Wednesday, July 17, 2013

||ఆరుద్ర తో కాసేపు మండవ సుబ్బారావు ||

కపిల రాంకుమార్||ఆరుద్ర తో కాసేపు మండవ సుబ్బారావు ||
27-12-1987 ఉదయంజ్ 10 గంటలు - టి-నగర్ - మద్రాసు -
ఆరుద్ర గారిల్లు - ఆయన తన గ్రంథాలయంలో పుస్తకం చుదువుతున్నారు
మండవ: నమస్కారం!
ఆరుద్ర : (లేచి ప్రతి నమస్కారం చేసి కూర్చోమని సైగ చేసారు)
మండవ: గత రెండురోజులుగా మీరు అనేక విషయాలు చెప్పి, నా సందేహాలను తొలగించారు. ఇక చివరిగా 'త్వమేవాహం' గురించి కొన్ని ప్రశ్నలడుగుతాను. దయతో చెప్పండి
ఆరుద్ర : అలాగే. రికార్ద్ చేసుకుంటారా? రాసుకుంటారా?
మండవ: రాసుకుంటాను
ఆరుద్ర : మంచిది. అలా టెబుల్ దగ్గర కుర్చీలో కూర్చోండి. ఆ! అడగండి!
మండవ: '' త్వమేవాహం " అనే పేరు శ్రీశ్రీ సూచించినట్లు, దాన్ని మీరు పెట్టినట్లు కవి హృదయంలో చెప్పారు. అందరికి అర్థమయ్యే పేరు పెట్టవచ్చు కద!
ఆరుద్ర: శ్రీశ్రీ పెద్దవాడు చెప్పాడు కాబట్టి, గౌరవంగా ఆ పేరు పెట్టడం జరిగింది
మండవ: '' త్వమేవాహం " పేరు మీరంగీకరించటంలోనే సంప్రదాయ ముద్ర మీలోవుందని కొందరంటున్నారు. దానికి మీ జవాబు యేమిటీ?
ఆరుద్ర: సంప్రదాయ పునాది మీదే నడవాలి కదా! వైరు మీద నడిచే వాడి కర్రలు కూడ నేల మీడే నిలబడాలి కదా!
మండవ: ' త్వమేవాహం ' లోని కాంటెంట్ కు తగిన ఫారమ్‌ ను మీరు యెన్నుకోలేదు. అందుకే మీ ' త్వమేవాహం ' మిగిలిని కావ్యాలల పేలలేదని అనుకుంటున్నాను. మీరేమంటారు?
ఆరుద్ర: తెలంగాణా ఒక సంస్యే గాని కావ్యం ఒక సమకాలిక సమస్య. ప్రేరణ - తెలంగాణా. ఈతగాడు ఉపయోగించే స్ప్రింగ్ బోర్ద్ లాంతిది తెలంగాణా సమస్య.
మండవ : '' భళానోయ్ భాయి ' అనే బుర్ర కథ తెలంగాణా స్టెయిల్ కాదు కద?
ఆరుద్ర: కాదు అని నాకు తరువాత తెలిసింది.
మండవ: ఏ పాఠకుడ్ని ఉద్దేశించి మీ కావ్యం వ్రాయబడింది?
ఆరుద్ర: ' కవి ' ఏ ఒక్క పాఠకుడ్ని ఉద్దేశించి కావ్యం వ్రాయడు. కావ్యం ప్రజలలోకి వచ్చిన తరువాత అది వాళ్ళ స్తాయిని బట్టి అది ప్రయోజనం పొందుతుంది. 1940-50 లో చదువుకున్న చదువు ప్రభావం ' త్వమేవాహం ' లోవుంది.
మండవ: మిమ్మల్ని అభ్యుదయ కవిగా నిలిపే కావ్యాలేవి?
ఆరుద్ర: త్వమేవాహం, సినీవాలి, నా కావ్యాలన్ని అభ్యుదయ కావ్యాలే.
మండవ: మీరు ' ప్రయోగాల కవి ' మాత్రమే అనేవాళ్ళున్నారు, అదెంతవరకు నిజం?
ఆరుద్ర: కేవలం ప్రయోగాలకోసమే ఎవరూ కవిత్వం రాయరు! ప్రయోగాలు లేకుండ ఆరుద్ర లేడు!
మండవ: మార్క్సు వాదులు తప్ప అన్యులు అభ్యుదయ రచయితలు కారా?
ఆరుద్ర: మార్క్సిస్టు కాని వాడు అభ్యుదయ కవి కాడు. అభ్యుదయ కవి చెప్పేది మార్క్సిజమే. వేమన, గురజాడ మార్క్సిజం చరువుకోలేదు.ఆర్థిక ఒనరులపై చెప్పింది మార్క్సిజమే. మార్క్స్ చెప్పిన మాటలు చెప్పకుండా అభ్యుదయ కవిత్వం చెప్ప వచ్చును. 1942-43 లో మార్క్సిజం చదువుకోకపోతే ఈ కవిత్వం వ్రాసేవాడ్ని కాదు.
