Friday, January 18, 2013

కపిల రాంకుమార్ || ఏమని చెప్పుదు?||***

ఏమని చెప్పుదు నేనేమ్ని చెప్పుదు
తల్లి వేదనను కానరాని కామందుల
కామాంధుల దౌష్ట్యం!
తొట్టిలోన బుజ్జి తండ్రి
పాల కోసం గుక్కపడితే
పైటేలకు గుండె సలుపుడు
పోదమంటె సేటు వదలడు!

నొసట రాసిన కాయ కష్టపు
ముదనష్టపు బతుకు మాది
రేయింబవ్లు రెక్కలాడినా
బుక్కెడన్నా దొరకబోదు.!

బిడ్డకేకకు కళ్ళు చెమరె
రైక బిగువుకు వొళ్ళు తూలె
లేని వారి కడుపు తీపిది!
కలిగ్నోదు కానలేడు మరి!

కన్నబిడ్డ కడుపునింప దొడ్డిదారిన వస్తవుంటె
దారికడ్డంవచ్చినాడు దొర్-కుక్కలాగ పట్టినాడు!
శక్తికొలది పెనుగులాడి నడుము నొక్కిన చేయి కొరికి
వంగినాను - పాలబరువుకు కుంగినాను కుప్పమాదిరి!

కిందబడ్డ నన్ను చూచి ఆబగాను మీదకొస్తే
లేని సత్తువ తెచ్చుకోని ఊరువుపైన తన్నినాను!
అయ్యో మంట - అతడు - అమ్మో అంటూ నేను
ఒకరినొకరు వెంబడించ సజ్జపైనే పరుగు పరుగు!

హోరు గాలికి కొమ్మ విరిగి
తొట్టిలోని బిడ్డజారి
తూలిపడెను - ఒడిని చేరెను
బిడ్డనవ్వుతు యెదను తాకెను!

పుచ్చె పగిలిన కాయ మాదిరి
పుచ్చ కాయ దొరలినట్లు
నేల గుచ్చిన గడ్డపలుగుకు
తేలకళ్ళు 'దొర ' వేసినాడు!
కూటికోసం పల్లెలొదలి
పట్నమొచ్చిన కూలివాళ్ళం
మాయదారిుమోతుబరుల
కుతంత్రాలకు బలైయ్యే పశువులం
ఇప్పుడైనా ఒక్కటౌదాం -జులాయి కుక్కల తరుమ
కూలి బతుకున వెలుగుకై బక్కటోళ్ళకు దారి యేదాం!

*భవన నిర్మాణంలో మహిళా కార్మికులవెతలపై వాస్తవ సంఘటనకు స్పందన!
(18.11.2001) - యిది ఫిబ్రవరి జనకవనం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో చదివినది)<<<18-01-2013 >><< ఉదయం 5.46>>

No comments: