Saturday, July 20, 2013

| కుందుర్తి -( నాలోని నాదాలు) -మహతి

కపిల రాంకుమార్|| కుందుర్తి  -( నాలోని నాదాలు) -మహతి ||
ప్రతి మనిషి తనలో  తాను తీరిక చీకినప్పుడల్ల యేదో గొణుక్కుంటూనేవుంటాడు.. కవిత్వమొ, సంగీతమో, చిత్రలేఖనమో యేదో ఒకటి పైకి పెల్లుబికి వస్తుంది
**
చందస్సువంటి కట్టుబాట్లను తెంచేసుకున్నవారికి మళ్ళీ శైలికోసం పెనుగులాట యెందుకని వెంటనే ప్రశ్న వేస్తారు. కట్టుబాట్లను తెంచినది కేవలం తెంచడంకోసమే కాదు; మరొక పరమ ప్రయోజనం కట్టుబాట్లు సాధించడానికి , అందుకే ఆధునిక వచన గేయ కవిత్వంత్లో ఇటీవల ఒకానొక లయకు ప్రాధాన్యం యేర్పడింది. తాళ్ళపాకవారి వచనాల్కూ ఈ నాటి ఫ్రీవర్స్ కవితా రచనలోని నడకకూ చాల బేధంవుంది.  శబ్దానికి గాని, భావానికి గాని,  ఆ నాటి వచనాలలోని లయ వచనపు లయ. వచన గేయంలోని లయ కవిత్వపు లయ. ఈ రెంటికీ మధ్య సరిహద్దు కేవలం బుద్ధికి మాత్రమే తోచే స్వభావం కలది.
**
అంత్యప్రాస యెక్కువగా వాడిన ఆధునిక కవుల్లో  నేను ఒక్కణ్ణేనని కొందరు విమర్శకులన్నారు. ఈ లయ సాధించే కృషిలోనే నేనీపని నాకు తెలియకుండానే చేస్తున్నాననుకుంటాను. ఒకానొకప్పుడు నన్ను చూచి నేనే నవ్వుకుంటాను కూడ. ' అంతటి విప్లవం తెచ్చి అంత్యప్రాసలకు లొంగానని విహంగం వెక్కిరించింది ''. కాని యీ అంత్యప్రాస ప్రయత్నపూర్వకమా లేక సహజమా అని పాఠకుడు ఆలోచించే అవకాశం కూడ యివ్వ్నంత సహజంగావుండి దానికి తోడు భావ తీవ్రత కొట్టవచ్చినట్లుండే యీ అంత్యప్రాసల వల్ల అంత ప్రమాదం లేదనే నేననుకుంటాను.
**
ప్రస్తుతం మనకు అవసరంలేదు కాని  వచన గేయపు పంక్తి యెక్కడ, యెందుకు అంతం కావాలి అనే విషయంలో కూడ నిర్మాణాత్మక వైఖరి అవలంబించటం అవసరమని నేననుకుంటాను. అయితే చిన్న చిన్న విషయాలన్నీ కలిపి యింకో కొత్త చందో మార్గమైతే? కానివ్వండి అది వెర్రితలలు వేసిననాటికి దానిమీదా మరో విప్లవం అస్తుంది. అంతే కాని, భ్యంచేత, కావాలని, వచ్చిన లయలను వదిల్?ఏయటం, పంక్తిని యిష్టనిష్టాలను బట్టి విరవడం. అర్థంలేనిచోట ముగించడం మాత్రం అనవసరం! కాగావచన గేయమైన విశృంఖలం విహారం చేయరాదనీ, దాని నడకలోనూ ఓక లయ, పంక్తిలో ఒక నిర్మాణపద్ధతీ వుండాలని
సారాంశం. ఈపంక్తి  నిర్మాణ పద్ధతులు ఆయా కవుల యిష్టానిష్టాలనుబట్టి శతాధికంగావుండవచ్చు. స్థూలంగా ఒక నియమం అనేది మాత్రం వుండాలి.
**




|| నాలోని నాదాలు - కుందుర్తి ||

1.ఒకటి (వరుసలో కూడ)

ఈగ దూరను సందులేదు
ఇది అడివి
భూలోక మంతా కలసి జానెడు నిడివి
నాలోకి నేను వెడతాను!

జీవితం అన్వయం కుదరదు
అంతా అచ్చు తప్పు
అందం ఆకారంలేని పూరు ముడువని కొప్పు
ఊహల దండలు కడతాను

ఆత్మలోనే ఆనందం వుంది
అది విపంచి
తాకితే పలికే ధ్వనులు తలచి తల పంకించి
నాలోని నాదాలకు ఉలికి పడతాను
(పేజి. 1)

2. పదమూడు (వరసలో)

వంద చెప్పు, వెయ్యి చెప్పు
లక్షల్లో ఒకడుంటాదు
కవిత్వం చదివే వాడు!
వందిమాగధులు మిగతా వాళ్ళు;
పేజీలు తిరగేసి చూచి
ప్రయోజనార్థులు పొగుడుతారు!
గుండెలు ముక్కలుగా కోసి వండిన వంటకం గనుక
నీ కవిత, నీకు గొప్ప!
ఈ పూట చెప్పినమాట మాపటికి మార్చేవాడికి
పొగడిక బ్రతుకుదెరువు తెప్ప!
కవిత్వం రాస్తే సరా?
నేడు ప్రచారమే పెద్ద పని!
అనుకూల సమీక్షలకోసం అడ్డమైన అగచాట్లు!
పండితాభిప్రాయాల కొరకు
ప్రతి ఊరు తిరిగే రచయిత పడే యాతన దేవుడికెరుక!
కవిత్వం వినేవాడికి,
చదివేవాడు లోకువ!
సభలో యీలలు, గోలలు
సాగదీసి సంగీతం శ్రావ్యంగా వినిపించే వాడికి
పుష్కలంగా పూల మాలలు!
కావ్యానికి ప్రతిఫలం మహా వస్తే వంద!
కాగితం, ముద్రణ ఖర్చు తప్పదు
న్యాయంగా తనవంతు తీసికొని మిగిలింది వదలడానికి
ప్రచురణకర్తకు మనసొప్పదు!
(పేజీ 17)

3. ఇరవై మూడు ( వరుసలో)

నడుస్తున్న చరిత్ర కొప్పులో
ఉద్యమాల విరజాజులు
ముడుస్తుంది ప్రజావాణి!
ప్రాకే పరిమళాలవంటి మార్పుల్ని గ్రహిస్తుంది
కాలం విప్లవపాణి!

ఉదయిస్తున్న ఉర్వి యాత్రను
ఆపలేదు పోకిరి మంచు
చప్పుడు ఎంత చేసినా, మేలిమి విలువ
సాధించలేదు కంచు!

కాల స్వభావం గుర్తించి , గతం విస్మరిస్తే
వర్తమానం మన పొత్తు
ఈనాటి అనుభవాల యినుపగుగ్గిళ్ళు సేవించి
నిర్మిద్దాం విశాల భవిష్యత్తు!

అచలాన్ని నేను కదిలిస్తాను
అందుకే ప్రతిసారి వజ్రంలా పదునెక్కిన పాట
అమృతాన్ని నేను గౌరవిస్తాను;
అందుకే పక్షిలాగ ఎగిరే
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల బాట
వడివడిగా నడుస్తోంది చరిత్ర,
ఒంటరినై పోతాను బద్ధకించి వెనుకబడితే
హృదయంతో ఆహ్వానిస్తాను,
ఎదురేగి స్వాగతిస్తాను,
ఈలోగా మరో ఉద్యమం పుడితే!
(పేజి. 39)

సం|| కుందుర్తి
ఫ్రీవర్స్ ఫ్రంట్
హైదరాబాద్
15.12.1967
మొత్తం ముప్పై నాలుగు కవితలు ''నాలోని నాదాలు'' లోవున్నాయి. డిసెంబరు 1967 సుపర్ణ ప్రచురణలు -4 (ముఖ చిత్రం శిలా వీర్రాజు) అప్పట్లో వెల 1.50/-
___________________________
నోట్: స్థలాభావం దృష్ట్యా ముఖ్యమైన అంశాలనే యెత్తి చూపాను.

No comments: