Monday, January 14, 2013

పాల్కురికి ఆదికవేనా!? – ముత్తేవి రవీంద్రనాథ్

                      క్రీ.శ.1300 ప్రాంతంలో ‘పండితారాధ్య చరిత్రము’ రాసిన పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి అంటున్నారు కేసీఆర్. మరి తేనెలొలికే తేటతెలుగులో ‘సుమతీ శతకం’, ‘నీతి శాస్త్ర ముక్తావళి’ అనే రాజనీతి గ్రంథం రాసిన బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా? పోనీ చాళుక్య యుగానికే చెందిన తెలుగు కవులు వేములవాడ భీమకవి, అమృతనాథుడు వీరి కంటికి ఆనలేదా? ఇటీవల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ చరిత్ర వక్రీకరణకు కూడా పూనుకోవడం దారుణం. నన్నయ్య తెలుగులో ఆదికవి కాడనీ, ఆయన సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం మాత్రమే చేసినందున ఆయన కేవలం అనువాదకవి మాత్రమేననీ ఆయన మాట్లాడారు. ‘బసవపురాణం’ రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని తేల్చారు. ‘ఈ ముచ్చట కూడా ఆంద్రోల్లు అబద్ధం చెప్తరు. నేను ఇట్లా అంటే వాల్లు కొట్లాటకు వస్తరు. పక్కన ఓ కవి (నందిని సిధారెడ్డి) ఉండడం వల్ల ఈ మాట ధైర్యంగా చెబుతున్నా’నని కూడా సెలవిచ్చారాయన. అలా కేసీఆర్ అలనాటి మహాకవులకు కూడా నేటి మన ప్రాంతీ య తత్వపు బురదను అంటించాలని చూడడం క్షమించరాని నేరం. పాల్కురికి సోమనాథుడు నేడు తెలంగాణ అని పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనే నమ్మకంతోనే, మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో ఆయన అలా సోమనాథ కవిని ఆదికవిని చేయబూనారనేది స్పష్టం. నన్నయ్య నేడు ఆంధ్ర ప్రాంతంగా పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనేది నిర్వివాదాంశం. అయితే మహాభారత అనువాదాన్ని ఆరంభించిన నన్నయ్య భట్టు (క్రీ.శ. 1026 ప్రాంతం) కంటే ‘కుమార సంభవం’ కావ్యం రాసిన నన్నెచోడుడు ముందరివాడని మానవల్లి రామకృష్ణ కవి వంటి ప్రముఖ విమర్శకులు వాదించినా, నన్నయ్యే ఆదికవి అని హెచ్చుమంది సాహిత్య చరిత్రకారులు తేల్చారు.

                      అందుచేతనే తెలంగాణకు చెందిన మహాకవి సినారె ‘ఆదికవి నన్నయ్య అవతరించిన నేల’ అంటూ ఓ సినీ గీతంలో కూడా రాశారు. ఇక ఇప్పుడు, క్రీ.శ.1300 ప్రాంతంలో ‘పండితారాధ్య చరిత్రము’ రాసిన పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి అంటున్నారు కేసీఆర్. పోనీ భారతం అనువదించిన నన్నయ్య లాగానే ‘కుమార సంభవం’ అనే సంస్కృత కావ్యాన్ని అనువదించిన నన్నెచోడుడు, ‘గణిత సార సంగ్రహం’ అనే అనువాద గ్రంథం రాసిన పావులూరి మల్లన్నలు కూడా అనువాద కవులే కనుక కేసీఆర్ లెక్క ప్రకారం వారిరువురూ కూడా ఆదికవి గౌరవానికి తగినవారు కాదనుకుం దాం. తేనెలొలికే తేటతెలుగులో ‘సుమతీ శతకం’, ‘నీతి శాస్త్ర ముక్తావళి’ అనే రాజనీతి గ్రంథం రాసిన బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా? పోనీ చాళుక్య యుగానికే చెందిన తెలు గు కవులు వేములవాడ భీమకవి, అమృతనాథుడు వీరి కంటికి ఆనలేదా? నేటి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు (జననం క్రీ.శ.1140) ‘శివ తత్త్వ సారం’ అనే తెలుగు శతకం రాసినట్లు కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం చిత్రం! మరీ విచిత్రమేమిటంటే ఆ మల్లికార్జున పండితారాధ్యుని అనంతరం ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర’ పేరుతో క్రీ.శ.1300లో కావ్యం రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘ఆదికవి’ అని శ్రీవారు తీర్మానించడం!! ఇక కేసీఆర్‌చే ‘ఆదికవి’గా గుర్తించబడిన పాల్కురికి సోమన వాస్తవంగా ఏ ప్రాంతానికి చెందినవాడో విచారిద్దాం. ‘బసవపురాణం’, ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర’ అన్న కావ్యాలు రాసిన పాల్కురికి సోమన ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని సమకాలికుడని కొందరి భావన. దీనికి ఆధారం పిడుపర్తి సోమన అనే కవి రాసిన ‘బసవ పురాణం’లో పాల్కురికి సోమన ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడని చెప్పడం. అతడు బహుశా క్రీ.శ.1296- 1323 మధ్యకాలంలో ఓరుగల్లును పాలించిన రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడని మనం భావించినా, అతడు ఓరుగల్లుకు చెందినవాడని నిర్ధారించడం కష్టం.
ఓరుగల్లుకు 70 మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తే ఒకనాటి సోమనాధుని స్వస్థలం అయినట్టి పాలకురికి అని కొందరి భావ న. కాని ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందలేదు. సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యంలో నాడు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాం తాలు అంతర్భాగాలు. ఆ సువిశాల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రునికి సమకాలికునిగా సోమనాథుడు ఉన్నాడని అంటే, వరంగల్ జిల్లా పాలకుర్తే సోమనాథుని స్వస్థలం పాలకురికి అని నిర్ధారించబూనడం తొందరపాటు కాగలదు. పాలకుర్తి, పాలకురికి గ్రామనామాలు వేర్వే రు. ఇక ఇప్పుడు నాటి కాకతీయ సామ్రాజ్యంలో పాలకురికి గ్రామం ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం.
                    నిజాం రాష్ట్రపు గ్రామ నామాల పట్టికను నిశితంగా పరిశీలించిన విఖ్యాత పరిశోధకులు డా.చిలుకూరి నారాయణరావు వరంగల్ జిల్లాలో అసలు పాలకురికి అనే పేరుగల గ్రామమే లేదని తేల్చారు. మరో పరిశోధకులు ఆర్.నరసింహాచార్యులు గోదావరి జిల్లాలోని పాలకురికి గ్రామమే సోమనాథుని జన్మస్థలమని పేర్కొన్నారుగానీ, వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పాలకురికి పేరుతో గ్రామమేదీ లేదు. కిట్టెల్ పండితుడు దక్షిణ మహారాష్ట్రలో పాలకురికి పేరుగల ఒక గ్రామముందని పేర్కొన్నారు. అయితే సోమనాథుని భాష, శైలి వగైరాలను పరిశీలిస్తే అతడు దక్షిణ మహారాష్ట్రకు చెందినవాడయ్యే అవకాశమే లేదు.

                    కన్నడ భాషలో ‘కురికి’, ‘గురికి’ శబ్దాలు గ్రామానికి పర్యాయపదాలు. మన తెలుగులో కుర్రు (కసుకుర్రు, బోడసకుర్రు మొ.), కుచ్చి (పోతుకుచ్చి మొ.), తమిళభాషలో కురిచ్చి (పాంచాల కురిచ్చి మొ.) శబ్దాలు ఇలాంటివే. కుర్రు శబ్దం కొన్ని గ్రామనామాలలో కాల క్రమంలో ‘కుర్తి’ (పాలకుర్తి, చీమకుర్తి మొ.)గానూ, మరికొన్ని గ్రామనామాలలో ‘కూరు’ (నిమ్మకూరు, పొదలకూరు)గా నూ రూపాంతరం చెందింది. అలా పాలకుర్తి గ్రామనామం పూర్వరూపం ‘పాలకుర్రు’ అవుతుందే కానీ ‘పాలకురికి’ అయ్యే అవకాశమే లేదు. పైపెచ్చు కురికి, గురికి శబ్దాలతో అంతమయ్యే గ్రామనామాలు కన్నడ దేశంలోనే ఉన్నాయి. సోమనాథుడు తెలుగులో మహాకవి. కన్నడ భాషలోనూ కొన్ని రచనలు చేసాడు. ఉభయ భాషలు మాట్లాడే ప్రజలు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు. అతడి భాష, శైలి వగైరాలు కూడా అతడు కన్న డ భాషా ప్రభావం ఉన్న ప్రాంతానికి చెంది ఉంటాడని సూచిస్తున్నా యి. కర్నాటక రాష్ట్రం తుమ్కూరు తాలూకాలో పాలకురికి పేరు గల ఓ గ్రామం ఉంది. ఇది మన అనంతపురం జిల్లా మడకసిరకు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఉంది. కన్నడిగులు దీనినిప్పుడు హాలకురికి అంటున్నారు. ఇదే సోమనాథుని జన్మస్థలమని డా.చిలుకూరి అభిప్రాయపడ్డారు. ఇది సమంజసమే. ఎందుకంటే- కన్నడ భాషలో ‘ప’ శబ్దం ‘హ’గా పలుకబడుతుంది. పల్లిని వారు ‘హళ్లి’ అంటారు. పులిని ‘హులి’ అంటారు. మనం ‘పాల పరిమి’ అనే గ్రామాన్ని వాళ్లు ‘హాల హరివి’ అంటారు. అలానే పాల కురికి గ్రామ నామం కన్నడిగుల పలుకుబడిలో ‘హాల కురికి’గా మారిందనేది సుస్పష్టం. ఇంత చర్చించిన తరువాత, భాషా సరిహద్దులు లేని నాటి కాకతీయ రాజ్యంలోని (నేటి కర్నాటక రాష్ట్రంలోని) పాలకురికి కి చెందిన ఓ మహాకవిని, తనకు తాను నేటి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని భావించేసి, ఆ కారణంగా ఆయన్ని కూడా తన ప్రాంతీయ దురభిమానపు కళ్ళద్దాలలోంచి చూస్తూ, నన్నయ్య స్థానంలో ఆదికవిని చేయబూనే కేసీఆర్ చర్య ఎవరికైనా జుగుప్స కలిగించక మానదు. ఒకవేళ ఆ మహాకవి నిజంగా తెలంగాణకు చెందినవాడే అనుకున్నా, ఏ రకంగా చేసినా ఆయన తెలుగులో ఆదికవి కాబోడనేది సుస్పష్టం.
నేటి కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందినంత మాత్రం చేత నన్నయ్య తెలుగులో ఆదికవీ, తెలుగు ప్రజల ఆరాధ్యకవీ కాకుండా పోతాడా? భాషకు రాష్ట్ర, ప్రాంతీయ ఎల్లలు విధించడం సమంజసమేనా? నేటి తెలంగాణ ప్రాంతానికి చెందిన సురవరం, వానమామలై, పల్లా దుర్గేశ్వర శర్మ, కాళోజీ, దాశరథి సోదరులు, సినారె, బిరుదురాజు రామరాజు వంటి గొప్ప సాహితీవేత్తలను ఎటువంటి సరిహద్దులు లేకుం డా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన తెలుగువారైనా అభిమానిస్తారు. ఇందుకోసం ఆ అభిమానులు కూడా తప్పనిసరిగా నేటి తెలంగాణ ప్రాంతంలో పుట్టాల్సిన అవసరమేమీ లేదు కదా! ‘ఆంధ్రమాత స్థానంలో ఆంద్రోల్లు తెలుగుతల్లిని కొత్తగా ముందు కు తీసుకువచ్చా’ రంటూ మరో పచ్చి అబద్ధం పలికారు కేసీఆర్. నిజానికి ఆంధ్రము, తెలుగు- ఈ రెండు పదాలనూ తెలుగువారు ఒకే అర్థంలో ప్రయోగించారు. ‘మాతా నీకిదే వందనం. ఆంధ్ర మాతా నీకిదే వందనం’ అనీ, ‘మా తెలుగుతల్లికీ మల్లెపూదండ’ అనీ, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవోడా’ అనీ తెలుగు ప్రజలు ఇష్టంగా పాడుకునే పాటలన్నీ తెలుగు కవులు ఇంచుమించుగా ఒకే కాలంలో సృష్టించారు. ఇంతకాలం విభజనవాదులు తెలంగాణ పది జిల్లాల్లో ‘ఆంధ్ర’ అనే శబ్దం మీద వ్యతిరేకత కలిగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో ఏకంగా ‘తెలుగు’ అనే శబ్దంపైనే వారు కత్తి కట్టారు. ప్రజల్ని ఇంకా ఎక్కడికి తీసుకుపోదలచారో వారు? ‘తెలుగు’, ‘ఆంధ్ర’ శబ్దాలను ఒకే అర్థంలో వాడారు కనుకనే మెదక్ జిల్లా జోగిపేటలో తెలుగువారిని ఏకం చేసే ఉద్దేశంతో జరిపిన సభను ‘ప్రథమ ఆంధ్ర మహాసభ’ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణలోని తెలుగువారు స్థాపించుకున్న గ్రంథాలయానికి ‘శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం’ అని పేరు పెట్టుకున్నారు. బొగ్గుల కుంటలో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వెలిసింది. ‘ఆంధ్ర మహిళా సభ’ స్థాపించుకున్నారు. మాడపాటి హనుమంతరావుని ‘ఆంధ్ర పితామహ’ అని పిలుచుకున్నారు. తెలుగువారిని ఒక్కటి చేసి, భాషాభివృద్ధి ద్వారా వారి మధ్య సాంస్కృతిక సమన్వయం సాధించే ఉద్దేశంతో ఏర్పరచిన తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం సంగతి సరేసరి. అప్పుడు పనికొచ్చిన ‘ఆంధ్ర’, ‘తెలుగు’ పదాలు ఇప్పుడెందుచేత గిట్టనివిగా అయ్యాయో శ్రీవారే సెలవివ్వాలి. అంతేకాదు; ‘ఆణెము’ అంటే దేశము అనే అర్థం ఉన్న కారణంగానే ‘తెలుగు మాట్లాడే ప్రదేశము’ అనే అర్థంలో తెలంగాణ అనే శబ్దం ఏర్పడితే, తీరా ఇప్పుడు ‘మా ప్రజలు మాట్లాడేది తెలుగు కాదు; మా తల్లి తెలుగుతల్లి కాదు’ అని నొక్కి వక్కాణిస్తున్న కేసీఆర్ తన మాటల వెనుక ఆంతర్యమేమిటో కూడా సెలవివ్వాలి. ఆత్మలు ఉండడమే కనుక నిజమే అయితే ‘తెలుగువాడవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడేదవు సంగతేమిటిరా; అన్య భాష లు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా?’ అని చురకలు అంటించిన కాళోజీ ఆత్మ కేసీఆర్ తీరు చూసి ఘోషిం చి తీరుతుంది.
– ముత్తేవి రవీంద్రనాథ్
సౌజన్యం: ఆంధ్రజ్యోతి (12-9-12)http://books.vasantam.net/2012/09/12/
——————————————————————————————

పాల్కురికి ఆదికవేనా!? – ముత్తేవి రవీంద్రనాథ్ | పుస్తకాలు | వసంతం
books.vasantam.net
క్రీ.శ.1300 ప్రాంతంలో ‘పండితారాధ్య చరిత్రము’ రాసిన పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి అంటున్నారు కేసీఆర్. మరి తేనెలొలికే తేటతెలుగులో ‘సుమతీ శతకం’, ‘నీతి శాస్త్ర ముక్తావళి’ అనే రాజనీతి

No comments: