Monday, July 22, 2013

నిదురెట్ట పోతావు తమ్ముడా?**||

కపిల రాంకుమార్|| నిదురెట్ట పోతావు తమ్ముడా?**||

పాపికొండల నడుమ - గోదారి అందాలు
రేపొ మాపొ మాయమౌతావుంటే
నిదురెట్టపోతావు తమ్ముడా?
యెదురెళ్ళి ''కట్టడాల'' నాపరా?
గిరికోనల - గిరికూనల
సంబరాల రేల సమసిపోనీకు
అడివిలో రామ్ముణ్ణి ఆదరించిన శబరి
ఆనవాళ్ళనంతరించనీకు!
వనవాటిక సౌందర్యం కాపాడుట మన లక్ష్యం
పాలకుల ఆంతర్యం అమిత గర్హనీయం
మానవుని మనుగడకు మచ్చతెచ్చు పనులాపు
కోయల గోండుల పరిసరాలు కాపాడు
విల్లంబులు విప్ప పూలు జుంటితేనె కొమ్ముబూర
లేజింకల పరుగుల్లు వాగువంక పరవళ్ళు
ప్రకృతిని తుంచి సంస్కృతిని చంపి
పునాదిని సమాధిఉకి బదిలిచేయొద్దు!
ఖ్యాతి నశించితే ప్రోది చేయగలము!
జాతి నశించితే అనాథలమే మనము!
గుళ్ళు గోపురాలే కాదు,
ఊళ్ళకాపురాలు కూలు!
వేరు మార్గమేమి లేదు,
పోరుబాటె శరణము!
ఇంతమంది జనం యెలుగత్తి వస్తుంటె
జాగెందుకు - జాలెందుకు
తిరుగుబాటు చేసేందుకు?
తరతరాల వారసత్వపు జనపదాల సవ్వడులు
పరువు పరువున పరువులో పడకుండ
కలకాలం వెన్నంటి కదనదారి పట్టరా!
నిలువెత్తు సాక్ష్యాలు నీటపడకుండ
దీటైన మార్గాలు అనుసరించకుంటె
నిదురెట్టపోతావు తమ్ముడా!
యెదురెళ్ళి కట్టడాల నాపరా!

_________________________________
(**రచనాకాలం 15.12.2005 - '' జీవన్మరణం '' (పోలవరం సమస్య పై ఖమ్మం సాహితీ స్రవంతి కవుల ఐక్య స్పందన యాత్రానుభవంతో) ప్రచురణ.
_________________________________+
22.7.2013

No comments: