Sunday, January 27, 2013

'' ప్రణయ తపస్సు ''

శ్రీ రావెళ్ళ వెంకట రామారావు (గోఖినేపల్లి - ఖమ్మం) వారి కవిత
'' ప్రణయ తపస్సు ''

మధురామృతము గ్రోలి మత్తెక్కినానే,
కలికీ! నీ కన్నులలో కవితగన్నానే!

ప్రణయ దేవత పొందు ప్రాప్తిగన్నానే,
కలమెత్తి నీ కీర్తి కవిత రాసేనే!

తారుణ్య లావణ్య తను, గ్రోలినానే,
సరళ హృదయపు వీణ సారించు తానే!

అనురాగ జలధిలో అడుగులుంచానే
గళమెత్తి నీ ప్రేమ ఘనత పాడేనే

వాక్సుధ ధార్ల్లో ప్రవహించి నానే
చిత్తాన నీ మూర్తి స్థిరపరచినానే!

వలపు తేనియ ద్రావి పులకరించానే
భావమందున ప్రణయ సేవ జేసేనే!

మహనీయమౌ రాగ మహిమగొలిచేనే
నిత్య జీవిత శ్రమల నేను గెల్చెదనే!

ప్రణ్య ' ఓంకార " మే  పఠన జేసేనే
స్వర్గ సుఖముల యిలనె సాధించుతాన!.

(రాగ జ్యోతులు - గేయ సంపుటి -ప్రథమ ముద్రణ 1954 జయ ఉగాది 1954 వెల నాల్గణాలు -తెలంగాణా రచయితల సంఘం, ఖమ్మంమెట్టు - పేజి. 12-13)
ఆ నాటి వారి పదాలు, లాలిత్యం, తెలుసుకోటం కోసం పోస్టు చేసాను)  27.1.2013 ఉ.10.42.

No comments: