Sunday, July 28, 2013

అప్పుడూ - ఇప్పుడూ అదే తంతు

కపిల రాంకుమార్||  అప్పుడూ-ఇప్పుడూ - అదే తంతు ||

ఆరు రుచుల ''విరోధా''నికి, ఆరంగేంట్రం
ఐదేళ్ళైనా అదే తంతు '' జయ '' కు!
ఎన్నికకు ఎంపికకు
''ఎన్నికలలో''
ఎన్ని ' కలలో ' - ఎన్ని ' కల్లలో '
ఎల్లలు దాటించడానికి
దింపుడుకళ్ళలెన్నో!
ఉంపుడు పెళ్ళాలకోసం

తంపుల గొళ్ళలెన్నో!
కల్లబొల్లి కబుర్లకు
తల్లి చెల్లి వరుసలకు
వరిపొలాల్లోంచి దౌరాను
మిరప తోటలకి తిప్పాలి
చేతులట్టుకున్నా, చేతులంటుకున్నా,
మూతులు నాకినా, తుడిచినా, తడిపినా, యిదే అదును!
కాళ్ళట్టుకోవడాలు
కళ్ళకద్దుకోవటాలు
వేళ్ళు పట్టడాలు, కాళ్ళకు బలపాలు కట్టినపుడే!
**

సాహిత్యంలో విరోధబాస - అలంకారమే కాని
విరోధిభాష వికటిస్తేనే - రసాభాస!
మొన్నటిపొత్తుల్లో పెట్టిన ముద్దుల మూతులు
నేడుగుద్దులాడబోతే పెట్టాయి బుంగమూతులు!
**
ఎగ్గుసిగ్గులేనివాళ్ళు అటు యిటూ మారుతుంటారు
కుబుసం వీడిన నాగేంద్రాల్లా
యేపుట్టలోనైనా దూరుతుంటారు!
కొత్త అంగీ దొరుకుతుందంటే - పదవికోసం
పరువును పరుపులో కలిపేస్తారు!
సతుల మార్చైనా, పర పతుల యేమార్చైనా!
కంబళిలో భోంచేస్తు వెంట్రుకలపై విసుగెందుకు
నిజాయితీలోపించిన పార్లమెంటరీ భ్రమలెందుకు?
అయినా లొంగుతాం
మాటలకు ఒంగుతాం

శీలం పోయిన తరువాత
గగ్గోలు పెడతాం!
**
ప్రజాస్వామ్య జాతరలో ఎన్ని బోనాలో
నరబలులే జరుగుతాయో
ఖరపాద పూజలే కొనసాగుతాయో
తినపోతూ రుచులెందుకూ
ఆడబోయే తీర్థాలే యెదురౌతున్నప్పుడు?
**
ప్రపంచ రంగ స్థలంలో
సంభవించే ప్రతీది కళాత్మకమే!
చావైనా, బతుకైనా
ప్రపంచీకరణ వచ్చాక ప్రతీది పోరాటమే!


_______________________________
2009 లో రాసినా.....పరిస్థితులలో స్వల్ప మార్పు.
________________________________
28.7.2013  ఉదయం 10,50

No comments: