Sunday, January 6, 2013

సముద్రం-1

“సముద్రం స్వేచ్ఛలో స్వేచ్ఛను వెతుక్కొంటున్న నీటిచుక్కను నేను… ”
సముద్రం
1
నేను చూసివచ్చిన సముద్రం ఊసేమని చెప్పనూ
నా టెలివిజన్ కన్నుల్లో విను
నా మనసు మీద చెవి పెట్టి చూడు
నేనే క్యాసెట్‌నై రికార్డ్ చేసుకొని వచ్చిన
సముద్రం సంభాషణను విను
నా రక్తం ప్రతిధ్వనిస్తున్న
సముద్ర నిశ్వాసాన్నీ
నా ఊపిర్లు ప్రతిస్పందిస్తున్న
సముద్ర విశ్వాసాన్నీ విను
నా పాటయే మనిషయి ప్రతిఫలిస్తున్న
సముద్రం నిన్నూ నన్నూ ఆవహించనీ
ఎంత దూరం నుంచి నడచి వచ్చానో
సముద్రాన్ని చూడాలని.
అడవినై
ఆకుపచ్చ సముద్రం కోసం ఆక్రోశించాను.
గుహనై సముద్రం చీకటి లోతులలో
వెతకడానికి
నెత్తుటిలోని వెలుగునంతా
కళ్ళల్లోకి తెచ్చుకున్నాను.
కొండనై తల ఎత్తిచూసి
నదినై పరుగెత్తికొచ్చాను.
ఎన్ని యుగాలనుంచి ఎన్ని తరాలనుంచి
ఎన్ని దశలు ఎన్ని అవస్థలు, ఎన్ని వ్యవస్థలు
పడిలేస్తూ నడకలు, పరుగులుగా
సముద్రం నన్ను చూడాలని
సీమాంతాలనుంచో
చీకటి చెల్లిన చోటునుంచో
సముద్రం మొదలైన చోటునుంచో
నడచివచ్చిందో
అలలు అలలుగా
తెరలు తెరలుగా
తరగలు తరగలుగా
ఎగసిపడి కెరటమై వచ్చిందో
చీకటి సముద్రం, నల్లటి సముద్రం
నీలం సముద్రం, ఆకుపచ్చని సముద్రం
మెత్తని తెల్లని
నురుగులాంటి చిరునవ్వుతో నన్ను తాకి ంది
అన్ని సముద్రాలలో తానై
తనలో ఆన్ని సముద్రాలై
నా కాలివేళ్ళలో మునివేళ్ళు పోనిచ్చి పిలిచింది.
వేళ్ళ సందులలో నీళ్ళు నింపుతూ సముద్రం
విభజించబడ్డ భూభాగాన్ని
కలుపుతూ సముద్రం
నిలచిన గులకరాళ్ళను అరగదీస్తూ
నా నిలచిన పాదాలకింద
నీళ్ళ చక్రాలు తిప్పుతూ
సముద్రం రైలు,
సముద్రం బయలు, సముద్రం మెయిలు
సముద్రం జీవితం స్టయిలు
ఏమున్నది సముద్రం
నీళ్ళూ, ఉప్పెనా తప్ప
ఏమున్నది జీవితం మాత్రం
కన్నీళ్ళూ, తిప్పలూ తప్ప
సముద్రం నెత్తురు
నీళ్ళైన మాట నిజమే
సముద్రం కన్నీరు పెట్టిన మాట నిజమే
సముద్రం కన్నీళ్ళు
విరహకవి దుఃఖంలా మధురవేదన కాదు
నీ, నా కన్నీళ్ళవలె
ఉప్పుగానే వున్నాయి
కాని సముద్రం కన్నీళ్ళై కరగలేదు.
సముద్రం కన్నీళ్ళలో మురగలేదు
సముద్రం ముంచెత్తింది గాని
తాను మునగలేదు
సముద్రం ఉన్నది
సముద్రం తానన్నది
నడచి, నడచి, నడచి
గడచి, గడచి, గడచి
పడిలేస్తూ అలలు అలలుగా
తానొస్తున్నానని అన్నది
రక్తంలో ప్రతిధ్వనిస్తూ సముద్రం
నా పాటలో ప్రతిఫలిస్తున్న సముద్రం
బతుకు పోరును
సముద్రం హోరులో విన్నాను
బతుకు లోతును
సముద్ర కెరటంలో
బతుకురీతిని
పరుచుకున్న సముద్ర వైవిధ్యంలో
చదువుకున్నాను.
ఏమున్నది సముద్రం
నీళ్ళూ, ఉప్పూ
ఉప్పెనా తప్ప
ఏమున్నది జీవితం
చీమూ నెత్తురూ
పోరాటం తప్ప.
***
కవి మిత్రుల కొరకు వరవరరావు సముద్రం -1
6-1-2013 ఉ.10.34
in.

No comments: