ఖాళీలను పూరించడమే సాహిత్యం పని: బాలగోపాల్
Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice
మార్క్సిజంపై అసంతృప్తితో తాను మొదలు పెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ, తనకు సంతృప్తినిచ్చే ప్రాపంచిక దృక్పథం ఏర్పడిందనీ బాలగోపాల్ ఈ ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. ఆ దృక్పథం ఏమిటో సాహిత్యాంశాల అన్వయంతో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఎనిమిదేండ్ల కిందట జరిగిన ఈ సంభాషణ- బహుశా బాలగోపాల్ ఇచ్చిన చివరి పూర్తి సాహిత్య ఇంటర్వ్యూ…
చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు… ఖాళీలు కల్పించే దాహం సాహిత్యానికి గొప్ప దోహదకారి అయింది… సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవిత మంత విస్తృతమైనది.
చరిత్ర, మనిషి, మార్క్సిజం- అన్న మీ సుప్రసిద్ధ వ్యాసం (అరుణతార, సెప్టెంబర్ 1993) ‘రాగో’ అన్న నవలకు సమీక్షగా రాశారు. ప్రధానంగా సాహిత్య విమర్శ వ్యాసంగా వచ్చిన ఆ రచనలో రాజకీయ అంశే సంచలనాన్ని, వివాదాన్ని సృష్టించిం ది తప్ప, దానిలోని సాహిత్య చర్చనీయాంశాలను ఎవరూ పట్టించుకోలేదు. మీరు ప్రతిపాదించిన లేదా చర్చించిన సాహిత్య అంశాలు కూడా ‘రాజకీయ’ అంశాలం త వివాదాస్పదమైనవి. ప్రతిస్పందనలోని ఆ విశేషాన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు?
అది సమీక్షగా రాసింది కాదు. ముందుమాటగా రాసింది. రచయిత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైన రచనను ముందుమాటగా వేయడం భావ్యం కాదనిపిం చి, ‘రాగో’కు ముందుమాటగా కాకుండా విడిగా వ్యాసంగా అచ్చు వేయదలుచుకుంటే వేయమని చెప్పాను.అందువల్ల అది’అరుణతార’లో వ్యాసంగా అచ్చయింది. స్పందన మాటకొస్తే, రచనకు తాత్వికంగా స్పందించి ఉంటే అన్ని అంశాలు చర్చకు వచ్చేవేమో. కానీ తమ రాజకీయ విశ్వాసాలపైన దాడిగా దానిని భావించి స్పందించినవారే ఎక్కువ కాబట్టి చర్చ ఆ విధంగా జరిగిందనుకోవాలేమో. అయినా ఆ వ్యాసం నా అభిప్రాయాల సమగ్ర వ్యక్తీకరణ కాదు.
అప్పటికి దాదా పు మూడేళ్లుగా నా తాత్వికవిశ్వాసంగా నేనప్పటిదాకా భావిస్తూ వచ్చిన మార్క్సి జంపట్ల నాకు అసంతృప్తిగా ఉండింది. దానికి సమాధానం చెప్పగలగడం సంగ తి అటుంచి, ఆ అసంతృప్తిని స్పష్టంగా నాకు నేను వివరించుకోలేకపోవడం వల్ల రాయడమే మానేసాను (పౌరహక్కుల రిపోర్టులు తప్ప). ఆ దశలో నేను చేసిన మొదటి రచన ఆ వ్యాసం. ముందుమాట కుండే పరిమితులే కాక ఈ పరిమితి కూడా దానికి ఉంది. అందువల్ల ఆ వ్యాసంలోని అభిప్రాయాలను వివరించే పద్ధతిలో కాకుండా మీ ప్రశ్నలకు విడిగానే జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను.ఆనా డు నేను మొదలుపెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ నాకు సంతృప్తి ఇచ్చే ప్రాపంచిక దృక్పథం నాకిప్పుడుందనీ అనుకుంటున్నాను.
సోషలిజం, సమ సమాజం అన్న ఆదర్శాలే సంక్షోభంలో పడిన కాలంలో, ఆ ఆదర్శాల ఆధారంగా నిర్మించుకున్న అనేక సాహిత్య భావనలు, సిద్ధాంతాలు తెలుగు సాహిత్య రంగంలో చర్చకు ఎందుకు రావడంలేదు?
ఇతర సోషలిస్టు సాహిత్య భావనలు, సిద్ధాంతాల సంగతి పోనిచ్చి కనీసం మార్క్సిస్టు సంప్రదాయంలోని సాహిత్య సిద్ధాంత భావనలు సహితం అన్నీ చర్చకు రాలేదు. మన దగ్గర ‘అరసం’తో మొదలుపెట్టి ‘విరసం’వాళ్లు కొనసాగించిన సాహిత్య సంప్రదాయం కంటే చాలా భిన్నమైన ఆలోచనలు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత సంప్రదాయంలోనే ఉన్నాయి. రేమాండ్ విలియమ్స్, అడార్నో వంటివారు చారిత్రక భౌతికవాదం ప్రాతిపదికన వివరమైన సాహిత్య సిద్ధాంతా లు రూపొందించారు. వాటితో మన దగ్గరున్న వామపక్ష సాహిత్యకారులకు పరిచయం ఉంటే రెండు రకాలుగా ప్రయోజనం ఉండేది.
ఒకటి ప్రామాణిక మార్క్సిస్టు సాహిత్య విమర్శగా మనదగ్గర చలామణిఅయ్యే విమర్శ ఆమోదించని కొన్ని సాహిత్య ప్రయోగాలకు వస్తు సంబంధమైనవీ శిల్ప సంబంధమైనవీ కూడా మార్క్సిస్టు సంప్రదాయంలోనే ఆమోదమే కాక ప్రశంస కూడా ఉందని తెలిసేది. సాహిత్యానికి, ప్రజలకు విప్లవోత్తేజం కలిగించడం అనే ఒకే ఒక కర్తవ్యానికి పరిమితమైన పాత్ర కాక, విస్తృతమైన పాత్ర కల్పించే సాహిత్య సిద్ధాంతాలు మార్క్సిస్టు సంప్రదాయంలోనే ఉన్నాయని తెలిసేది. రెండు మన దగ్గర ప్రచారంలో ఉన్నదాని కంటే సంపన్నమైన సాహిత్య సిద్ధాంతాలకు చారిత్రక భౌతికవాదంలో స్థానం ఉన్నప్పటికీ మార్క్సిజం ప్రాతిపదికన పరిపూర్ణమైన సాహిత్య సిద్ధాంతం రూపొందించడం సాధ్యం కాదని కూడా అర్థమై ఉండేది.
ఈ సిద్ధాం తాలు మనదగ్గర చర్చకు రాకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. జీవిత మూలాలకు సంబంధించిన సత్యాన్వేషణ ఇంకా బాకీ ఉందని మన దగ్గర మార్క్సిస్టులు అనుకోవడంలేదు. అది ప్రాథమికంగా ముగిసిందనీ దానిని ఆచరించడం, అన్వయించడం, మెరుగులు దిద్దడం మాత్రమే మిగిలివుందనీ అనుకుంటున్నారు. కనీసం 20వ శతాబ్దపు చివరి దశకంలోనయినా ఈ అభిప్రాయం మారవలసి ఉండింది. మారి ఉంటే సోషలిజానికి సంబంధించిన అన్ని ఆలోచనలనూ తిరిగి అధ్యయనం చేయడం జరిగి ఉండేది. అది తత్వశాస్త్రంలో జరగలేదు. రాజకీయాలలో జరగలేదు. సాహిత్యంలోనూ జరగలేదు.
రచయిత లేదా కవి తన రచనలో ఎటువైపు నిలబడ్డాడు అన్న కొలమానం గొప్ప సాహిత్యాన్ని గ్యారంటీ చేయలేదని మీరు అన్నారు. మరి ఆ కొలమానానికి ఎటువంటి ప్రయోజనమూ సార్థకతా లేవా?
ఎటువైపు నిలబడ్డారనేది గొప్ప సాహిత్యాన్ని గ్యారంటీ చేయలేదని నేను చెప్పనవసరం లేదు. అది అందరికీ తెలిసిన సత్యమే. మరి పక్షపాతానికి ఏ ప్రయోజనమూ లేదా అంటే, పూర్తిగా అన్యాయాన్ని సమర్థించే దృక్పథం నుండి గొప్ప సాహిత్యం పుట్టదు అని చెప్పవచ్చు. న్యాయానికి కంకణబద్ధమైన దృక్పథం నుండి పుట్టే సాహిత్యం ఒకవేళ సాహిత్యంగా రాణించకున్నా సాధారణంగా ఏవగింపు కలిగించదు. అన్యాయానికి (దీనికి కూడా మినహాయింపులు లేకపోలేదు) కంకణబద్ధమైనది ఏవగింపు కలిగిస్తుంది కాబట్టి సాహిత్యంగా రాణించదు.
అన్యాయాన్ని పూర్తిగా భుజానికెత్తుకునే రచయితలు చాలా కొద్దిమందే ఉంటారు. కాబట్టి ఇది పెద్దగా జ్ఞానదాయకం కాదు. ఏ విషయంలోనయినా ఏది న్యాయం ఏది అన్యాయం అనేది కచ్చితంగా తెలుసుకోగలమనీ, న్యాయంవైపు ఉన్నావా లేక అన్యాయం వైపు ఉన్నావా అన్న ప్రశ్నకు అన్ని సందర్భాలలోనూ కచ్చితమైన జవాబు చెప్పగలమనీ, సాహిత్యంతో సహా అన్ని విషయాలలోనూ ఈ జవాబే ప్రధాన (నిర్ణయాత్మక) విషయమనీ నమ్మినట్టయితేనే మీరు వేసినది సాహిత్య విమర్శకు కీలకమైన ప్రశ్న. లేకపోతే అది ఒకానొక ప్రశ్న మాత్రమే.
రచన ఎందుకోసం చేస్తారు? కళ కళకోసమా, ప్రజల కోసమా అన్న ప్రశ్నకు ఇప్పుడు అర్థముందా? సాహిత్యానికి దాని కర్తకూ ఉండే సంబంధం ఏమిటి? రచయిత సాహిత్యాన్ని మరేదయినా ఆశయం కోసం రాయడం సరిఅయినదేనా? సాహిత్యానికీ దాని పాఠకులకూ ఉండే సంబంధం ఏమిటి? సాహిత్యం బోధించాలా, జనాన్ని సమీకరించాలా, వినోదాన్నో ఆహ్లాదాన్నో ఇవ్వాలా? ఆయా సంబంధాలకు స్థిర నిర్వచనం ఇవ్వగలమా?
కళకూ సాహిత్యానికీ ఒక కర్తవ్యాన్ని నిర్దేశించే ముందు అవి మానవ జీవితంలో ఏ పాత్ర నిర్వహించాయో చూడడం ఉచితంగా ఉంటుంది. ఇది కామన్‌సెన్స్ విషయమేగానీ సాహిత్యం పాత్ర ఇది అది అంటూ తాఖీదులు జారీచేసే వాళ్లకిది తోచినట్టు కనిపించదు. కళా సాహిత్యాలు నాగరికత అంత ప్రాచీనమైనవి. సైకిల్ తొక్కడంలాగ, క్రికెట్ ఆడడం లాగ కళా సాహిత్య సృజన మనిషి చేయగల ఒకానొక పనికాదు.
అది మానవ అస్తిత్వ నైజంతో సన్నిహితంగా ముడిపడిన ప్రక్రియలు. మనిషి ఉనికిలో అంతర్భాగమైన ప్రక్రియలు. రాళ్ల నుండి పనిముట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టిననాడే రాతి గోడలపైన బొమ్మలు వేయడం, రాళ్లతో కళాత్మకమైన వస్తువులు తయారుచేయడం మనుషులు మొదలుపెట్టారు. మనిషి రాత నేర్చిననాడే సాహిత్యం కూడా పుట్టింది. గానం అంతకంటే ముందే పుట్టింది. మానవ జీవితంతో ఇంతగా పెనవేసుకున్న కళాసాహిత్యాలకు ఆ జీవితంలో ఉన్న పాత్ర ఏమిటో అర్థం చేసుకోకుండా వాటికి నియమాలూ తాఖీదులూ జారీ చేయడం ఎంతవరకు సబబు?
కళ సంగతి పక్కనపెట్టి సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి గానీ సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించమంటే, జీవితంలోని ఖాళీలను పూర్తిచేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు. దానికి వేరే ఏ కర్తవ్యాన్ని అప్పగించడంలోనూ అర్థంలేదు. ఆ కర్తవ్యాన్నే సమసమాజ లక్ష్య సాధన దిశగా మలచుకునే ప్రయత్నం చేయొచ్చు. జీవితంలో ఖాళీలు ఎందుకుంటాయి? చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు. ఇతర జంతువులు ఒక జంతు జాతిగా తమకు ఉండే జన్యు లక్షణాలననుసరించి బతుకుతాయి. వాటికి తెలివి లేదనీ రోబోట్‌ల వంటివనీ కాదు.
ఎంత చురుకయిన మెదడున్న జంతువయినా తన పరిసరాలతో తాను ఏవిధంగా వ్యవహరించాలన్న నిర్ణయాన్ని చేసిపెడుతుంది. మనిషిలో జన్యు నిర్ణాయకత చాలా తక్కువ. తన పరిసరాలతో- అందులో భాగంగా ఇతర మనుషులతోనూ- ఏ విధంగా వ్యవహరించాలన్న నిర్ణయాన్ని నూటికి తొంభై తొమ్మిదిపాళ్లు మనిషి చైతన్యయుతంగానే తీసుకోవాలి. ఇది మనిషి అస్తిత్వ నైజంలోని ప్రధాన అంశం. ప్రతీ మనిషీ తనలో పుట్టిన ‘స్వంత’ చైతన్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటారని కాదు. ఆ చైతన్యం అప్పటికే ఒక సామాజిక ఆలోచనారీతి చేత ప్రభావితమయి ఉంటుంది. అయినప్పటికీ నిర్ణయం చైతన్యయుతమైనది.
చైతన్యయుతంగా వ్యవహరించడమంటే ఏది చేయాలో ఎంచుకోవడం. ఏ విధంగా వ్యవహరించాలన్న ఎంపిక చేసుకోవడం. మనం వ్యవహరించే వస్తువులు, విషయాల గురించి కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం. అందులో భాగంగా మన గురించి కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం. అప్పుడు సహజంగానే ప్రమాణాలు ఏర్పడతాయి. ఇది మనిషి అస్తిత్వ నైజంలోని రెండవ అంశం.
ప్రామాణికతా భావన మనిషి చైతన్యానికి ఉండే స్వాభావిక లక్షణం. నైతికత (తప్పొప్పులు, మంచి చెడుల భావన) అందులో ఒక భాగం మాత్రమే. దానితోపాటు అన్నిటికీ ప్రమాణాలు ఏర్పడతాయి. సౌందర్యం, సంతోషం, సుఖం, సంతృప్తి మొదలైన అన్నిటికీ ప్రమాణాలు ఏర్పడతాయి. ప్రామాణికతా భావన వెంటనే పరిపూర్ణతా భావన కూడా ఉంటుంది. ఇది దానిని వెన్నంటి ఉంటుంది. సంపూర్ణమైన మంచి, సంపూర్ణమైన సుఖం, సంపూర్ణమైన సౌందర్యం, సంపూర్ణమైన సాహసం మొదలైనవన్నీ పరిపూర్ణతా భావనలో భాగమైనవే.
నిజ జీవితానికీ ఈ పరిపూర్ణతా భావనకూ మధ్యనున్న అంతరం జీవితంలోని ఖాళీలలో ఒకటి. అది కల్పించే దాహం సాహిత్యానికి గొప్ప దోహదకారి అయింది. అయితే పరిపూర్ణతా భావన ఒక్కటే కాదు, అన్ని రకాల ప్రామాణికతా భావనలను జీవితం వెక్కిరిస్తుంది. ఈ అంతరం మనిషిలో కలిగించే ఆందోళన, ఆవేదన, వెలితి అన్ని భాషలలోనూ సాహిత్యానికొక ముఖ్య వస్తువు.
జీవితంలో వేరే రకమైన ఖాళీలు కూడా ఉంటాయి. చైతన్యయుతంగా జీవించక తప్పని మనిషికి జ్ఞానం చాలా అవసరం. మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటా యి. కొన్ని భయంవల్ల చూడము. కొన్ని అభద్రత వల్ల చూడము. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్లముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి.
వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి. చూపించే క్రమంలో ఏ భయం, లేక ఏ అభద్రతా భావన, లేక ఏ భావజాలం, లేక ఏ పాక్షిక దృక్కోణం దీనిని మనం చూడలేకుండ చేసిందో కూడా సాహిత్యం చెప్పకుండానే చెప్తుంది. ‘అరె! ఇది నాకు తెలిసిన విషయమే గానీ చూడలేకపోయానే’ అనుకునేటట్టు చేస్తుంది. మంచి సాహిత్యమెప్పుడూ ఆ అనుభూతి కలిగిస్తుంది. మానవ అస్తిత్వంలోని ఈ రకరకాల ‘ఖాళీలు’ సాహిత్యం జన్మస్థలం, దాని కార్యక్షేత్రం.
అటువంటి ప్రక్రియ మనిషి అస్తిత్వ నైజం వల్లనే అవసరమయింది. సాహిత్యానికి ఉండే ఈ నైజాన్ని గుర్తించి దానితో సమసమాజ ఆదర్శానికి అనుగుణంగా వ్యవహరించడం నేర్చుకోగలిగితే- దానికి ఏమైనా ప్రమాణాలు రూపొందించుకోగలిగితే- అది ప్రజాసాహిత్య సిద్ధాంతం కాగలదు. సోషలిస్టు సాహిత్య సిద్ధాంతం కాగలదు. ‘కళ ప్రజల కోసం’ అనే నినాదానికి వేరే ఏ కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేసినా అది సాహిత్యానికిగానీ ప్రజలకుగానీ మేలు చేయదు.
నిలిచిపోయే సాహిత్యానికి-సమర్థవంతంగా రాయడం, సామాజిక పరిణామంలో కీలక స్థానంలో ఉన్న చారిత్రక సందర్భం నేపథ్యంగా ఉండడం-అన్న లక్షణాలను మీరు ప్రతిపాదించారు. ఎటువంటి బాహ్య పరిస్థితుల మధ్య అయినా తన సమర్థత, పక్షపాతాల ఆధారంతో రచయిత గొప్ప రచనలు చేయగలడని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. చారిత్రక సందర్భానికి మీరు ఎక్కువ వెయిటేజి ఇవ్వడం వల్ల నిలిచిపోయే రచనల సాధన నుంచి రచయితలను నిరుత్సాహపరుస్తుంది కదా?
సమర్థవంతంగా రాయడం సంగతి పక్కన పెట్టండి. అదెట్లాగూ అవసరమే. ఇక్కడ సామర్థ్యం అనేది శిల్పానికి సంబంధించినది. శిల్పం గురించి మాట్లాడితే వస్తువు మీదనుండి దృష్టి తొలగిపోతుందనే కృత్రిమమైన భయం నుండి బయటపడగలిగితే, సాహిత్యానికి ‘సాహిత్యం’ లక్షణం ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదనే విషయం స్పష్టమే. సాహిత్యానికీ జర్నలిజానికీ తేడా సాహిత్య శిల్పమే. సాహిత్యాన్ని శిల్పమే రూపొందిస్తుంది. (Form is constitutive of literature) అని అడార్నో అంటాడు. అతను వర్గపోరాటం మీద అచంచల విశ్వాసం ఉన్న మార్క్సిస్టే మళ్లీ.
కీలకమైన సామాజిక పరిణామాల మాటకొస్తే, అటువంటి సందర్భాలు చరిత్రలో ఎక్కడ తలెత్తినా గొప్ప కథా వస్తువులు అందించడానికి ఒక కారణం ఉంది. అటువంటి సందర్భాలలో ఒక్కొక్కసారి మానవ ఆలోచనారీతికి స్వాభావికమైన పరిపూర్ణతాభావన, ప్రామాణికతా భావన అత్యున్నత స్థాయిని అందుకుంటాయి. అతి గొప్ప ఆదర్శాలు ముందుకొస్తాయి. ఒక్కొకసారి మానవ ఆచరణ అతి నీచ స్థాయికి పడిపోతుంది. ఒక్కొకసారి రెండూ జరుగుతాయి. అన్ని సందర్భాలలోనూ ఉన్నత ప్రవర్తనకూ నీచమైన ప్రవర్తనకూ మధ్యనున్న ఎడం మరింత ఎక్కువవుతుంది.
చూడగలిగి ఉండీ చూడలేకపోవడం, కళ్ల ముందుండీ కళ్లు మూసుకుపోయి కనిపించకపోవడం అటువంటి చారిత్రక సందర్భాలలో మరింత స్పష్టంగా తెలుస్తాయి. సాహిత్యం కార్యక్షేత్రమైన మానవ అస్తిత్వ నైజంలోని అన్నిరకాల సందిగ్ధాలూ తీవ్ర పరిమాణం తీసుకుంటాయి. అందుకే నిలిచిపోయే సాహి త్యం పుడుతుంది. దీనికీ, బాహ్య పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా మంచి సాహిత్యం రాయడం రాయలేకపోవడం అనే సమస్యకూ సంబంధమేమీ లేదు.
మీ మాటలలోని అర్థాన్ని మరింత విస్తరిస్తే – ఒక స్థిర నిశ్చయం కంటే – భయం, కుతూహలం, ఆందోళన- వంటి అస్థిర ఉద్వేగాల నుంచే గొప్ప సృజన వస్తుంది. ఈ ప్రతిపాదనకు అపవాదులు లేవా? ఆధునికతను మనస్పూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావును ఎలా లెక్క వేస్తారు? విశ్వనాథ సత్యనారాయణలో ఆధునికత మీద భయందోళనలు మాత్రమే ఉన్నాయా, స్థిర నిశ్చయంతో కూడిన వ్యతిరేకత లేదా? పాశ్చాత్య సాహిత్యం నుంచే తప్ప తెలుగు సాహిత్యం నుంచి ఒక్క ఉదాహరణ కూడా ఎందుకు ఇవ్వలేదు?
‘ఆధునికతను మనస్పూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావు’ కన్యాశుల్కం హీరోగా ఆధునికతను నిజాయితీగా ఆహ్వానించిన వ్యక్తిని ఎంచుకోలేదు. విరసం వంటి సాహిత్య సిద్ధాంతకారుల మాటలు విని ఉంటే ఆ పని చేసి ఉండేవాడు. అప్పుడు కన్యాశుల్కాన్ని ఈరోజు ఎవరూ చదివేవారు కాదు. ఆయన ఆధునికతను తన స్వంత ప్రయోజనాలకోసం వాడుకున్న యాంటి హీరోను ఎంచుకున్నాడు. సంప్రదాయానికి కూడా మంచికో చెడుకో దానిని నిజాయితీగా ఆచరించిన బ్రాహ్మణులను కాక గిరీశంను పోలిన దగుల్బాజీలనే ప్రతినిధులుగా ఎంచుకున్నాడు.
ఆధునికతకూ సంప్రదాయానికీ మధ్యనున్న వైరు ధ్యం రెండు మహత్తరమైన విలువల ప్రపంచాలకు మధ్య ఘర్షణ. ఆ విషయం కన్యాశుల్కం దాచిపెట్టదు. అందులో మనల్ని ఆధునికత వైపే రమ్మంటుంది. అదే సమయంలో ఆ విలువల అట్టహాసానికీ వాటి పేరు మీద కొట్లాడుకునే మనుషుల నేలబారుతనానికీ మధ్యనున్న అంతరాన్ని చూపిస్తుంది. కొత్త నవ్వు, కొంత ఆందోళన, నవ్యత పట్ల సానుభూతి, దానికి సాధనాలయిన మనుషులను చూసి కొంత నిస్పృహ కలిగిస్తుంది.
‘నాజీవాదానికి అనుకూలంగా గొప్ప సాహిత్యం రాయడం సాధ్యం కాదనేది నిస్సందేహమే’నని ఫ్రెంచి తత్వవేత్త సార్త్ర్ అంటాడు. బ్రాహ్మణవాదాన్ని గురించి కూడా అదేమాట అనొచ్చు. కానీ ప్రశ్నను ఆ విధంగా వేసుకోవడంలోనే పొరబాటు ఉంది. ఆ విధంగా వేసుకుంటే నిస్సందేహమైన జవాబులే వస్తాయి. ‘నాజీవాదాన్నీ బ్రాహ్మణవాదాన్నీ జయించడం అభ్యుదయవాదులు ఊహించినంత సులభమా అన్న సందేహం గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలదా?’ అన్న రూపంలో ప్రశ్న వేసుకుంటే అంతటి ‘నిస్సందేహమైన’ జవాబు రాదు.
ఈ వాదాలను జయించడానికి ఎంచుకుంటున్న పద్ధతులు ఒక కొత్త నియంతృత్వానికి, లేక ఒక కొత్త అణచివేతకు దారి తీస్తాయేమోనన్న సందేహం గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలదా అన్న రూపంలో వేసుకున్నా కూడా అంతే. విశ్వనాథ సత్యనారాయణలో ఉన్నది ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకతే తప్ప ఇటువంటి భయసందేహాలు కావు కాబట్టి ఆయన రాసినదేదీ నిలిచిపోతుందని అనుకోను. అయితే నేను ఆయన రచనలన్నీ చదవలేదు కాబట్టి కచ్చితంగా చెప్పలేను.
స్థిర నిశ్చయం-భయం అన్న వర్గీకరణ కంటే మనిషిలోని అభ్యుదయ శక్తి పట్ల ఆశాభావం, దానికి ఉండే అవరోధాలపట్ల ఆందోళన అనేది ప్రస్తుత సందర్భంలో ఉపయోగకరమైన వర్గీకరణ అనుకుంటాను. ఆ శక్తి తమలో ఉందని తెలియకుండ మనుషులు నిద్రలో ఉన్నప్పుడు దానిని వారికి చూపించి మేల్కొలపడం మంచి సాహిత్యం సాధారణంగా నిర్వహించే పాత్ర అవుతుంది. అటువంటి సాహిత్యం అన్ని భాషలలోనూ ఉంది.
అయితే ఆ శక్తిని తప్ప దానికి ఉండే పరిమితులనూ అవరోధాలనూ వాటిని గుర్తించకపోతే రాగల విపత్తునూ గుర్తిస్తుంది, వ్యక్తీకరిస్తుంది. నిజానికి మానవ జీవితంలో ఈ రెండు పరిస్థితులూ ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి రెండు కర్తవ్యాలు సాహి త్యం నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఎటొచ్చీ ఉద్యమాలకు అనుబంధంగా కాక ‘కాంప్లిమెంటరీ’గా ఉంటుంది. అయితే సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవిత మంత విస్తృతమైనది.
మానవ స్వభావంలో అభ్యుదయ కాముకులు గుర్తించడానికి భయపడే ఆగాధాలను అసాధారణ ప్రతిభతో-ప్రగతివాదుల పట్ల కచ్చతో-డాస్టయవ్‌స్కీ వెలికితీసి వర్ణించాడని మీరు రాశారు. తెలుగు సాహిత్యంలోని కమ్యూనిస్టు వ్యతిరేకుల రచనలకు అంతటి స్థాయి ఉందంటారా?
దస్తాయవ్‌స్కీ మనిషిమీద ప్రేమతో ఆధునికతను చూసి భయపడ్డాడు. మనిషి మీద ద్వేషంతో కాదు. ఆధునికత- బూర్జువా ఆధునికత అయినా సోషలిస్టు ఆధునికత అయి నా- మనిషిలోని మానసిక శక్తిని మాత్రమే చూస్తుంది. దానిని ప్రాతిపదిక చేసుకొని తన వ్యూహాలను రచించుకుంటుంది. అది బలహీనమైన మనిషిని తన రథ చక్రాల కింద తొక్కేస్తుందని భయపడిన రచయితలు 19, 20 శతాబ్దాల పాశ్చాత్య సాహిత్య చరిత్రలో చాలామంది ఉన్నారు. 20వ శతాబ్దాపు చరిత్రను సమీక్షించుకుంటే ఇది అవాస్తవికమైన భయం కాదని అర్థం అవుతుంది.
తెలుగు సాహిత్యంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు మనిషి మీద ప్రేమతో- మనిషి బలహీనతపట్ల సానుభూతితో- కమ్యూనిస్టులను చూసి భయపడ్డారా? లేక మనిషిమీద ద్వేషంతో కమ్యూనిజాన్ని ద్వేషించారా? రెండవదే నిజమేమో. అయితే నాకు తెలుగు సాహిత్యంతో ఉన్న పరిచయం తక్కువ కాబట్టి కచ్చితంగా చెప్పలేను.
ఖాళీలను పూరించడమే సాహిత్యం పని: బాలగోపాల్
without comments
ఇంటర్వ్యూ: కె.శ్రీనివాస్
( ‘ప్రజాతంత్ర’ సాహిత్య ప్రత్యేక సంచిక-మార్చి 2001 నుంచి పునర్ముద్రితం)మార్క్సిజంపై అసంతృప్తితో తాను మొదలు పెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ, తనకు సంతృప్తినిచ్చే ప్రాపంచిక దృక్పథం ఏర్పడిందనీ బాలగోపాల్ ఈ ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. ఆ దృక్పథం ఏమిటో సాహిత్యాంశాల అన్వయంతో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఎనిమిదేండ్ల కిందట జరిగిన ఈ సంభాషణ- బహుశా బాలగోపాల్ ఇచ్చిన చివరి పూర్తి సాహిత్య ఇంటర్వ్యూ…

‘ప్రజాతంత్ర’ సాహిత్య ప్రత్యేక సంచిక-మార్చి 2001 నుంచి పునర్ముద్రితం
No comments:
Post a Comment