మండవ: మీరు మొదట అభ్యుదయవాదే గాని, తరువాత మానవతా వాదిగా మారిపోయినట్లు, కె.వి.ఆర్.నరసింహం గారన్నారు. మీ అభిప్రాయమేమిటి?
ఆరుద్ర: అభ్యుదయ - మానవతా వాదం వ్యతిరేకం కాదు. మార్క్స్ కూడ మానవతావాదే.
మండవ: మీరు ' త్వమేవాహం ' లో ఉపయోగించిన ప్రతీకలు ఎవరికీ అర్థం కావటంలేదు అనే విమర్శవుంది. మీరేమంటారు?
ఆరుద్ర: ఒక చెప్పుకోదగ్గ కావ్యం వస్తే దాని ప్రభావం రెండు తరాల యువకవుల మీద పడుతుంది. కొత్త్త ప్రతీకలు ప్రవేశపెడితే మొట్టమొదట వాటిని అర్థం చేసుకోడం కష్టమే. ఐతే కొంత సమయం తీసుకున్నాక అదే చదువరులకు ఈజీగా అర్థమవుతాయి.
నేను త్వమేవాహం లో రాసిన టెక్నిక్ లో పదాలు కొన్ని ఆ తరం వాళ్ళకణ్ణా ఈ తరం వాళ్ళకి బాగా అర్థమవుతున్నాయి.
మండవ: ఇప్పుడు మీరు సినిమా పాటలు రాయడంలేదు, యెందుకని?
ఆరుద్ర: ప్రస్తుతం సినిమా పాటలు నేను రాసే స్థితిలో లేవు.
మండవ: కవికి కమిట్మెంట్ అవసరమా?
ఆరుద్ర: అసలు కమిట్మెంట్ వున్న వాడే కవి. నా దృష్టిలో కమిట్మెంట్ అంటే కట్టూబడి వుండడం - ప్రజలకి, ధర్మానికి, న్యాయానికి!
**
(ఇంతలో ఆరుద్ర గారి మిత్రుడొకరు వచ్చీ రాగానే) ఆరుద్రగారు మీకు అభినందనలు!
(మండవ సుబ్బారావు గారితో ) మీకు తెలియిదా ఆరుద్ర గారికి 1987 సంవర్సరానికి గాను కేంద్ర సహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చింది!
మండవ: హృదయపూర్వక అభినందనలు !
ఆరుద్ర: థ్యాంక్స్ ! ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా?
మండవ: ఏ పుస్తకానికి అవార్ద్ ప్రకటించారు?
ఆరుద్ర: గురజాడ గురుపీఠం! ( చాలా తాపీగా సమాధానం. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చినప్పటికి యే మార్పు లేకుండా గత రెండు రోజులుగా యెలా వున్నారో అలానే సింపుల్ గా వున్నారు ఆరుద్ర)
మండవ: కవిత్వం ఆనందాన్ని కలిగించాలా?
ఆరుద్ర: ఆనందం కార్యోన్ముఖుణ్ణి చేయటానికి అవసరమేగా?
మండవ: అర్థం కాకుండా రాయటం వలన ప్రయోజనమేమిటి?
ఆరుద్ర: ''ఇ = ఎం.సి. స్క్వేర్ '' ఎవరికీ బోధపడ కాని ప్రజల కోసమే కదా!
మండవ: థ్యాంక్స్, నాకు సెలవు యివ్వండి. కలుస్తాను!
ఆరుద్ర: ఫర్వాలేదు. మీకు మళ్ళీ యేదైనా అవసరం వుంటే కలవండి!
మండవ: ఉత్తరం రాస్తాను!
ఆరుద్ర: మళ్ళీ జవాబు రాయటానికి నాకు తీర్కి దొరకదు. లేటైతే మీకు బాధ!
మండవ: సరే. వీలును బట్టీ, మరొక సారి కలుస్తాను.
ఆరుద్ర: విష్ యు ఆల్ ది బెస్ట్!
మండవ: థ్యాంక్స్!
_____________________________
ఈ ఇంటర్వ్యూ :ఆరుద్ర గారి ' త్వమేవాహం' కావ్యదర్శనం అనే విశ్లేషణ మండవ సుబ్బారావు (కొత్తగూడెం) 1995 జనవరి లో ప్రథమ ప్రచురణ. విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో లేదా మండవ సుబ్బారావు, ఇంటి నెం 9-40, లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం 507101.

No comments: