ఆంతకోపం ఎందుకు?
బరువును వదిలించగ చదువు శిక్షలెందుకు?
తాతగారి బామ్మగారి ముద్దుల మురిపాలకు
దూరంగ తోలటం ఘోరమయిన తప్పిదం!

తోటివారి చెలిమిలోని తీపిదనం అంద కుండ
చిన్న చితక తప్పటదుగుల అనుభవాలు పొందకుండ
ముద్దులతో, ముద్దలతో అమ్మే మొదటి గురువను
నానుడిని నిర్దయగ వమ్ముచేయచూడద్దు!

ఆయాల పాలు చేసి అమ్మదనపు పాల తీపి
అందకుండ చేయడం, ప్రక్రుతికే విరుద్దం
చిన్నతనపు చిత్రాలను పదిలపరకుండానే
బాల్యాన్ని చిదిమేటం - తగదు తగదు!
"

వాగ్గేయకారుడు త్యాగయ్య - Surya Telugu Daily

వాగ్గేయకారుడు త్యాగయ్య - Surya Telugu Daily

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

కపిల రాం కుమార్// జాతి గీతం//

జాతులన్నిట తెలుగు జాతి - దేశ భాషల తెలుగు తీపి
తెలుగు మాట తెలుగు పాట - తెలుగువాడా తెలుసుకోరా!

నన్నయార్యుని ఆదికవనం- నన్నె చోడుని జాను తెనుగు
సోమనాథుని వీరశైవం - తిక్కనార్యుని తేట తెలుగు

పోతనార్యుని తీపి పలుకు సార్వభౌముని దాక్షపాకం
కృష్ణరాయుని కొలువులోన కీర్తిగాంచిన కావ్య ప్రగతి


తెలుగుయెదలు జల్లుమనగ - ఎల్లదిశలు అల్లుకొనగ
ప్రబంధాల మలుపులోన స్పూర్తినొందె సరస జగతి!

దాక్షిణాత్యుల ప్రేమ తత్వం ముద్దుపళని ముద్దుపలుకు
రంగవల్లుల యక్షగానం జాలువారిన జాణ తెలుగు

అన్నమయ్య కీర్తనల్లో ఉరకలెత్తిన శ్రావ్య జగతి
త్యాగరాజుని భక్తి గీతం యెదలు పొంగిన పారవశ్యం!

వీరేశలింగం వివేకవర్థిని వెలుగుజూపిం బతుకు దీఫం
కర్మసాక్షిగా చురకలేసిన పానుగంటి వెలుగుబాట!

అప్పరాయని పిల్లపూర్ణిమ - సుబ్బరాయుని యెంకి ఊసు
విశ్వనాథుని కన్నెపాట పల్లె పడుచుల ఒంపుసొంపు

కృష్ణపక్షపు తెలుగు జిలుగు బడుగు జీవుల శ్రినివాసు
కష్టకాలపు రా.వి.కథలు కావ్యవైద్యుడారోరుద్రుడు!

తురగకవనపు దళిత సాహితి - సూతకథల త్రిపురనేని
ఎగురవేసిన తెలుగు తేజం మరువలేనివి తెలుసుకో!

పాలమీద తరకలాగ కరుణ పద్యాల బుద్ధగీతం
కావ్య ఋషుల తపోఫలాల అందుకోను కదలిరవోయ్!

18.9.2012

(నగరా కవితా సంపుటి 2004 నుండి

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

వాడు తేడా!

కపిల రాంకుమార్// వాడు తేడా!//

ఉదయాన్నే సూరీడు
మబ్బుల్లో దాగాడు
తలవంచిన వరిచే్లు
చేతులెత్తి పిలువ
తొలగిన మబ్బులోంచి
కిరణాలు చాచాడు !
ఆవిరైన జలరాశిని
ఆత్రంగా వంచాడు
చేను చెలక గంతేసి
ఆనందం పండించే!
***
సర్కారీ సూరీడు
మబ్బుల్లోనే ఉంటాడు
గుబులు పుట్టినప్పుడల్లా
రేట్లు పెంచుతాడు
ధరను పాలించమంటే
ధరలకు పాలిచ్చి
ప్రజలనుసికొలుపుతాడు!

వాడు తేడా
లేలెండి ఇక
తాడో పేడో
తేల్చడానికి!

14.09.2012
__________
**తాజా కవిత**

13, సెప్టెంబర్ 2012, గురువారం

మధు -విద్యాలయం

కపిల రాం కుమార్// మధు -విద్యాలయం ( వైరా)//

మధురమైన  బడిలోన - విబుధులున్నచోటు
చవులూరె తేనెపట్టు - చదువులకే ఆటపట్టు!
సకల కళల రసపట్టు - అనుదినము వెన్నుదట్టు
గురుకులాల పద్ధతిలో ఫలితాలకు పెద్దపెట్టు!

గురువులను గౌరవించు - తరువులను పోషించు
సంప్రదాయ సాంకేతిక సంసర్గలు  సంగమించు!
చిరుమువ్వల సవ్వడిలో మనసుదోచి వీణమీటు
ప్రజాకళల ఉన్నతికి ప్రయోగాలున్నచోటు!

ఉద్యమాల స్పూర్తి తోన కాబోయే పౌరులకు
శిరోధార్య విధానాల కరదీపికలున్నచోటు!
ఉత్సవాల అతిథులకు ఉత్సాహపు వేడుకలు
కలకాలము నిలచిపోవు మరపురాని అనుభూతులు.!

13.9.2012
______________________________________
(** ఖమ్మం జిల్లా వైరా లోని ''మధు విద్యాలయం '' - పాఠశాల స్థాయి నుండి జూనియర్ కళాస్థాయికి ఎదిగింది - వారు గతంలో నిర్వహించిన ఒక వార్షికోత్సవంలో చదివిన కవిత)

12, సెప్టెంబర్ 2012, బుధవారం

ఎవరికీ పట్టదా?

కపిల రాంకుమార్// ఎవరికీ పట్టదా?

'' ఏం తినేటట్లు లేదు, యేం కొనేటట్టు లేదు ''
పాట విని బావుందని చప్పట్లు కొడతాం!
కాని.........
డీజిల్, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నా,
విద్యుత్ కోత చాల్దన్నట్లు ధరల్ వాత పెడుతున్నా,
కిలో సరుకులు సగానికి తగ్గించినా
ఖర్చు రెట్టింపైనా, జేబు చిల్లు పడినా.
కూలిపెరిగి, కూటికి చాల్కపోయినా,
దోమ కాట్లకు జనం చస్తున్నా,
కాకుల తరిమి గద్దల్ని మేపుతున్నా,
ఎవరూ మట్లాడరేం???
పీక తెగకోస్తున్నా స్పర్శలేని మౌనమేమిటో???

ఎవరికి పుట్టిన బిడ్డో వెక్కి వెక్కి యేడ్చినట్లు
ధర్నాలు, రాస్తా రోకోలు ప్రతిపక్షాలకే పట్టిందా???
లాఠీలు, టియర్ గ్యాస్ల్ -కాల్పులు మామూలేనని వూరుకుత్టారేం???
చానళ్ళకు చేతినిండా పనేగానా?
ఏం - ఓట్లప్పుడు వొళ్ళు తెలవదా??
నోటుకు--నాతుకు--ముక్కకు పడి దొర్లటమేనా?
ఘాటుగా ఒక్క గట్టి గుద్దు గుడ్డె చేవలేనితనం!
పిరికితనం ఆవిరిస్తే
వెనకబాటుతనం ఎప్పుడు పోద్ది!
చేతులతో గుద్ది, చేతులు కాలిన తరువాత
యే ఆకులు పట్టుకుని యేం లాభం!!!
ఐదేళ్ళు ఆగాల్సిందేగా???
కత్తిలాంతిది చేతిలోవుంచుకొని
ఉపయోగించలేని ఓటరుని
ఆపుతున్నదేమిటి???

పైగా ప్రజలు చైతన్యవంతులంటారేం! ఏది ఆ చేతనైనతనం?
మొలబంటి లోతులో దిగబడ్డ బుద్ధి రాదా???
నిండ మునిగిన తరువాత చలేమి్ వుండకపోవచ్చు!
మునిగే వుంటే శ్వాసే ఆగుతుందికదా!
ఆమాత్రం యింగితం కూడలేదా!
తిరుగుబాటు ధ్యాస కలుగదా!
లేక
శ్వాసే ఆపుకుంటారా!
మైకం నుండి ప్రజలు కోలుకోవాలని
మేలుకొని, వారి మేలుకొరకు
చర్నాకోలా ఝళిపించాలని కోరుకుంటూ.........!!!!!????

12912

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఎదురుచూపు

కపిల రాం కుమార్ //ఎదురు చూపు//

చివురుకొమ్మల లేజివుళ్ళే - కోకిలమ్మకు పుట్టినిళ్ళు
లేగదూడల కాలె అందెలె పల్లె సీమకు ఆనవాళు!

కథలలోన కవితలోన అందమైన ఊహలోన
పల్లె చిత్రపు రంగులన్ని వెల్లి విరిసినరోజులేవి?

ఏవి తల్లీ నీళ్ళు నిండిన చెరువు కుంటలు
ఏవి తండ్రి పొంగి పొర్లిన పాడిపంటలు

వన్నె తప్పిన పంటకాల్వలు
చిన్న బోయిన చెరుకు తోటలు
కళలు తప్పిన జనపదం
నేటి పల్లెకు నిలువుటద్దం!

నిద్రలేచిన పల్లె గుర్తుకు ఆవలించే జాడలేవి?
ఇంటికోడలి చేతి గాజుల వెన్న చిలికే సవ్వడేది?

పాలనురగల పిడతలిడగ దాలిమండగ పిడకలేవీ
జడలుచుట్టిన గాదె నిండక కడుపు నింపే కూడుయేది?
అట్ల తద్దికి ఆట లేవి ?
చెట్టుకొమ్మన వూయలేది?
ఏరువాకకు పాటు లేవి?
గంగిరెద్దు గంతులేవి?

చిల్లుకుండలు వెక్కిరిస్తే విరిగిపోయిన మట్టిచక్రం!
వల్లకాటిలో కాలుతూ మూగవోయిన సాలెమగ్గం!
రాజకీయం రాకముందు ఏక చత్రపు గూండె ది్టవు
(నేటి) రంగురంగుల రాక్షసానికి చిద్రమైనది నిండుకొలువు!

సప్త పుత్రుల కధలు చెప్పి నిద్ర పుచ్చే తల్లి వేదన
తప్త హృదయపు వెతలు తొలగె స్వచ్చమైన బతుకు శోధన!
ఆత్మ హత్యల తోరణాలతో పర్వదినపు తర్పణాలను
పాటలోన రాయలేను శిరసునింక వంచలేను!

శాంతి శూన్యం జాతి దైన్యం రూపుమాపే రోజుకోసం !!
తిరుగుబాటు ఆదునుకోసం ఏదురు చూచె పల్లె వాసం!!!

11-9-2012.

10, సెప్టెంబర్ 2012, సోమవారం

పిచ్చి తల్లి


కపిల రాం కుమార్ //పిచ్చి తల్లి//

హోదాల్కు తగ్గట్టు పేదరాలు లేదని
ఇల్లాలి మోజులో తల్లినే మరిచావా!
ఎండిన రొమ్ముతో ఎముకలగూడని
పనికిరాని వస్తువులా కాల్దన్న చూస్తావా!

మంచులాంటి చల్లదనం మల్లెదనం
పొత్తిళ్ళవెచ్చదనం మరచుట మరిపాపం
బడినూండి వచ్చునపుడు బడలిక చెందావని
ఒక్కపూట పస్తులతో నీ పడుపు నింపినాది.

తోటివారి దెప్పులకు బిక్కమొగమేసినపుడు
చొక్కలాగు కొనటానికి రొక్కమేమి లేకపోతే
మారాము చేసి నీవు మట్టికుండ పగులకొట్ట
మారుమాటచెప్పకుండ సూత్రాల్ను ఆమ్మినాది!

చిన్నపుడే నాన్నలేడని నీకేమి లోటు తేక
గుట్టుగాపెంచినట్టి గురువులాంటి తల్లిరా!
నీ చదువు ఈ తిండి యీ ఇల్లు నీ హోదా
రక్తాన్ని ఖర్చుపెట్టినీ మీదే ఆశపడే!

కొడుకు మీద ప్రేమతో చీరి రోజు కోసము
నిప్పుపెట్టు చేతులకై అర్థించగ వచ్చినాది!
నీ ముంగిట వాలిందని చులకనగా చూడబోకు
ముగ్గుబుట్ట నేడో రేపో రాలిపోవు రామ చిలుక!

మొదటి ముద్ద గోటితో పేరుపేరునందించి
మాట నేర్పిన మహిళకు మంచినీరు పోయవేమి?
మనిషివైతే కదిలారా! మనసు తలుపు తెరువ రారా!
నీ ధర్మం నెరవేర్చగ ఆదరమూ చూప రావా??

10-9-2012

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

నివాళి

రోదసిలో మరో రోహిణి నక్షత్రం చేరింది!
కొడవటికంటి కుటుంబం మనకు విషాదం మిగిల్చింది!
శాస్త్ర, సాహిత్య ప్రసాదం నిస్క్రమిస్తే
అభ్యుదయ లోకమంతా విస్తుపోయింది నేడు!.

>>>>>>కొడవటికంటి రోహిణీ ప్రసాద్ నిర్యాణానికి కవిసంగమం నివాళులు అర్పిస్తున్నది.

/పుస్తక మస్తిష్క వేదన//

కపిల రాంకుమార్//పుస్తక మస్తిష్క వేదన//

ఊసులేవో చెప్పటానికి మనసు నీతో విప్పటానికి
చేరవచ్చే మంచి నేస్తం -చెలిమి కోరే పుస్తకం!

నాటి కతలు చెప్పగానునేటి వెతలు తీర్చగానూ
మేటి రేపటి బాటనీకు తేట తెల్లం చేయగానూ

కష్టసుఖములు పూలతోటలుప్రేమ ద్వేషపు పోటకత్తులు
గెలుపు ఓటమి బొమ్మ బొరుసులు పుస్త్కాలే పూలగుత్తులై

బతుకు సంద్రపు ఆటుపోటులు ్చెల్ల చెల్లచెదదు చేయవచ్చును
గతుకు దారుల అలుపు సొలుపు సేదతీర్చి బలము నిచ్చును!

ఎల్లకాలం వుండనీకి కల్ల బతుకు తొలగటానికి
వాటి చెలిమి ఎంతో బలిమి పరులు దోచని జ్నాన కలిమి

పుస్తకాల పురుగులంటే పాడుచేసే చెదలు కావు
బూజుపట్టిన యెదలు తుడిచి ఎదుగనిచ్చే మంచియెరువు!

మంచిమాటలు చెప్పవస్తె చెవులకింపుగ సోకబోద?
జ్ణానసంపద పంచవస్తే అందుకోను కదలిరావా!

కోకిలమ్మల పాటలెన్నో పైరగాలికి కదులుతున్నాయ్
దేవదూతల నాట్య కేళి కనుల ముంగిట మెదులుతున్నయ్!

రాక్షస రాజ్యపు కథలెన్నో రహస్య చేదన శాస్త్రాలెన్నో
విశాల్ లోకపు గుప్త నిధులు తమలో మనకై దాచుకున్నాయ్!

జ్నాన లోకపు మర్మమేదో పొందటానికి కదలిరావా?
చెప్పటానికి చెంతకొచ్చిన పుస్తకాల్ మాట వినవా?

9-9-2012
______________________________________________________
( ప్రజా కవి- ప్రజా కళాకారుడు కీ.శే. సఫ్దర్ హష్మీ రాసిం హిందీకవిత """ కితాబే కుచ్ కహనా చాహితీ హై""" కి తెలుగు అనుసరణ - నా నగారా కవిత సంపుటి నుండి)

8, సెప్టెంబర్ 2012, శనివారం

అమ్మపాట

కపిల రాంకుమార్// అమ్మపాట//

ఊయలూపు అమ్మపాట - అనుకరించు మొదటి మాట
అనుభవాల గోరుముద్ద - నడిపించే వెలుగుబాట!

బాల్యంలో తప్పటడుగులెదుగుటకై ప్రాకులాట
ప్రాయంపుటంచుల్లో అపాయాలఊగులాట!

ఓనమాలు దిద్దుటలో - పిచ్చిగీతలందమూ
గురువునేర్పు నీతులే - మనుగడకనుబంధమూ!

అనుకరించు క్రమములో - అప శృతులు రానీకు
అనుభవాల గుణపాఠం అనుదినము మరువకు!

కులమంటూ,మతమంటూ - చెడువూహలు రానీకు
కలలంటూ - కథలంటూ కల్పనలో కదలాడకు!

మోసాలకు ద్వేషాలకు బలిచేయకు మానవత
ఎదిరంచే మదివుంటే - తొలి విజయం నీదంట!

తరతరాల సంస్కృతిని కాపాడుత నీ ధర్మం!
స్వార్థ పరుల ఆటకట్టనుద్యమించు అనునిత్యం

బడుగుల సవాల్

కపిల రాం కుమార్ // బడుగుల సవాల్//

మా తాతల్ కాలం - బహు గడ్డు కాలమనే చెప్పాలి!
పెద్దింటోళ్ళమనే పేరేకాని అది.. అంటరాని జాతిని అంటరానోళ్ళు పెట్టినదె!
యెన్ని పాబందీలు - యెన్ని అడ్డంకులు
తలచుకుంటేనే - అగ్ర వర్ణాల మీద అసహ్యం వేస్తోంది.

ఈ బామ్మర్లికి యాగ హవిస్సుకై అర్పించిన గోమాంసం కోసం
మా మాదిగోళ్ళతో పోటీపడ్డప్పుడు తగిలిన పిడిగుద్దులు యాదిలేదనుకుంటాను!
బసివిగ, మాతంగిగా, పార్వతిగా చేసి దేవుడికి పెళ్ళిచేసి
అచ్చోసినట్లు ఊరుమ్మడిగ అనిభవించి,
సామూహికంగా దోచుకున్న రోజులు గుర్తున్నాయి!

ఇప్పుడు అప్రస్తుతమైన గతచరిత్రైనా,
గతితార్కిక సూత్రాలు దీనికి వర్తిస్తాయి!
మృతకళేబరాలను వూరికి దూరంగా లాక్కెళ్ళి, చర్మం వొలిచి
తొట్టెల్లో వూరేసి, పసుపు, ఉప్పుల్తో శుభ్రపరచి
ఎండకు ఆరేసి, ఘూటంతో చదునుచేసి
చెప్పులుగానో, మోటబావి బొక్కెనకు తొండంగనో,
సవారీబండికి చర్నాకోలగానో నగిషీగ అల్లిస్తే వాడుకున్నారు!
సాలుకు యీనాంగ కంబళీ, ఓ తూముడొడ్లు, కళ్ళంలో
పరిగలేరుకొని తృప్ఫి పడినవాళ్ళం !!

వేలుముద్ర వేసేవరకు పెత్తందార్ల చెప్పుచేతల్లో నలిగినవాళ్ళం /మెలిగిన వాళ్ళం!
వేట్టోళ్ళంకద్ద భూమి శిస్తు వస్సూళ్ళకు
ఎవరిమొత్తకెళ్ళినా పరువు తక్కువ అనుకొని వెన్నులో వనుకు పుట్టెది వారికి!
కాని...
మా అవసరాల్కి గడీలముందుకెళ్ళి దొరముందు చేచాచాలంటే మాకు వనుకుట్టేది.
అది వృత్తికి, ప్రవృత్తికి వున్న తేడా!

వారు మోయమన్నజెండాల్ను మోసి,
ఎదిరివాళ్ళతో దెబ్బలు తిని
రక్తాలు చిందించి పానాలిచ్చిన వాళ్ళం!
సారాచుక్కకు, మాంసం ముక్కకు కక్కుర్తిపడి కొన్నేళ్ళుగ బానిసలైనోళ్ళం!
ఓటును రూపాయి నోటుకు తాకట్టు పెట్టం కాబట్టె - యిన్నాళ్ళు మా బతికులిట్టా తగలడ్డయి!

మాల సోదరులు నేసిం పంచెలచాపులు తేరగా దొబ్బి కులకటమే కాని,
వారిని ఆదుకున్నదిలేదు, పైపెచ్చు కరివేపాకులా వాడుకొని విసిరేసిన రోజులు,
వారి దాష్టీకాలు, గృహదహన్నలు, మానభంగాలు అన్నీయిన్ని కావు!
ఎన్నో యాదికున్నయి.!
గుళ్ళోకిరానివ్వకుండా నియంత్రించిన కార్పణ్యం యింకాగుర్తుంది!
ఆ కొట్లాటలోనే మా నాయన చచ్చింది యాదుంది!
మొసలి కన్నీళ్ళు కారుస్తూ సర్కారు చేసిన ప్రణాళికల్లో
వాడలు వేరుగా, బడులూ వేరుగ యేర్పాటుచేసినప్పుడే
వారి మనస్తత్వం, వర్గ స్వభావం విదితమయ్యింది!
ఉద్యమాల్ ఒరవడిలో కొందరు నేర్పిన చిలుక పలుకులే
అక్షర దీపం పుణ్యమా అని నేడు మా మహోన్నత ఉద్యమానికి బాటలు వేసింది!
మా లక్ష్యం యేమిటో, గమ్యం యేమిటో తెలిసింది!
యెల్లకాలం మమ్మల్ని మోసం చేయ్లేరు!
మా వాళ్ళను ఎన్నుకొని మీ చేత్తో పెత్తనం చేసే రోజులిక చెల్లవు!
బినామీ పరికరాలుగా వాడుకోటం యిక కుదరదు!
మా వాటా మాకు దక్కే వరకు, మా ఆత్మాభిమానం కాపాడుకునేందుకు
పోరుబాటలో విజయం సాధించితీరుతాం!
వర్ణవ్యవస్థ గొప్పతనం అర్థం కాని భాషలోచెప్పి ఊకదంపుడుపన్యాసాలు చెయ్యకండి!
ఎవరు ఏ పని చేస్తే వారిదాకులమని తెలుసుకోండి!
మాలో చదువుకుంటే బామ్మడు!
యుద్ధం చేస్తే క్షత్రియుడు!
వ్యాపారము, ఆర్థిక ఎదుగుదలచేస్తే వైశ్తులుగా
వ్య్వసాయము పశుపాలన చేసే శ్రామికులుగా మా జనం సర్వం సమిష్టిగా
పాటుపడితేనే సమసమాజం!
లేకుంటే వివాదమే!!
ఇక ఉదయించేది విప్లవమే!!

8/9/2012
___________________________________________________________________

***దళితవాడల అభివృద్ధి సైకిల్ యాత్రల సందర్భంగా కవిసమ్మేళనం ఖమ్మం

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అస్త్రం వినా_

కపిల రాంకుమార్ //అస్త్రం వినా__ //

పదునైన శస్త్రం లేదని
తోడుగ ఏ అస్త్రం లేదని
ఆకలి దప్పులకాలోచించక -

నడుముందుకు - మునుముందుకు!
ఆగక - ఊగక - లక్ష్యం చేరేందుకు!

శిఖరాలే చేరేటందుకు

ప్రాణాలె ఫణమొడ్డి
తనువు మనసు స్థిరపరచి

నడుముందుకు - మునుముందుకు!
వంగక వెరవక - లక్ష్యం చేరేందుకు!

అంబరమె నిప్పుల గుండం
తామసమే మారణగీతం
రుధిరానికి సత్తువ నంచ్చి

నడుముందుకు - మునుముందుకు!
తిప్పలు ముప్పులు లెక్క చేయక
వడివడిగ - లక్ష్యం చేరేందుకు!

కొత్తయుగమడుగిడగా
కొత్త జగతికి హారతులీయ
సంకుచితం పారదోలు

- పిరికితనం వదిలి
-మరణాన్నైనా కోరి

నడుముందుకు - మునుముందుకు!
త్వర త్వరగా - లక్ష్యం చేరేందుకు!

**7.9.2012
______________________________________________________
** సోహం లాల్ ద్వివేది హిందీ కవిత - '' బడే చలో '' కు స్వేచ్చానుసరణ - నా కవితా సంపుటి నగారా లోది - 2004. )

5, సెప్టెంబర్ 2012, బుధవారం

సౌజన్యం కొరవడినప్పుడu

కపిల రాం కుమార్ // సౌజన్యం కొరవడినప్పుడు//

నినాదాలు విధి విధానాలు కాకుంటే్ - చేసిన శాసనాలు ప్రహసనాలతై
నమ్మకంగా సేవ చేసే వారు -అపనమ్మకానికి గురైతే - తిరుగుబాటు చేస్తారు!

అంకురాలు మొల్కెత్తే పిడికళ్ళౌతాయి
గళాలు సవరించి యువత శిరమెత్తే కొడవళ్ళౌతాయి!

ఊకదంపుడు ఉపన్యాసాలు తాలు గింజలైతే-
కారం దంచిన రోకళ్ళే రాకెట్ లాంచర్లవుతాయి.


కౌంటరు వాదాలకు ఎనకౌంటర్లు సమాధానాలా?
రాజ్య హింస లక్షణం అదే కదా!

పాఠశాలలు, వైద్య శాలలు,ఏమైనా ఒకటే!
కామాంధుల్కు పానశాలలవటానికి- కామ మందిరాలవటానికి!

ఉన్మాదం '' ఎయిడ్స్" కంటే ప్రమాదం
శృతి మించిన వ్యామోహం వావి వరుసల్ని మార్చేస్తుంది!

''పోటీ పడి కాటులాడ'' - ఉదాహరణలిచ్చిన'' కాళోజీ'' భవిష్యద్దర్శ కుడే!
''ఏమున్నది గర్వ కారణం'' కవిత్వీకరించిన ''శ్రీశ్రీ ''భవిష్య వాణి వినిపించదా!
ఆందుకే మళ్ళీ మళ్ళీ ఆ కవితల్ని ఆపోసన పట్టండి!
జనం నాడిని, వాడిని, వేడిని పట్టడానికి!

ఎన్నికలలోనూ పెళ్ళి సన్నాహాలలోనూ ధనం మూలం ఇదం జగత్ చేసే నృత్యం
విలువల్ని మానవ వలువల్ని నిత్యం హరంచేవే! నగ్న సత్యం ఇది కాదా!

సజ్జ చేలూ, జొన్న చేలే కాదు - వరిచేలు సైతం
పూల సజ్జలౌతూంటే (SEZ లవుతుంటే)
కడలి అలజడికంటే ఘోరంగా మత్స్యకారుల జీవితాల్తో
లాఠీల చేష్టలు ఆరంగ్రేట్రం చేస్తున్నంత ఆనంద్పడుతుంటే
గంగవరం, పోలవరం, విశాఖ మన్యం, ఎక్కడైనా
గిరిజన సంస్కృతికి చితిపేర్చేవే!

హైటెక్కు నగరం పేరుకే కని పసిపిల్లల్ని వికలాంగులుగా చేసి
ముష్టిని వృత్తిగా రుద్ది లాభపడే లాబీయింగ్ మాఫొయాల
అడ్డాబాద్ (హైదరాబాద్) అవుతుంటే
మా తాతలు నేతులు తాగారు - మా మూతులు వాసన చూడండమ్మ
సర్కారీ ప్రకటనలు నవ్విస్తున్నాయి! - కాదు కొత్త ఉప్పెనకు
శంకుస్థాపనలౌతున్నాయి!

కపట ప్రేమలు వడ్డించినా
కంబళిలో భోజనం వెంట్రుకలే కాదు పాలకుల పెంటికలు
కూడ వస్తాయి..థూ! అనరాదు..అన్న వారు ఉగ్ర వాది!
వాడికి దండ పడినట్లే!
అసమానతలు ఆవరిస్తున్నా మబ్బుమాటు సూర్యుడంటూ
కల్లబొల్లి కబుర్లు, బతుకులు మబ్బు పట్టిన వైనం కానలేని కళ్ళకు
వాస్తవాలు రుచించవు!

కబోదికాపురం కుండల్కు చేటన్నట్లు,
''ఆం ఆద్మీ"" తనకుతానే ''దుష్మనీ"" ఔతున్నాడా?
లేక ''నఘర్ కా-న ఘాట్ కా"' తరీకాలో
సర్కారీ మోసాలకే బలౌతున్నాడా? తెలుసుకోడి!

సౌజన్యం కొరవడినప్పుడు కవుల్ కలాలకు
పదునుపెట్టే సమయిదే!
వాలిపోయే స్ట్రీట్ వదిలి చివురించే ఎర్రదేశాలకు మద్దతివ్వండి!
కొత్త కలాల్లో సమసమాజ ప్ద్యాలు దొర్లాలని కోరుకుంటాను!
'' పరిత్రాణాయ సాధూనాం ....సంభవామి యుగేయుగే '' లా
ఉద్యమాలకు ఉనికిపట్టు కావాల్సిన సమయం ఇదే ఇదే!!!

5-9-2012

**(ఉగాది కవి సమ్మేళనం - ఖమ్మం

3, సెప్టెంబర్ 2012, సోమవారం

నాయకుల(కుల లక్షణం)

కపిల రాంకుమార్//నాయకుల(కుల లక్షణం)

పరుల దోచు ఆటలోన - పరపీడనమతని శ్వాస
పదవిపేర మోసాలను - పదిలంగా చేయు '' 'నేత!"
అతడే నాయకుడు క్రౌర్యానికి వారసుడు
ఎదురు లేని రాక్షసుడు -ఎదలు చీల్చు కీచకుడు!

పడుచు పిల్ల కనబడితే అడుసుతొక్క వెరువడు
''అమ్మ" కాలు నరికేసి - ''అమ్మకాలు" సలుపువాడు!
ప్రజాధనం ప్రతి దినము కైంకర్యం చేయగలడు
ప్రజలంటే మూర్ఖులనును - గెలిపించే గొర్రెలనును!

తాత తండ్రినాటి నుండి - నేతృత్వం నేర్చినోడు
తల్లిపాలు మరచినోడు -రొమ్ములనే కోయువాడు!
పుట్టుకతో చెడు రక్తం - నిలువెల్ల విషతుల్యం
పాముకన్న తేలుకన్న అతడెంతో ప్రమాదం!

వాడి బ్రతుకు ఎండకట్టి ''వేడి " తరం కదలాలి
పదిమందిని కూడకట్టి ''వాడి క్రూర( కోర )" కూల్చాలి!

3-9-2012
* నా ''నగారా" కవితా సంపుటి (2004) లోంచి.

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

అ-రక్షణమే?

కపిల రాంకుమార్//(అ)రక్షణమే?//

**మూడు పదుల మీద మూడు
వత్సరాలు నిండిన
మన స్వాతంత్ర్య
స్వ(స్వాహా) రాజ్య లక్ష్మికి
ప్రతి అర-క్షణమూ
అ-రక్షణమే!

24-8-2012
( **8/1980 ప్రజాశక్తిలో ప్రచురితం)

అణాలు మీకోసం

కపిల రాంకుమార్//అణాలు మీకోసం//(అనే ప్రాసక్రీడలు)

జీవితంలో బాధల వ్రణం
పెరిగి పోయిన ఋణం
బంధువులాదరించని తరుణం

వెలివేయబడ్డ కారణం
శత్రువులు కట్టుకున్నకంకణం
ఆందుకే ఆహ్వానిస్తున్నా మరణం
హృదికి ఆత్మకు మధ్య రణం
ఇది వ్రణాల, ఋణాల, తరుణాల్, కారణాల, కంకణా
మధ్య రణం!
సాయం చేయండి ఏమయినా తృణం
పోనీ కొంచమయినా ఫణం
కట్టుకోండి పుణ్యపు తోరణం
వద్దు నాపయి కోపమకారణం
ఋణం ఉంచుకోను మరణానంతరం
పిత్రూణంలా తీరుస్తాను
ఉపాయం చెప్పండి కరుణతో
ప్రాసకోసం ప్రాకులాడుతున్న నాకు.

25.8.2012
*(1969 ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం లో సాహిత్య ఆదివారాల్లో బే

ఒరుగుతున్న అరక

కపిల రాం కుమార్// ఒరుగుతున్న అరక//26-8-2012

అరక బతుకున వెతలు ఎన్నో - కతలు కతలుగ చెప్పెదన్నా
గీచిగుడ్డకు మించియేది -పొందలేని బతుకులన్నా!

వేలిముద్రయేసియేసి ఏరువాకకుయెదురుచూసి
కోండ్రభూమికి అదనులేక మేడి అదురుకు ఒడలు నలిగె!
పుచ్చుటిత్తుల మొలకకోసం -ఎదురుచూసి నీరసించి
బాంకులిచ్చే అప్పుకోసం చేయి తడుపగ గొంతులెండె!

ఆరుగాలం కష్టపడ్డ ఆరుపుట్ల ధాన్య రాశి
ఎరువుకోసం, విత్తుకోసం షావుారి గాదె చేరె!
గంజినీళ్ళు తాగనీకి గింజ కూడ లేకపోతే
గుంజుకొచ్చే నరము బాధ నంజురోగం తెచ్చిపెట్టె!

బిడ్డ పెళ్ళికి డబ్బు ఉన్న చెక్క అమ్మివేసి
ఊరివారి బంతికోసం అప్పుచేసి చిక్కిపోతివి
నిరుటివరకు మోతుబరివి- నేటి సాలునకూలిపోతివి!
రామరాజ్యపు ముసుగులోన రైతు వెన్ను ముక్కలయినది

జాతికంతటి వెన్నుబొమికవి- పెరటి జొన్న కుళ్ళీపోయను
గూటిలోని పురుగు మందు మృత్యుగీతం పాడుతుండెను
గిట్టు బాటు ధరలలులేక చుక్కలెంక చూస్తువుంటే
అప్పులేమొ పెరిగిపోయి ఆత్మహత్య ల దారిచూపె!

ఆలుపిల్లల భవిత కోసం పాడి పంటల పెంపపుకోసం
అప్పు తీరే దారికోసం పప్పు బువ్వ కడుపుకోసం
చాకిరి ఒకడిది సుఖము వారిది-గతపు చరితల నడక మా ర్చగ
వెలుగు కోసం బతుకు కోసం పోరుచేయక తప్పదన్నా ...
అంతకన్నా దారి లేదు..............................!!!

ఇ-విడాకులు

కపిల రాం కుమార్//ఇ-విడాకులు//

అదాలత్ లో అమీనుగా పనిచేసే
అమీరంటే ప్రాణం
మొదటి ములాఖత్ - మొహబత్ గ పరిణామం

మా బాబా ఖాజీ అవటం
నా ప్రతిపాదనపై మోజు పడటం ్
షాదీ జరగటం అంతా ''అల్లా"" దయేననుకున్నాను!
ఏ దౌలత్ ఆశించకుండానే నిఖా ..
అన్ని సౌలత్ లతో బొంబాయి కాపురం!

>>>

ఇద్దరు పిల్లల తరువాత
అమీరులో మార్పు
సెల్ ఫోన్లో స్నేహాలు, ముదురు దోస్తుల్తో కహానీలు!
''నిఖా"" నాటి ''వాదా" లు మరచి
ఆస్తుల పై కన్ను - నా వంటిపై దెబ్బ పడటం షురూ అయింది!
ముసీబత్ నుండి రక్షణకు చట్టాన్ని ఆశ్రయించాను.
కాని..చట్టాలకు - చుట్టాలకు అతీతం కద సం ప్రదాయం!
నా పోరాటాఅనికి తాత్కాలికంగ అడ్డంకి ఏర్పడింది!
ఒకటే పరేశాను!

>>>

ఒక్ రోజు...
ఒంట్లో బుకారైతే
ఇల్లు కదలలేని నేను మావారితో
''బార్ కా బేకార్ బాత్ " రానన్నాను!
వీలు కాదన్నను!
అదే నాకు సంసారం లో
విఘాతానికి మూలమయింది!
కామం తో నా చెల్లెల్ని తనతో తీసుకు వెళ్ళినంద్కు
మగన్ని నిలదీసినంద్కు
సెల్ ఫోన్లో పిడుగు '' తలాఖ్ ! తలాఖ్ ! తలాఖ్ ! "

>>>

నా నసీబ్ ఇంతేనా? ఖురాం వ్సీయత్ యిదేనా?
ప్రశ్నించుకోవడం దండగ!
నా కావాలన్నా అతను నాకు దక్కడు!
నన్ను వద్దనే వానితో ''రాజీ" యేంది?
సిగ్గు వానికి లేక పోయినా నాకుంది
''బేశరం బద్మాష్ కు చోడ్దేవ్!"
నా కాళ్ళపైన నిలబడే సత్తా ఉన్నపుడు!
యిక షికాయతులు, పంచాయితీలు దండగమారివి!
తకదీర్ ఎలావుంటే అలా జరుగుతుందనుకునే మాయ మాటల కాలం కాదుకదా!
అందుకే నేనూ చెప్పుతో కొట్టినట్టు చెప్పేసా!
'' తలాఖ్ ! తలాఖ్ ! తలాఖ్ ! "
ఎస్.ఎం.ఎస్.లో.

28-8-2012

అల్పకల్పిత స్వల్ప కవితలు

//కపిల రాం కుమార్//అల్పకల్పిత స్వల్ప కవితలు// 22-8-2012
నోటితో అవునను
నొసటితో కాదు అను!
నిప్పు లేకుండా పొగ రాజుకున్నట్లే!

ఉత్తర చూసి ఎత్తిన గంప
స్వాతిజల్లుకు ముత్యంకాక
జొన్న చేను యీటుపోయింది!

రోట్లో దంచిన వడ్లు

పురిట్లో సంధికొ్ట్టినట్లు
ఊక పోగయిందేతప్ప గంజితాగనీకి మెతుకులేదు!

పాడిపంటలు నిండుకున్నాయి
ఓటికుండలు భగ్గుమన్నాయి,
పండుటాకులు రాలిపోతే పండువెన్నెల ఎవరికోసం!

కంటి్రెప్పలనాట్యమాగిన
దండవేసే చిత్రమగును
కంటిపాపలా ఆదుకున్న దండ మెట్టే మి త్రమగును

మా రక్తం కాదూ

కపిల రాం కుమార్ //మా రక్తం కాదూ! //
ఓ స్వాతంత్ర్యమా
నీది అపురూప సుందరనామం
అత్యంత ఆకర్షణీయ రూపం

అలాంటి నీవు
నా మట్టి గోడలపూరిగుడిసెలోకి
వస్తున్నవేమోననుకున్నను!
నీ అడుగుల సవ్వడికోసం
నిరంతరం నిరీక్షిస్తున్నాను!

కాని
డబ్బున్నవాళ్ళతో్
డాబుసరి వెలగబెట్టి
వారి జీవితం మాధుర్యం చేస్తున్నావు!

మొన్న ఒకసారి నిన్నుచూసి
కోపంగా అరిచాను! విన్నవు కావు.
ఓ ధనవంతుణ్ణి సుఖపెత్తడానికి వెడుతున్నావు!

మళ్ళీ ననిన్న
నల్లబజారు యజమాని వళ్ళో రాసక్రీడలో
ములిగినప్పుడు, నిర్ఘాంత పోయాను!

నువ్వేమీ చిన్న పిల్లవి కావు!
విలువకల కాలంలా
శీలంకల్లదానివఅనుకున్నాను!
ఏళ్ళు నిండిన ప్రౌఢవు సుమా!మరి ఈ రోజు
మా ఫాక్టరీ మేనేజరు
ఎర్రలిక్కరు అందిస్తూ నీకు విందు చేస్తున్నప్పుడు
అర్ద్రంగ నా గుండె స్పందదిస్తున్నది!

వాడు గ్లాసులో పోసిందేమిటి?
మా శ్రమ జీవుల్ ర్క్తం కాదూ???
థూ!

23-8-12 (ఆంగ్ల కవిత '' ఫ్రీడం" రచన "unnithiyaan" తమిళ కవి కి అనుసరణ)కాలం 1973

ఆరుద్ర కు ప్రణతులు

 కపిల రాంకుమార్

కొండగాలితో - గుండె ఊసులాడింది
కూనాలమ్మ తో ''త్వమేవాహం ""ఆనిపించి
లలితకళల మాజిక్కుల జిమ్మిక్కుల
చతురంగ బలాలను చదరంగా నడిపించి
తం వాదాన్ని వినిపించి
తెలుగు తేజాన్ని విశ్వవ్యాప్తం చేయాలని
జీవితాంతం ధారవోసిన మహర్షీ!
తనకండ నిలచిన రామలక్ష్మినీ

మనతో పాటు ఏడిపించి
కనుమరుగైన '' ఆరుద్ర ""
మరువ లేము
సాహిత్యపుటాలోచనలకు రాజముద్ర
సమగ్రాంధ్ర సాహిత్యపు '' కంఫెక్షనరీ""
మనకు అతడొక '' డిక్షనరీ ""
భూత-వర్తమాన-భవిష్యత్సాహిత్యదర్శకరుద్రపరిశోధకుడు ఆరుద్ర
ఆ-రుద్ర మహనీయుంకు నుతులు, ప్రణతులు......31.8.2012

పేల పిండి

కపిల రాంకుమార్//పేల పిండి//

చేతులు కలిపినంత తేలికగానే
చేతులూ నరుక్కుంటారు!
మూతులు ముడిచి గోతులు తవ్వడంలో
ఒకరికొకరు పోటీ పడతారు!
సీట్ల కోసం పేచీ పెటి- పదవికోసం బేరం పెట్టి
లేక పోతే సలాం కొట్టి
ఇంకేదైనా సరే చేస్తారు!
ఓట్ల కోసం కాళ్ళు పట్టి

గెలుపు కోసం ఒట్టు పెడతారు!
వాగ్దానాల మూఊటలందించినపుడున్న జోరు
పదవి దక్కగానే...
గాలికెగిరిపోయిన పేలపిండి తీరు.!

1.9.2012