కపిల రాం కుమార్ || ఆ నలుగురు ||
వెర్రితలల వికృత చేష్టలకు
సభ్యసమాజం తలదించుకుంటే
ఓ నలుగురి విధినిర్వాహణా
రాహిత్యమే కారణం!
మనోక్షీరంలో వికృతపుటాలోచన
విషపు చుక్కై మైకంతో
పడమటి గాలి వాటుకు
చంకలెగరేసుకుంటూ
నాగరీకులమంటూ
తందనాలాడే వారిని సత్పౌరులుగా
మలచలేని ఆ నలుగురే బాధ్యులు!
కమ్మనైన మాతృభాషలో
ముద్దు మురిపాలతోపాటు
మచ్చికతీర గోరుముద్దలతో పాటు
బుద్ధు నేర్పని తల్లి -
ఒకటో ముద్దాయి!
తడబడే అడుగులు
తప్పటదుగులు కాకుండా
అడ్డాల్లో బిడ్డకాని గడ్డాలప్పుడు బిడ్డలా
సమర్థించుకోచూచి,
నిఘావుంచని తండ్రి
రెండో ముద్దాయి!
దండం దశగుణం భవేత్ - అన్నరని
అతి చేస్తేనో - అసలు మిన్నకుంటేనో
గోడలుదూకి, చదువులెగ్గొట్టి
స్నేహితులవలయంలో
చిక్కుకునే విధ్యార్థికి
మార్గమేయలేని ఉపాధ్యాయుడూ
మూడో ముద్దాయి!
వ్యక్తిత్త్వం దిగజార్చి
అవ్యక్త ప్రేలాపనలు
ఉచితానుచితాల తేడా
గమనించక ప్రవ్రించే వాణ్ణి
సరిదిద్దలేని స్నేహ సమాజమూ
నాలుగో ముద్దాయి!
వీరి నిర్లక్ష్యాని తోడు
ఇంగితం యిసుమంతలేని
వాడు భావి క్రౌర్యుడు కావటానికి
ఆ అవలక్షణాలు పునికిపుచ్చుకోవటానికి
ఆ నలుగురేగా కారణం!
మనమూ ఆ నలుగురిలో ఒకరం
మన పద్ధతి మార్చుకొని
మరొక క్రౌర్యం జరుగకుండా
జాగ్రత పడక తప్పదు!
ముద్దాయిగా మారొద్దు!
1 comment:
ప్రవ్రించే = ప్రవర్తించే
Post a Comment