Saturday, July 27, 2013

|| మౌన ఘోష - ఎ. సోమసుందర్ ||

కపిల రాంకుమార్|| మౌన ఘోష - ఎ. సోమసుందర్ ||
ఆకలి వేస్తోందమ్మా! అన్నంపెట్టమ్మా!
స్వర్ణారుణానవ్యశ్యామలమగు
ఈ జగతిని, దరిద్రమున
ఆకలితో చావలేను!
ఆశా సుమమాలా
సౌరభమిది వీడలేను
ఆకలి!అమ్మా! ఆకలి!!
అన్నపూరణ గర్భగుడిని
ఆకలిగంటలు మ్రోగెను;
ఆరని ఆకలి కీలలు
భైరవ నాట్యం చేసెను;
ఘోరపరాజయమా ఇది?
మానవ మారణహోమం!
తల్లీ! ఆకలి....!ఆకలి...!!
ఆకలి నాగుల నాలుక
అగ్ని జ్వాలలనెగజిమ్ముతోంది!
అమ్మా....!ఆకలి!ఆకలి!
నా కడుపొక బడబానలమై
మండుతోంది తల్లీ...!
లోకం నరహంతక కంటకముల
కావృతమై ఘాండ్రిస్తోంది!
లోకం పరాన్నభుక్కుల చేతులలో
పరాధీమమై విలపిస్తోంది!
తల్లీ! ఆకలి...!ఆకలి...!
నాలో చెలరేగిన
ఆకలికంతిమ ఆశ్వాసం ఎచటో?
తుది మజిలీ ఎపుడో?
పేదల నిర్భాగ్యుల రక్తంతో
స్మశానాలు శాసనాల వ్రాస్తున్నాయవిగో...
అమ్మా! ఆకలి...!ఆకలి....!
నాలో, నరాలలో,
లోపలి గడియారం తలుపులు
ఘడియ పడిందెపుడో...!
ఆ కలి, నన్నీలోకంనుంచిచెడబాపులు
చేసేందుకు చూస్తున్నది!
అమ్మా...చావలేను; చావలేను!!
నరులందరికీ
సరిపోయే సిరిసంపదలతో
తులతూగే ఈ దేశం నాదమ్మా!
తల్లీ విడువలేను
నా, యీ, అందమైన లోక!
అమ్మా! ఆకలి...! ఆకలి....!
________________
సిందూరం వచన కవితా సంకలనం - యువభారతి ప్రచురణ
__________________
26.7.2013 రాత్రి 8.19

No comments: