Wednesday, January 30, 2013

*
కపిల రాంకుమార్|| రజితోత్సవం|| **

సువిశాల
సుందర
రమణీయ ఉద్యానవంలో
మనోహర ప్రకృతీ రమణీయంలో
కోకొల్లలుగా జాజులు
విరబూచిన తరుణంలో
ఇంతుల సిగలోని
బంతిపూల హ్ర దయాంతరంగ
తరంగ పంక్తుల్లో
విలాస, విహారమాశించిన
శుభ దినంలో
ఈ శ్రావణంలో
ఆ వనంలో
ఒకచోట
ఆ నల్లబండమీద
వేపచెట్టు దక్షిణపు నీడన
కుక్కలు చింపిన విస్తరిలా
విసిరేసిన విస్కీ బాటిల్లా
అంత నీచంగ కనబడ్డా
మంచి వయసుగ
మనసు దోచేలా
మరులు కొలిపేలా
ఈలవేసేలా
జాలి కలిగేలా
జడవిరబోసుకున్న సుకుమారి
నగ్న శరీరంలా
నాగరికతా ప్రపంచంచే
మోసం చేయబడ్డ వనితలా
విధి వంచితయై
మనో వేదితయై
విరహంతో - విరసంతో - నీరసంతో
సృంఖలాలు తెంచుకొని
స్పందనాలు కలిగించుకొని,
బంధనాలు విడగొట్టుకొని
రజితోత్సవ వత్సరాన
రజ:తమోగుణాలు విరబూసిన
మన దేశం - ఈ వనిత!
ఎన్నో పంచవర్ష ప్రణాళికలు
ప్రవేశించాయి,
ఆక్రోశించాయి,
ఆవేశించాయి,
అలసట చెందాయి
ఆయాసం తీర్చుకుంటున్నాయి!
కట్టుబడిలోనే వున్నాం!
పెట్టుబడిలోనేవున్నాం!
అడపా దడపా ముట్టడికి
గురౌతూనేవున్నాం!
ఎంతమంది రాజులు-తరాజులు
తమ ఫోజులు చూపించలేదు?
ఈ బూజులు దులుపుతామని
రోజులు దాటించలేదు?
యెంతమంది చేతగాక గాజులు తొడుక్కోలేదు?
ఆ నాటి జాజులు వాడిపోయాయి!
వాటిపై మోజులు తీరిపోయాయి!
'' మాసాలు గడుస్తున్నకొద్ది
మోసాలకు గిరాకీ పెరుగుద్ది! "
పామరుడి నోటవచ్చిన మాట
విలువైన వరహాల్ మూట
ప్రగతి ప్రపంచానికి కొత్త బాట!
కని పిస్తోందిచూడు దూర దూర తీరాలలోని
దేస దేశాలలోని రాజకీయ చైతన్యం!
శ్రామిక - కర్షక మేథావుల మస్తిష్కంలొ
కదిలే
మెదిలే
కుమిలే
వేదన - అవేదన
కనిపెట్టారా ఎవరైనా!
స్వాతంత్ర్యోత్సవం జరుపుకోవలెననియున్నా
సహజోత్సాహం నిండుసున్నా!
అందుకే మౌనం వహించి యిలా ఓ గేయం రాసి కూర్చున్నా!
__________________________________________
30.01.2013 10.50 am.
_____________
** 15.08.1973 న - పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శ్రీమాం పెద్దింటి సూర్యనారాయణ్ దీక్షితదాసురధ్యక్షతన, నరసాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ అతిథిగా హాజరై జరిగిన కవిసమ్మేళనం లో చదివినది.

No comments: