Friday, January 25, 2013

సమకాలీన కవిత్వంలో - నిఖిలేశ్వర్,

సమకాలీన కవిత్వంలో

- నిఖిలేశ్వర్, 9177881201
01/10/2012

TAGS:

ఆరేడు దశాబ్దాల మీదుగా పయనించిన మన సమకాలీన తెలుగు కవిత్వం ఒక సజీవ ప్రవాహం! ఈ ప్రవాహంలోని ఆటుపోటుల మధ్య కొందరు కవులు మాత్రమే తమ సత్తాను నిరూపించుకోగలిగారు. మరికొందరు పదాల అల్లికతో, ప్రాసల గారడీతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక సామాజిక- రాజకీయ అవగాహన లోపించిన కొందరు అంతే త్వరగా కాలగర్భంలో కలసిపోయారు. ఆత్మ సంతృప్తికోసమే రాయాలనుకునే కవులు ఎటుతోచని స్థితిలో ఏదో ఒకటి రాస్తున్నారు. తమ భావజాలాన్ని సంక్లిష్టంగా వ్యక్తీకరించి చివరికి- ‘‘ఎవరికీ అర్థంకాని నా కవిత్వం ఎవరిని ఉద్ధరించడాని’’కని మానుకున్నారు. ఇక మానవీయ సంవేదనను గుండెలకు హత్తుకునేలా వ్యక్తంచేసిన కవులు ఏ కాలంలోనైనా స్వల్పంగానే వుంటారు. దృశ్య- శ్రవ్య అనుభవాలను అంతే గాఢంగా అక్షరీకరించేవారు కూడా కొందరు మాత్రమే! వచన కవితా ప్రక్రియలో రచనలు చేస్తున్నవారు ఈ రోజు వందలాది సంఖ్యలో వున్నారు. వీరిలో చాలామంది ఏదో ఒక అంశంపై వెంటనే స్పందించి, పత్రికలకు ఎక్కేయాలనే ఆదుర్దాకొద్ది వ్యాస రచన సరళిలో రాసి కవిత్వమని భ్రమపడుతున్నారు. సుప్రసిద్ధ కవులు కొందరు నిస్సారమైన కవితలతో గత కీర్తి పెట్టుబడిగా ఉద్భోదలు చేస్తున్నారు. సమాంతరంగా మరోవైపు పునరుద్ధరణ ధోరణితో పద్య రచనను ప్రోత్సహించాలని, పౌరాణిక గాథలను- కులీన వాదనలను తిరగదోడుతూ, అదే మన సంస్కృతి పరిరక్షణ అని ఊదరగొడుతున్నారు. కవిత్వరూపమేదైనా సమకాలీనతను, ఆధునిక హేతువాద స్పృహను కోల్పోతే ఆ కవిత్వానికి ప్రాసంగికత వుండదు.
ఉద్యమశీలిగా నిరంతర చైతన్యంతో ప్రజలను స్పందింపచేసిన తెలుగు కవిత్వం- భావ, అభ్యుదయ, దిగంబర- విప్లవ భావజాలంతో సాహిత్య సామాజిక దిశలను స్పష్టంగా చూపించింది. ఆయా చారిత్రక దశల్లో ప్రజా ఉద్యమాలకనుగుణంగా వివిధ అస్తిత్వ పోరాటాలతోనూ తన అద్యాయాలను లిఖించింది. ముఖ్యంగా గత పాతికేళ్ల కవిత్వాన్ని నిశితంగా పరిశీలించినపుడు, తెలుగు కవిత్వ దశ-దిశ మారిపోయిన వాస్తవాన్ని అర్థంచేసుకోగలం. వివిధ అస్తిత్వ వాదాల మధ్య కొనసాగుతున్న సంభాషణలో, ఎన్నో వాద-వివాదాల చర్చలతో ప్రస్తుతం కవులు అనేక పాయలుగా- గ్రూపులుగా విడిపోయారు. కులం, ప్రాంతం, బాల్యం, ప్రపంచీకరణ, పర్యావరణ, మతం వంటి సమస్యల చుట్టూ కవిత్వం పరిభ్రమిస్తున్నది. వీటి ప్రమేయం లేకుండా అనిబద్ధ కవులుగా చలామణిలో వున్నవారు కొందరు, తామే అచ్చమైన కవిత్వం రాస్తున్నామని- తమ అంతరంగాల చీకటి గదుల్లో తచ్చాడుతున్నారు. కోల్పోయిన తమ గతంలోని ఆనందాన్ని- మాధుర్యాన్ని లేదా విషాదాన్ని ఏకరువు పెడుతూ వ్యక్తిగత ప్రతీకలు- ఉపమానాలతో తమకు మాత్రమే అర్థమయ్యే కవిత్వం రాస్తున్నారు. ఈ కవుల రచనా ప్రక్రియకు (ఉత్పత్తికి) ఎలాంటి ఎరువు - విద్యుత్తు అక్కరలేదు.
ఇక ఈ దశలోనే గతానుగతికంగా వచ్చిన ధోరణుల గురించి క్లుప్తంగా ప్రస్తావించి ఒక అంచనాకు రావాలనుకుంటే -
సామాజిక న్యాయంకోసం, ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా దళిత సాహిత్యోద్యమం ఈ దశలోనే పురోగమించింది. కవితాపరంగా కొందరు శక్తివంతమైన అభివ్యక్తినివ్వగలిగారు. దళిత కులాల స్పృహకు- చైతన్యానికి పూలే- అంబేడ్కర్- మార్క్స్ తాత్వికత ఒక దిశను చూపించింది. అట్టడుగు ప్రజల వేదనలకు- ఆకాంక్షలకు గొంతునిచ్చింది. అయితే వర్గీకరణ గొడవల్లో అనవసర రాద్ధాంతం చేసుకున్నారు కొందరు దళిత కవులు!
సమాంతరంగా స్ర్తివాద కవిత్వం ‘దేహరాజనీతి’ని అధిగమించే క్రమంలోనే- నిస్సంకోచంగా తమ శరీర బాధలను- అవమానాలను గాధలను బలంగా వ్యక్తంచేస్తూ పురుషాధిక్యతను సవాలుచేయగలిగింది. అనేక కోణాల్లో ప్రసరించిన ‘స్ర్తివాదం’ చివరికి పునరావృతమై స్తంభించిపోయింది. సామూహిక సామాజిక పోరాటాలను విస్మరించి వ్యక్తిగత పరిష్కారాలకు- పురస్కారాలకు పరిమితమైపోయింది.
మరోపాయ- మైనార్టీ అస్తిత్వవాదం. ముస్లీం సోదరుల ఆత్మనివేదన, సాంఘిక వివక్ష (మతపరంగా)కు ప్రతిరూపమే తెలుగులోని ముస్లిం కవిత. సాంస్కృతికంగా- భాషాపరంగా ఈ మైనార్టీ కవిత్వం తన విలక్షణతను కొంతమేర నిరూపించుకుంది. అయితే అవసరాన్ని మించిన ఉర్దూ పద బాహుళ్యంతో కవితాభిమానులకు అర్ధంకాకుండా, అధోపీఠికల (చ్య్యిఆ శ్యఆళఒ) అవసరాన్ని నొక్కి చెప్పింది.
కొంతకాలంగా ప్రాంతీయ అస్తిత్వ సమస్యల నేపథ్యంలో ఆయా మాండలిక పద ప్రయోగాలతో కవిత్వం వచ్చింది. తెలంగాణ ప్రజలు తమ ప్రాంతీయ సంస్కృతి పరిరక్షణకు ఆత్మగౌరవానికి, జల వనరుల సౌకర్యానికి రాజకీయంగా- పాలనాపరంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మాండలికంలో కవితలు- కథలు ఆయా సంకలనాలు సంపుటాలుగా వెలువడుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు తొలగిపోడానికి ప్రజల బాధలను - గాథలను వారి వాడుక భాషలో- యాసలో వ్యక్తం చేయడం ఒక సాహిత్య పరిణామం. అయితే మాండలికాన్ని కృత్రిమంగా సందర్భ రహితంగా ఉపయోగించినందువల్ల కవితా రచన పేలవమై నిస్సారమైపోయింది. తెలంగాణ తెలుగు మాత్రమే అచ్చమైన తెలుగు భాష అని మన తెలుగు భాషా పరిణామక్రమాన్ని, చారిత్రక వికాసాన్ని నిరాకరించడం అవివేకమైన చర్య. తెలుగు ప్రజల ఉమ్మడి సాహిత్య- సాంస్కృతిక వారసత్వం ఒక చారిత్రక సత్యమనే యధార్థాన్ని విస్మరించలేము. ఈ దశలోనే ఒక మంచి పరిణామం- తెలంగాణ ప్రాంత సాహిత్య- సాంస్కృతిక రినైజాన్స్- పునర్ వికాస క్రమంవల్ల అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఆయా దశల్లో వచ్చిన మన అత్యాధునిక తెలుగు కవితా పరిణామాల నేపథ్యంలో ఆలోచిస్తే- ప్రపంచంలోని ఏ భాషలోని కవిత్వానికైనా సమానంగా సమ ధీటుగా - సగౌరవరంగా మన కవిత్వం నిలిచిందనే వాస్తవాన్ని మరచిపోలేము. ఇంగ్లీషు- హిందీలో వచ్చిన ఆయా భాషా కవిత్వాల అనువాదాలను చాలాకాలంగా చదువుతున్న అనుభవంతో నేను ఈ మాట చెబుతున్నాను. ఇక ప్రస్తుతం మన వర్తమాన దశను నిర్మొహమాటంగా- విమర్శనాత్మకంగా అంచనా వేస్తే ఎదుటవున్న దృశ్యం - అస్తిత్వం - కవుల కెరీరిజం - ఆశ్రీత పక్షపాతం - ముఠాతత్వం - నేల బారుగా వస్తున్న శుష్కమైన రచనలు- ఉద్యమాల పట్ల భ్రమవిచ్ఛిత్తి, అంతిమంగా ఖరీదైన అందమైన అట్టల వెనుక ఊరేగుతున్నాయి. అందువల్లనే ఈ అసంబద్ధమైన పద చిత్రాలను, పేలవమైన భావజాలాన్ని చూసి - ఇంతకు మన కవిత్వం దిశ ఏమిటి? అని కొందరు విమర్శకులు- పాఠకులు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు జవాబుగా మనం- గత దశాబ్ద కాలంలో వచ్చిన అసంఖ్యాక కవితా సంకలనాలను- వ్యక్తిగత సంపుటాలను పరిశీలించవచ్చు. మిత్రులు రామచంద్రవౌళి, దర్భశయనం, పాపినేని విడివిడిగా వార్షిక కవితా సంకలనాలు వెలువరిస్తూ సమకాలీన కవిత్వానికి వేదికలవుతున్నారు. జిల్లాల వారిగా సంకలనాలు వచ్చాయి. వీరందరిని మనం మనసారా అభినందించవచ్చు.
ఇంతకు ఈ కవితా సంపుటాలు- సంకలనాలు పుస్తకాల షాపుల్లో ఒక మూలన పడివున్నా కొందరు తెలుగు కవులు కీర్తికాంక్షతో - కొంత నిష్కామకర్మతో ఆర్థికంగా నష్టపోయినా, వందలాది సంఖ్యలో తమ కవితా వ్యవసాయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆత్మసంతృప్తితో పేఠికలు, పొగడ్తలు స్వాతిశయంతో విజృంభించేసరికి, ఈనాటి కవిత్వాన్ని చివరికి ఆ కవులు మాత్రమే చదువుకుంటున్నారనేది మరో చేదు నిజం! ఇటీవల ఒక పాజిటివ్ పరిణామాన్ని మన గమనించవచ్చు- ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల ద్వారా తెలుగులోకి కొత్త కవులు రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వేలాది మంది ఈ కవిత్వాన్ని పంచుకుంటున్నారనే వార్తను ఆహ్వానిద్దాం మనసారా! కవి సమ్మేళనాలు - సామూహిక పఠనాలు క్షీణించిన ఈ దశలో ఇదో శుభపరిణామం. కవిత్వంలో ఎప్పుడైనా నూతన వ్యక్తీకరణ, భాషపై పట్టు కొత్త అనుభవాలతో వచ్చే ప్రతీకలు, నిజాయితీ, సరళత్వంతోపాటు కవుల జీవన నిబద్ధత- స్పష్టమైన సామాజిక అవగాహన- గాఢత వుంటే తప్ప అంతరంగంలోని నిజం కవిత్వంగా వెల్లువెత్తదు. అలాగే ఈ వర్తమాన కవితా పరిదృశ్యంలో ఇప్పుడు మహాకవులు - కవితా ప్రవక్తలనే వారు ఎవ్వరూ లేరు!!
కవిత్వం మెదడులో వున్నంత కాలం గర్భస్థ శివువే అని అంటున్న కొడవటిగంటి కుటుంబరావుగారు ఒక వాస్తవాన్ని విడమర్చి చెబుతున్నారు- ‘‘ప్రచురణ అయినప్పుడు అన్ని కవితలూ ఒక్కటే- వాటి జాత్య లక్షణాలు భిన్నం కావచ్చు గాక - కాని బయటికి వచ్చి, పుష్టి సంపాదించుకుని, పెరిగి పెద్దవై చరిత్ర ప్రసిద్ధాలవుతాయి. కొన్ని ఈసురోమంటూ జీవిస్తాయి. కొన్ని పురిట్లోనే సంధిగొట్టి పోవటమూ కద్దు.’’ (జ్యోతిమాస పత్రిక - జనవరి 1970)
ఇక అంతిమంగా కాలం మాత్ర నిర్దయగా కవిత్వంలోని చెత్తాచెదారాన్ని ఊడ్చి పారేస్తూనే వుంది. చక్కని చిక్కని ఉత్తమ కవిత్వాన్ని రాసే కవులను అక్కున చేర్చుకుంటున్నది! మనందరి అనుభవంలోకి వస్తున్న యధార్థమిది!http://archive.andhrabhoomi.net/content/contemporary-poetry

No comments: