Sunday, July 28, 2013

మది పిండిన ముదిగొండ

కపిల రాంకుమార్|| మదిపిండిన ముదిగొండ||
గుండె చెదరిన భావచిత్రం - యే కుంచెకూ చిక్కని రక్త ఛిద్రం!
నిద్రపట్టని రాత్రిలోన 
దిక్కుతోచక బిక్కుమన్నది పల్లె హృదయం!
గూడుకోసం - కూటి కోసం
నీడలేని జన సమూహం
ఒక్కచోట కూడినందుకు మూకుమ్మడి  ఖాండవదహనం!
అలసి పోయారు అర్జీలు పెట్టి
విసిగిపోయారు కచేర్ల తిరిగి
కదలనీ అధికార్లు - కాదు పొమ్మంటేను
గతిలేని స్థితిలోన - శిబిరాలు వేసారు.
కళ్ళుకుట్టిన కుళ్ళు సర్కారు
కర్కశంగా మారినాది,
మనుషులపై  మనషులచే చిచ్చు రగిల్చినాది!
హస్తముద్ర పాలకుల రిక్త హస్తదానం

అస్త్ర శస్త్ర వంటకాల రక్త దాహ రాజ్యం
పేదవాడు బక్కచిక్కి శల్యమవాలనీ
వాదులాడు హక్కువీడి శవమవాలనీ
ఎర్ర జెండా నీడ అంటే ప్రబుతకంత యేవగింపా
మాట తప్పే రాజ్యకాంక్షతో అణిచివేతల మోహరింపా!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు
కల్లుతాగిన కోతిమాదిరి కుప్పిగంతులేస్తూ
రెచ్చిపోయి పావురాలకుచ్చువేసిన చందం!
చచ్చేదాక జనాలను కాల్చిన యుద్ధం!
శిబిరమంతా కూల్చి, లాఠీలు, తూటాలు
పోటీపడి వీరంగమేయ తలపగిలి కొందరు
గుండాగిపోతే, చెల్లచెదరై కాళ్ళు నేలంత ఎరుపెక్కె!
అశోకుని కళింగయుద్ధం - తెచ్చిందట మహరాజులో మార్పు
ముదిగొండ చిందిన రక్తం - మార్చాలిక పాలక తత్వం!
మడమతిప్పని పోరు చేసి మడులుకట్టి పంటలేసి
బడుగు జనులశక్తి చూపగ గుడిసె జెండాలెత్తుతారు!
_______________________________
(ఖమ్మం జిల్లా ముదిగొండ కాల్పులు జూలై 28-2007 న జరిగింది)
________________________________
28.7.2013 ఉదయం 5.55

No comments: