Friday, March 1, 2013

||జానపద గీతం||

కపిల రాంకుమార్||జానపద గీతం||

అన్న : యేవమ్మో కావమ్మొ - కొడుకు లగ్గమెపుడమ్మో
నా మాట వినవమ్మో నా ముద్దుల సెల్లెమ్మా
ముదురుబెండకాయైతే కత్తిపీట ఒల్లదమ్మో
నా మాట యినకుంటే నీకు నాకు చెల్లమ్మో!

చెల్లి: యేందన్నా యెల్లన్నా యెల్లబెట్టినావేందన్నా
మెలికలేమి లేకుంట మూలమేదొ సెప్పన్నో
సల్లకొచ్చి ముంతదాచకెల్లన్న కతయేందన్న!
కల్లుపిడతందుకోని సల్లబడర మాయన్నా!

అన్న : బావేడే? సెప్పనీకి అరుగుమీద లేడాయె
పొద్దుగల్నే యేడకెల్లె - పొద్దెక్కి పోతుండె
పుంతలోన ఊసబియ్యం పరువుకొచ్చె జొన్న
మంచె మీది మల్లిగాడు కన్నెలెంక సూస్తండు!

చెల్లి: సంతలోన జీవాలను తోలకెల్లి రాలేదు
బేరమింక కుదిరిందా బీరువాలు నిండేను
అంతమాట అనకన్న యెంత సెడ్డ అల్లుడాయె
చింతతోపు మిర్చి కాత యెంతలోకిగాదె నిండు!

అన్న: కిందటేడు పంటలోనె సెందిరేమొ పెద్దదాయె
సందులోని జామమొక్క పిందెలేమొ పంటకొచ్చె

చెల్లి : రెండెకరాల చెలకలోన శనక్కాయ కైలు చేయి
పిల్లతోటి అంపవోయి -సల్లగాను సూసుకుంట!

అన్న: కోరికల గుర్రలు కల్లేలు లేకుంటే
కోరినంత కట్నాలు యీఓయలేను సెల్లెమ్మా!

చెల్లి: పైస లీయకుంటేను పుస్తె లెట్టకట్టనిస్త ?
అన్న బిడ్డ యెక్కువేంది కాలుబెట్టనీయనన్నా!

అన్న:పెద్దన్నను ననుయినకుంటె నీ మక్కెలిరగ తన్నేను
బక్కపానమాగిపోతే బావ బతుకు బుగ్గికాద!

చెల్లి: బెదిరేదిలేదని తెలియదా నీకు
నీలాగె పరుసాన నీతోడ పుట్టాను!

అన్న: రా చిలుక గోరింక రంజైన జోడంట
కట్నాలు లెఖుంటె నీకల్ల నీల్లంట!

రోజులేమొ మారిపోయె
జాజి పొదల చూడువారి
మల్లిగాడు సెందిరమ్మ
చెట్టపట్టలాడుతుండ్రు!

చెల్లి అట్లయితే నేనేమి చేతు - కులపోళ్ళ యిందు పిలిచి
పల్లకీల పిల్లనంపు - మల్లిగాడి మనువు చేస్త!

అన్న: తాలిబొట్టు తోరనాలు - ఊరువాడ సంబరాలు
కట్నమూసులేని పెల్లి - పట్నమోల్ల కల్లు కుట్ట!

@@@@

(అముద్రిత జనపద్యం నుండి)
1.3.2013 ఉ.5.30

No comments: