Friday, July 19, 2013

ఎన్నికల కల

కపిల రాంకుమార్|| ఎన్నికల కల ||
**
పార్టీ మారినా నాకు సీటు ఖాయం
సొంత పార్టీలో నీకు వెన్ను పోటు నికరం!
**
రంగుల చక్రంగా
ఎన్నీకల రంగం
ఓటేసే యంత్రం
తేల్చునంతరంగం!
**
మాజీలకు గుబులు - తాజాలకు వగలు
మిత్రులకు పగలు - శత్రువులకు సెగలు
వాడి వేడి మాటలు - ఆచితూచి పావులు
పొత్తులలో జిత్తులు - ఎత్తుల గమత్తులు!
**
పెద్దకోడలికి - అడ్డు గోడకి రాపిడెక్కువ - నాడు
అధినేతలకి, అధిష్టానానికి తలనొప్పి - నేడు!
**
చొక్కాలు మార్చేటాప్పుడు
పార్టీ సిద్ధాంతాలెందుకు?
నిబద్ధత నిమగ్నత లేనపుడు
ప్రోపర్టీ రాద్ధాంతాలెందుకు?
**
మాజీలందరు
పార్టీలకు అల్లుళ్ళా ?
అలిగినప్పుడల్లా
వేరేపార్టీకి దూక్కుళ్ళా!
**
తల్లి - తండ్రి - అన్న - తమ్ముడు
భార్య - భర్త - మామ - కోడలు
ఒకరికొకరు పోటాపోటీ
తిట్టిన తిట్టు తట్టకుండ
ఒట్టుతీసి గట్టుమీదెట్టి
మన వారు గెలిస్తే చాలు
మనకింక ఢోక్క వుండదు!
**
నామినేషన్‌ స్థాయిలోనే
యిన్ని ఘర్షణలా
తీరా ఎన్నికల నాటికి
యింకెన్ని రక్తవర్షాలో
**
నిర్వచనాలకు అంతు చిక్కని
నేటిపొత్తులు
నిత్రుల పర్పరాగ సంపర్కంలో
కుక్కమూతి పిందెలు!
**
ప్రధాన శత్రువునోడించటానికి
కలసివచ్చే దెవరు?
శత్రువే మారినపుడు
సైద్ధాంతిక మొక్కుబడులెందుకు?
**
ఏ పార్టీ వారు అతీతులుకారు
ఏ పాటి తేడాలు సహించలేరు
నోటిమాటలే కదా మొత్తానికి కారు చౌక
బూతులు పండితేనే కదా చిత్రాలకు  వంద నడక
అందుకే అందుకున్నారు
పంచాంగపు జలతారు!
దుమ్మెత్తిపోసే అవధానులు
ఉమ్మేసినా సహించే వదాన్యులు!
19.7.2013 ....
***

No comments: