Wednesday, January 16, 2013

కొయ్యగుర్రం : ప్రకృతి – ప్రభుత – ప్రజలు

కొయ్యగుర్రం : ప్రకృతి – ప్రభుత – ప్రజలు

koyya011.jpgది 1977వ సంవత్సరం. ప్రకృతి దివిసీమపై కన్నెర్ర చేసింది. నవంబర్ 19న పోటెత్తిన ఉప్పెన ఒక్కసారిగా వందలాదిమందిని మృత్యువాతన పడేట్టు చేసింది. తుపాను కరాళనృత్యంలో కోట్లాది రూపాయల ఆస్తి సముద్రంలో కరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది. ఇదంతా దివిసీమ ఉప్పెనగా తెలుగు వారందరికీ చేదు జ్ఞాపకం. ప్రకృతి మనిషిపై కన్నెర్ర చేస్తే నోరు తెరుచుకుని చూడడమే సాధారణ మానవుడెవడైనా చెయ్యగలిగేది. తుపాను హెచ్చరికల వ్యవస్థ మన దగ్గర వున్నప్పటికీ ఉప్పెనను గుర్తించలేకపోవడం మన శాస్త్రవేత్తల వైఫల్యం. విపత్తు సంభవించిన చోట హుటాహుటిన జనజీవనాన్ని ప్రతిష్టించే కార్యక్రమాలు (డిజాస్టర్ మేనేజ్ మెంట్) చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యం. గూడూ గుడ్డా సమస్తం సముద్రంలోకి కొట్టుకుపోయాక మోడుల్లా మిగిలిన మనుషులను ఆదుకోకపోవడం అధికార యంత్రాంగపు వైఫల్యం.  ఇదంతా ఓ సృజన కళాకారుడికి కవితా వస్తువయింది. ఆ కవిత తెలుగు భాషలో ఆధునిక రాజకీయ కావ్యమైంది. అదే కవిత సాహిత్యాభిమానులకు నిత్య మననీయ ఆధునిక గానమైంది. ఆ కవిత పేరు ‘కొయ్యగుర్రం’. ఈ వారం దీన్ని పరిచయం చేస్తున్నాను. 
మానేపల్లి హృషీకేశవరావనే కవి ‘ఉదయిచని ఉదయాలు ‘ కవితా సంకలనం వెలువరించారంటే ఆహా అనుకుంటాం. ఆ పేరుతో ప్రసిద్ధుడైన కవిని మనం ఎరుగం. విరసం ఏర్పడక అర్థ దశాబ్ద కాలానికి ముందర 1965లో ఇదే కవి మరో అయిదుగురు కవులతో దిగంబర కవితోద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడే తన పేరును ‘నగ్నముని ‘గా మార్చుకున్నారు. తెలుగు సాహిత్య లోకంలో సంచలనం సృష్టించారు. 1977లోనే కొయ్యగుర్రాన్ని రచించారు. ఇప్పుడు నగ్నముని కొయ్యగుర్రం అంటే ఓహ్ అంటాం. ‘కొయ్యగుర్రం’ వస్తూనే అనేక ప్రభంజనాలు, దుమారాలు రేపింది. ఈ కవిత వెలువడి నేటికి మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంలో ప్రజాస్వామ్య ప్రచురణలు ‘కొయ్యగుర్రం’ కొత్త ఎడిషన్ ప్రచురించింది. ముప్పై ఏళ్లకిందట వెలువడిన కావ్యానికి మనోహర్ దత్ ముఖచిత్రాన్ని అందిస్తే, తాజా ప్రచురణకు రమణ జీవి ముఖపత్రాన్ని చిత్రించారు. దేశ విదేశాల్లోని అనేక భాషల్లోకి అనువాదం పొందిన ఈ ‘కొయ్యగుర్రం’ కవిత వర్తమాన సందర్భంలో చదవడం అదో రకమైన అనుభూతి.
జరిగిన విపత్తు దాచేస్తే దాక్కునేది కాదు. అరచేతుల్తో ఆపలేనిది. భయంకర వాస్తవం. కేవలం ముందస్తుగా తుపాను రాకను పసిగట్టలేక, చెల్లాచెదురైన బాధితుల్ని ఆదుకోలేక, పునరావాస కార్యక్రమాలు చేపట్టక ఉదాసీనంగా వుండిపోయింది ప్రభుత్వం. కాబట్టి ఈ దురాగతంలో హంతకి మరెవరో కాదు ప్రభుత్వమే. హతులు ‘అలగాజనం’. కాని జరిగిన ఘోరాన్ని కవిత్వీకరించాలి కదా – కళ్లకు కట్టినట్టుగా చెప్పాలి కదా! అందుకే కవి పదే పదే నెపం వేరేవాళ్లమేదకి తోసేస్తారు. నాలుగో భాగం లో తొలిసారిగా-
చివరి విందులో
చివరికి తననెవరు మోసం చేస్తారో
జీసస్ కి తెలుసు
హంతకులెవరో నాకు తెలుసు
నెపం కాసేపు సముద్రం మీదకి తోస్తాను

ఈ మాటంటారు. వెంటనే వచ్చిన ఐదోభాగంలో “నెపం కాసేపు కాలం మీదకు నెట్టేస్తాను “అంటూనే “నెపం కాసేపు ప్రకృతి మీదకి తోసేస్తాను ‘అని రెండుసార్లు చెప్తారు. ఎనిమిదో భాగంలో మళ్లీ “అయినా నెపం కాసేపు సముద్రం మీదకి తోసేస్తాను “అనంటారు. ఇక చివరిదైన పన్నెండో భాగంలో “నెపం నా మీదనే వేసుకుంటా“నంటారు. నెపం తోసింది ఎవరిమీదకో కవి చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ పాఠకులకు కవి అసలు ఉద్దేశాలు అర్థమవుతున్న కొద్దీ అసమర్థ ప్రభుత్వంపై నెమ్మది నెమ్మదిగా కోపం పెంచుకుంటూ పోవడంలో రచయిత సఫలమయ్యారు.
కావ్యంలో మొదటి మూడు అధ్యాయాలలో ఒక కవి తత్వాన్ని వర్ణించిన నగ్నముని మూడో అధ్యాయంలో కవిగా తన ప్రత్యేక తత్వాన్ని స్పష్టపరుస్తారు. తన పొట్టలోంచి ఒక పేగును బయటకు పీకి ఏకతార వాయిస్తూ కవితను గానం చేయడానికి కవి పూనుకున్నాడు. ఈ నగ్న సత్యాన్ని వినగల, విని భరించగల ధీరులకోసం కవి గాలింపు మొదలవుతుంది. అసలు కవిత ప్రారంభించడమే పాతను తూలనాడడంతో మొదలవుతుంది. జీవితం మిథ్యంటారు వేదాంతులు. అది అబద్దమని పొలికేక పెడుతూ ‘కొయ్యగుర్రం’ ప్రారంభమవుతుంది. నీచమైన కాకులు మాత్రమే మిథ్య మాటలు మాట్లాడుతాయంటారు. పాత పురాణాల పద్ధతిని పరిహసిస్తారు. కొత్త జీవితపు ఎరుకను ఏర్పరుచుకోమంటారు. దీనిద్వారా తాను చెప్పబోయే విషయానికి పాఠకులను మానసింగా సంసిద్ధులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చేయకపోవడం వల్లనే భావ కవిత్వాన్ని (రొమాంటిక్ పొయట్రీ) తొలిసారి రాసిన ఎస్.టి.కోల్ రిడ్జి తన ‘లిరికల్ బాలాడ్స్ ‘కు సవివరమైన పీఠిక (ప్రిఫేస్) రాసుకోవాల్సి వచ్చింది. ఆ తప్పు మళ్లీ తెలుగు కవి చేయలేదు. కవితలోనే మొదటి మూడు అధ్యాయాల్లో పాఠకులను  సన్నద్ధపరుస్తారు. 
నాలుగో అధ్యాయంలో నవంబర్ 19న వచ్చిన దివిసీమ ఉప్పెన దుర్ఘటనను ప్రస్తావిస్తారు. ఉప్పెన ముఖ్యాంశం కాదు. ఉప్పెన దివిసీమను తాకిన తేది ముఖ్యాంశం కాదు. అందుకే అంటారు-
కేలండర్ కి రక్తమాంసాలుండవు కేవలం కాలం కుక్క నోటిలోని ఎముకముక్క
గోడకు బల్లిలా కరుచుకుపోయిన వుత్తి
కాగితం ముక్క
తారీకులు ముద్దాయిల్లా బోనుల్లో నిలుచునుంటాయి
అది ఏ తారీకన్నా కావొచ్చు
అది నవంబర్ 19 కావడం యాదృచ్చికం కావొచ్చు
.” అయిదో అధ్యాయంలో జరిగిన ప్రకృతి బీభత్సాన్ని కవి చాలా నేర్పుగా వర్ణిస్తారు. జరిగిన ఉత్పాతానికి కారణం మరెవరో కాదు సముద్రుడే. అంటే బతకడానికి అవసరమైన నీరే బతుకును కడతేర్చింది. దాన్నే కవి ఎలా చెప్తున్నారో చూడండి:
మనిషి ఊపిరి కొయ్యడానికిkoyya02
కత్తే కానక్కర్లేదు
జీవితాల్ని చెరచడానికి
మరుక్షణం మృతకళేబరం చెయ్యడానికి
తుపాకులూ యుద్ధాలే రానక్కర్లేదు
నూరేళ్లు నవ్వుతూ తుళ్లుతూ వేయిరేకలతో
వెలుగులు వెదజల్లుతూ పుష్పించవలసిన బతుకుల్ని
భగ్గున మండించెయ్యడానికి పెట్రోలే అక్కర్లేదు
ఉప్పు నీళ్లు చాలు
దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే
గొంతు పిసగ్గలదు
.”
అంతే. నీరు అలగాజనం ఉసురు తీసుకుంది. పోయినవారు పోగా మిగిలినవారిని పరామర్శించడానికి అధికారులు, రాజకీయ నాయకులు వచ్చారు. వెళ్లారు. ప్రకటనలు చేశారు. కానీ ఒరిగిందేమీ లేదు. ఒకప్పుడు సస్యశ్యామలమైన ఆ ప్రాంతం ప్రమాదం తర్వాత శవాల పోగులతో నిండింది.
బలహీనుడు సంపద సృష్టిస్తాడు
బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచుతాడు.
చరిత్ర నిండా దరిద్రుల శవాల గుట్టలే
” అని చెప్తూ ఈ భాగాన్ని ముగిస్తారు.
ఆరో అధ్యాయం చాలా కీలకమైనది. రెండే పదచిత్రాలు ఉన్నప్పటికీ కవి ప్రణాళికలో ముఖ్యమైన భాగమిది. ఈ విషయం చెప్పడం ద్వారా నగ్నముని పాఠకులను స్వయంగా చెయ్యి పట్టుకుని తన ప్రపంచంలోకి లాక్కుపోవడానికి వీలైంది. బ్రహ్మాండమైన ఎత్తుగడ. బుద్ధుడిగా మారనున్న సిద్ధార్థుని సాగనంపిన అశ్వమింకా అతడి ఆగమనం కోసం నాగార్జున కొండలో ఎదురుచూస్తూనే వుంది. కానీ మనిషిలో మహాబోధి మిగల్లేదు. ఎప్పుడో కూలిపోయింది. మానవీయత అడుగంటింది. ఆధునిక మానవుడు మనసులేని చెక్క (డ్రై వుడ్) అయ్యాడు. ఆ చెక్కతో చెయ్యబడిందే కొయ్యగుర్రమనే పాలన మంత్రాంగం – ప్రభుత్వం. ఈ కష్టాలన్నీ స్వతంత్ర ఫలాలు పొందిన తరం తన భవిష్య దేశాన్ని తయారుచేయడంలో విఫలమవ్వడం వల్ల వచ్చినవి. నగ్నముని తన కవితలో ఇవేమీ చెప్పలేదు. కేవలం గుర్రం ఇంకా బుద్ధుడి కోసం చూస్తున్నా, మనిషిలోని మహాబోధి కూలిపోయిందంటారు.  తర్వాతిదైన ఏడో అధ్యాయంలో తాను కొయ్యగుర్రాన్ని దేనికి ప్రతీకగా ఈ కవితలో వాడుకుంటున్నారో స్పష్టపరుస్తారు. ఎనిమిదో భాగంలో జరిగిన నేరంలో దోషులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.
నిద్రపోతే కలలు కళ్లను కుడతాయి
కదిపితే తేనెటీగలు ఒంటిని వెంటాడి మరీ కుడతాయి
 కదపకపోయినా నోరు మెదపకపోయినా
క్షుద్ర రాజకీయాలు
నిండు జీవితాల్ని కుడతాయి
.” అని సూటిగా అనడానికి ముందర ఈ విషయంలో పాఠకుని బుర్రలో పుట్టబోయే చిల్లరమల్లర సందేహాల్ని ఇలా నివృత్తి చేస్తారు.
తీరమతటా గుడిశె వుందని తెలుసు
పాలుపోసే చేతినే అదను చూసి పడగకెరటాల కోరలు
కాటేస్తాయని తెలుసు

అంటే అన్నీ తెలిసినా ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా వుండడంద్వారా ఈ దురాగతానికి సహకరించిన రాజ్యవ్యవస్థ పాత్రను బహిర్గతపరుస్తారు.
తొమ్మిదో అధ్యాయంలో నగ్నముని ఆ భీకర రాత్రిని వర్ణిస్తారు. ఆదమరిచి అంతా నిద్రపోతున్న వేళ సముద్రం తన కెరటాల బాహువుల్తో దివిసీమను బంధించి ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కవి మాటల్లో చెప్పాలంటే…
నదుల మంచినీళ్లని కౌగిలిలోకి
తనివితీరా తాగితాగి తెగబలిసిన కొండచిలువలాkoyya03
మెలికలు తిరిగి
కాలంపై భూగోళంపై ‘అలగాజనం’ ముఖాలపై
వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజలంపై
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి
నీటితో పేనిన తాళ్లతో గొంతులు బిగించి
కెరటాల్తో కాటేసి వికటాట్టహాసంతో బుసలు కొడుతూ
పరవళ్ళు తొక్కింది
మనిషి బతికుండగా దాహం తీర్చలేని
ఉప్పునీటి సముద్రం
మిగిలింది కెరటాలు కాదు
శవాల గుట్టలు
శరీరాల్నుండి తెగిపోయి గాలికి ఊగుతున్న
ఊపిరి దారాలు
.”
ఇది ఇలా జరుగుతుందని మన నిస్తేజపు పాలక వర్గానికి తెలియదా? తెలుసు. కాని, నిర్లక్ష్యం. సముద్రం పక్కనే ఎలాంటి రక్షణాలేని అలగాజనం ప్రాణాలు ఉంటే ఎంత, పోతే ఎంత అనే భావజాలమున్న వారే అధికారంలోకి వస్తూ వుండడం మానవ దౌర్భాగ్యం. దాన్నే పదో అధ్యాయంలో చెప్తారు:
బతుకుల్ని నిలబెడతామని బుజాలెక్కి కూచున్న వాళ్ల
అలక్ష్యానికీ అహంకారానికీ సాక్ష్యాలుగా
మిగిలిపోయాయి
అయినా మరేం పర్వాలేదు
కంకాళం సంజాయిషీ కోరదు
.”
కొయ్యగుర్రాన్ని దేనికి ప్రతీకగా వాడారో ఆ భావాన్నంతటినీ పదకొండో అధ్యాయంలో నగ్నముని వివరిస్తారు. కవి హృదయంలోని ఆవేదన, ఆక్రోశం ఇందులో వాడిన ప్రతిమాటా చాలా ఖచ్చితంగా బయటపెడ్తాయి.
ఇప్పుడు కొత్తగా సముద్రం చంపేదేమిటి
ఇప్పుడు కొత్తగా కొయ్యగుర్రం చంపేదేమిటి
మరేం పర్వాలేదు
ప్రజాసేవ చెయ్యడానికి కావలసినంతమంది
పోటీలుపడే నాయకులున్నారు
శవాల్ని ఖాళీ చెయ్యడానికి కాకులూ గద్దలూ రాబందులూ
లేకపోయినా పర్వాలేదు
కాంట్రాక్టర్లున్నారు
జాతికి సేవ చేస్తారు

అలా ధ్యానంలో మునిగిన కవికి నిస్సత్తువ ఆవహిస్తుంది. ప్రజల బాగు చూడాల్సిన ప్రభుత్వపు చేతగానితనం నిరాశ కలిగిస్తుంది. అందుకే…
ఈ వ్యవస్థలో
పుట్టడం మోసపోవడానికే
పెరగడం మోసపోవడానికే
ప్రేమించడం మోసపోవడానికే
నమ్మడం మోసపోవడానికే

అంటూ అందులోంచి పుట్టిన కోపాన్ని ప్రజలమీదకి మళ్లిస్తారు. కొయ్యగుర్రం లాంటి వ్యవస్థను తయారుచేస్తూ భరిస్తూ తరిస్తున్న అలగాజనాన్ని విసుక్కుంటారు.
రోడ్లపక్క ప్లాస్టిక్ చెట్లు నాటుదాం
ప్లాస్టిక్ కొమ్మలపై ప్లాస్టిక్ పక్షుల్ని కూచోబెడదాం
ప్లాస్టిక్ కంకులు నాటి
పొలాలు బంగారం పండినట్లు చూపుదాం
……
ప్లాస్టిక్ ఆవుల ప్లాస్టిక్ గేదెల ప్లాస్టిక్ పొదుగులు

పితుక్కుని ప్లాస్టిక్ పాలు తాగుదాం
కొయ్యగుర్రాన్ని ఒహోం ఒహోం అంటూ
జీవితాంతం మెడలమీద మోద్దాం

చివరిదైన పన్నెండవ అధ్యాయంలో దీనికి విరుగుడుగా కవి తనదైన దృక్పథంలో ముగింపునిస్తారు. ఇదీ కొయ్యగుర్రం కథ.
1965లో దిగంబరగా కవిగా ఒక వెలుగు వెలిగిన నగ్నముని, 1970లో విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. మరి 1977లో రచించిన “కొయ్యగుర్రం” ఎందుకంత వివాదాస్పదమైందన్నది ప్రశ్న. దానికి సమాధానం ఈ కావ్యంలో పాక్షికంగానే లభిస్తుంది గాని, నగ్నముని సాహిత్యాన్నంతటినీ అధ్యయనం చేస్తే సంపూర్ణ జవాబు దొరుకుతుంది. అయితే ఆ క్రమ పరిణామాన్ని మార్క్సిజపు వ్యతిరేకతగా కొట్టిపారేయకూడదు. ఈ కవికి కవితావస్తువును అందించింది సమాజం కావచ్చునే గాని, ఆ వస్తువును పరికించవలసిన దృష్టినిచ్చింది మాత్రం మార్క్సిజమే. ఆ చూపునిచ్చింది ఆ తత్వమే. ’75 తర్వాత రాస్తున్న కవిత్వంలో క్రమంగా విశ్లేషణలో, సమస్యలకు పరిష్కారం సూచించడంలో ఈ దృక్పథం నుంచి కవి వైదొలుగుతుండడాన్ని గమనిస్తాం. ఇక ‘కొయ్యగుర్రం’లో మాత్రం ఎనిమిదో అధ్యాయంలో కవి తొలిసారి బయటపడతాడు.
మనిషిని మనిషిచేసే మోసం కాలానికి తెలుసు
కారణాలు కార్ల్ మార్క్స్ కు తెలుసు
రోడిన్
మ్యూజియంలో శిల్పంగా మారి
గడ్డానికి చేతులు ఆంచి
ఆలోచిస్తూనే ఉంటాడు
ఆలోచనకీ మనిషికీ వున్న సంబంధం ఏమిటి
” అలా అని ఊరుకుంటే సరే మార్క్సును ఏమైనా అనొచ్చుగాని, సిద్ధాంతాన్ని ఏమనలేదు కదా అని సరిపెట్టుకోవచ్చు. ముగింపు వద్దకొచ్చేసరికి కవి మరింత పదును తేలుతారు. మార్క్సిజం ఇచ్చే ఆశావహ దృక్పథాన్ని పక్కనపెట్టి, సమాజంపై కోపంతో, మారని విలువలపై ఏహ్యతతో నిస్పృహలోకి జారిన కవి నిరాశావహ దృక్పథంలో పడిపోతారు. పెసిమిస్టిక్ ధోరణి అలవరచుకుంటారు. అందుకే కావ్యం ముగింపులో-
నాకు రాకెట్లొద్దు చంద్రమండలం వద్దు
విమానయానాలొద్దు
కాలాన్నీ జీవితాన్నీ కలుషితం జేసే
రాజకీయ కార్యకాలాపాలొద్దు
రైళ్లొద్దు బస్సులొద్దు యీ నాగరికత రద్దీ వద్దు
పాత రాతియుగం పనిముట్టు పట్టుకుని
చరిత్ర చీకటి కోణాల గుహల్లోకి
వెళ్లిపోతాను
” అంటారు. అయితే ఇదంతా కేవలం పరిస్థితినంతటినీ అవలోకించిన కవి మానసిక పరిస్థితిగానే మనం భావించాలి.
ఇప్పుడు వెలువరించిన “కొయ్యగుర్రం” కొత్త ఎడిషన్ లో చేకూరి రామారావు రాసిన పీఠిక, నికీతా గూరోవ్ రాసిన పరిచయం, వేగుంట మోహనప్రసాద్ రాసిన ‘జార్జ్ మాండెల్ / నగ్నమునీ’ అనే ఇంటీరియర్ డైలాగ్ చదవడం గొప్ప అనుభూతి. ఇవి కావ్యాన్ని మరింత విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. 25 పేజీల చిన్న కవిత, మరో 50 పేజీల విశ్లేషణ చదవడం సమాజంపట్ల మనకు కొత్త చూపు లభించడం కోసమే. “కొయ్యగుర్రం” తప్పక చదవదగ్గ పుస్తకాల్లో ఒకటి.

No comments: