కపిల రాంకుమార్ || కీ.శే. డా.కె. హరీష్ (ఖమ్మం)అముద్రిత కవిత||
నేను రచిస్తాను
ప్రవచించలేను
మోదుగుపూల
రక్తవర్ణరీతి
నా నడకకు సంకేతం!
నా మాట చెబుతాను
ప్రసంగించలేను
ఆర్తి నుంచి,
అన్నార్తి నుంచి
బానిసతనం నుంచి
అణగారిన ఆర్తిని
చస్తున్న అన్నార్తిని
రెక్క తెగిన ఆశని
జొజ్జొరికొట్టి లేపి
సూరీడి వెపు చూస్తూ
కనపడిన మోదుగు
పూల మందహాసాన్ని
గూర్చి చెప్పాలనివుంది!
ఇంకా చూడాలని వుంది!
రగిలిన గుండెనుండి
నెట్టె విడిచిన చెలకనుండి
రాజకీయం విడచిన విషప్పురుగునుండి
కలుషిత విపంచి అలజడినుంచి
మనిషి బ్రతికేందుకు
కిరాతకం తప్పదని
నా మాటగా చెబుతాను!
ప్రసంగం నాకు రుచించదు!
పోరాట ఆరాటాలకు పరిథి మరణమేనని
ఎదురొడ్డిన గుండెకు తుపాకి
గుండె సరిహద్దని
తెలిసి తెలిసి
తలెత్తి తెగిన తలల
స్థితికి రెచ్చిపోయి
నా మాటగా చెబుతాను
కలంబట్టి రాయలేను
కాలం కరిచిన
మనిషిగ మిగిలీ
మోదుగుపూల
రక్తార్ణవు రీతికి
దండాలు పెట్టి
యెదురుపడ్డ మనిషికి
నా మాటగ చెబుతాను
ప్రవచించలేను!
______
యెప్పుడు రాసారో తెలీదు..తాను చదివిన '' కవిత్వంపై ఎర్రజెండా ''
పుస్తకం, చివర అట్టలోపల (ఖాళీ)పేజీలో రాసిన కవిత)
12.7.2013 రాత్రి. 8.22
No comments:
Post a Comment