Wednesday, July 17, 2013

కొన్ని కవితలు - మోహన విషాదం - కొప్పర్తి ||

కపిల రాంకుమార్|| కొన్ని కవితలు - మోహన విషాదం - కొప్పర్తి ||
1.కస్తూరి వాహకుడు
అతను
అప్పుడప్పుడూ వచ్చేవాడు
సంశయంగా కవిత్వం వినిపించేవాడు
తర్వాత, తర్చు వచ్చి
చొరవగా కవిత్వం వెదజల్లేవాడు
ఇప్పుడు రోజూ వస్తాడు
తన కవిత్వాన్ని అలవాటు చేశాడు
వొక్క రోజు
ఎప్పటిలానే వచ్చి వెళతాడు
అయితే ఆరోజు
కవిత్వం వినిపించలేదని మనకు తెలీదు.
(బి.వి.వి. ప్రసాద్ కోసం)
వార్త - సృష్టి 24.10.1998

2.మెలాంకలీ స్ట్రెయిన్‌
రాత్రి చాలా గడిచింది
నిదురంతా బయటికి ప్రవహించింది
ఎందుకో బాధ
సన్నని తీగలాంటి బాధ
లోహపు కవచమేదో లోలోపల గుచ్చుకున్న బాధ
బాధగా ఉంది
కారణమేదీ లేదు కారకులెవరూ లేరు
వొట్టినే బాధగావుంది
బాధకంటే కాస్త కూడ్శ తక్కువగా లేదు
ఇంకొంచెంసాపు ఇట్లాగే ఉండాలను వుంది
నులి వెచ్చగా వుంది
కొంచెం కొంచెం జ్వరంగా వుంది
వొళ్ళు వొళ్ళంతా కవిత్వంగా వుంది
ఆదివారం ఆంధ్ర జ్యోతి 19.3.2000

3.ఎ నైట్ మేర్
ఉదయం
తలుపు రెక్క తెరవగానే
శీతగాలి
న్యూస్ పేపర్ కోసం వెతికే కళ్ళకి
రాత్రి పడుకునే ముందు
ఇంట్లో పెట్టడం మరచిప్యిన
చిట్టి చెప్పులు కనిపిస్తాయ్ఎప్పూడూ
వాటినే అంటిపెట్టుకుని ఉండే
చిన్న తల్లి
వాటిల్లో కాళ్ళుపెట్టి
రాత్రంతా నిలుచున్నట్టు
వొక ఊహ
శీతగాలితో కలిసి
కోత పెడుతుంది.
వార్త -సృష్టి 2.11.1996

4. ప్రతి క్రియ
నీది
కటిక నేల మీద అన్నం పెట్టిన
పశున్యాయం
శవాల బట్టలు కట్టుకోమన్న
శవ నాగరికత
ముట్టుకున్నందుకు మరణశిక్ష వేసిన
విలోమస్మృతి
కాకులతోపాటు పొండాకూడు పంచిన
పిండ సంస్కృతి
ఇనుప ఆభరణాల్ని తగిలించిన
లోహ చరిత్రా
అతనిప్పుడు నాగరికుడవుతున్నాడు
నిన్ను నాగరికుణ్ణి చేస్తున్నాడు
ఆదివారం ఆంధ్ర జ్యోతి 17.6.1995

5. అగ్ని సూక్తం
రాళ్ళలో
ఎండిన చెట్టు కణాల్లో
అంతర్హితంగా
ఆకాశంలో సముద్రంలో
అరణ్యంలో హిరణ్యంలో
ప్రచ్ఛన్నంగా
గడ్డగట్టిన చీకటి రాత్రుల్లో
సవితృ శకలంగా
ఆటంలో ఆక్సిజనులో
సూత్రంగా
సూక్తంగా
జంతువుల్ని భయపెట్టిన
అనాగరికం నుంచి
యజ్ఞ వాటికా గానాలనుంచి
పాతివ్రత్య పరీక్షల మీదుగా
సతీ సహగమనాల మీదుగా
ఒక ప్రవాహంలా
మోస్తూ, సహిస్తూ
రగుల్చుకుంటూ, మిగుల్చుకుంటూ
నిఖిల లోకం
నిరంతరంగా.
(రాహుల్ సాంకృత్యాయం ' రుగ్వేద ఆర్యులు చదివి)
ఆంధ్రజ్యోతి సాహితీ వేదిక 26.2.1996.
____________________________________________
జూన్‌ 2003 ప్రథమ ప్రచురణ
కొప్పర్తి వెంకట రమణ మూర్తి, 35-56-5 పబ్లిక్ పార్క్ పక్కన, మాంట్ సోరీ స్కూల్ వద్ద తణుకు 534211 పశ్చిమ గోదావరి జిల్లా అన్ని ప్రముఖ పుస్తక విక్రయ శాలలలో లభ్యం రు.30/-
_____________________________________________
1.7.2013 6.1O AM

No comments: