Sunday, January 6, 2013

కొడిగట్టిన సూర్యుడు -సమీక్ష

కపిల రాంకుమార్ || కొడిగట్టిన సూర్యుడు -సమీక్ష||
కవి: శిలా వీర్రాజు సుషుమా ప్రచురణ -కృష్ణా పత్రిక ముద్రణ -ప్రాప్తిస్థానం :ఉదయాపబ్లిషింగ్ కంపెనీ, సుల్తాం బజార్ -హైదరాబాద్ : సమీక్ష : పాతూరి ప్రసన్నం – (నవత 1967 జూలై – సెప్టెంబర్ సంచిక)
జీవితం పెద్ద ప్రయోగశాల. అది పరిణామశీల్మైనది, ఆభినివేశాలతోపాటు, నవతను సంతరించుకుంటూ, పురోగతిని సాధించటంకోసం ఈనాడు అన్ని రంగాల్లోనూ పరిశోధనలూ, ప్రయోగాలు జరుగుతున్నయి. సాహిత్య రంగంలో కూడ. ” వచన కవిత ” అలాంటి ప్రయాత్నాలలో ఒకటి ” కొడిగట్టిన సూర్యుడు ” అనే రచన ఈ కోవకు చెందినది. దీని రచయిత సుపరిచితులైన శ్రీ శీలా వీర్రాజు. భావాల్లో బలం, పదాల్లో పదును, నడకల్లో నవత, సూక్తిలో స్పూర్తి, యివ్న్నీ వుంటే యే రచనైనా పాఠకుల మనసుల్ని దోచుకోకలుగుతుంది. వచన కవిత యిలా వుండాలని యెవరూ నిర్దేశించలేరు! యెలావుంటే బావుంటుందో చూపేవి పాఠక హృదయ దర్పణాలు. ” కొడిగట్టిన సూర్యుడు ” అనే వచన కవితా సంపుటిలో మూడు కవితలున్నాయి. శీర్షిక కవితతో పాటు ముళ్ళరెమ్మ. విశ్వాసం నీడకింద అనేవి. ఈ మూడు మూడు గాధలు. బాధలతో బరువెక్కిన గాధలు. కృష్ణవేణి – పార్వతీశం. పావని – శ్రీనివాసు, దమయంతి – బాలకృష్ణ అనబడే వ్యక్తులు వీటిలో కనబడతారు. సచేతనంగా, సజీవంగా, ఆశా నిరాశల ఆటుపోట్లలో వూగుసలాడుతూ వీరు పలికే పలుకులు సూటిగా పాఠకుల గుండెల్లోకి దారి తీసుకుంటాయి. మరీ మూడవ రచనలో ( విశ్వాసం నీడ కింద)లో శ్రీ కుందుర్తి ఆశించిన ” సందేశం ” ధ్వనించింది. వర్ణించే తావుల్లో శబ్ద చిత్రాలను రచించారు. వర్ణనలు చెప్పటం కాకుండా, దృశ్యాలను చూపింది వీరి రచన. ఆయన చిత్ర శిల్పి కనుక. నిశ్చందం అయితేనే! ఈ కవితలో స్వచ్చందమైన సౌందర్యం భాసిస్తోంది. వచనపు వరిబియ్యమూ,కవితా గోక్షీరమూ కలిపి, భావుకతను పంచదారగా వేసి చేసిన కవితా క్షీరాన్నమిది. నవతకోరే సరస హృదయులకు రస్సస్వాదనపై నివేదించారు యీ రచనను శ్రీ శీలా వీర్రాజు. ” వచన కవిత ” గొప్పదా ” ప్రాచీనకవిత ” గొప్పదా అని వాదించే వేదిక కాదు యిది. అందినంత వరకు అందాన్ని చూ్డటం, పొందినంత వరకు ఆనందాన్ని పొందటం మన విధి. వచన కవితకు వలసిన నిధులు శీలా వీర్రాజులో వున్నాయి అనిపించుతుంది యీ రచన చదివితే….పాతూరి ప్రసన్నం
నవత సంచిక పేజి. 53-54

No comments: