Friday, March 22, 2013

| జ్ఞాపకాల సోది 9 ||చేపలవేట!||

కపిల రాంకుమార్|| జ్ఞాపకాల సోది 9 ||చేపలవేట!||

చెరువు అలుగు పారిందంటే
ఆనందమే ఆనందం!
పారే నీటిని చూచికాదు!
జలపాతంలా వాగులోకి దూకే నీటనుండి
చెరువులోకి ఎదురీదే చేపల్ని చూచి!

ప్లాస్టిక్‌ సంచి ఓకచేత్తో
ఎదురొచ్చే చేపను మరోచేత్తో పట్టుకోవటం సరదా!
సంచి బరువెక్కగగానే
మా మోటబావిలో వదిలెయ్యటం
నాచును శుభ్రపరుస్తాయికదా
వాటికదే మేతకూడ!
ఈదేటప్పుడు కాళ్ళకు చుట్టుకుపోతుంది
ఇప్పుడా బెడదా తీరుతుంది కదా!

నా చేపల వేటకు
కురమోళ్ళ ముత్తయ్య, చాకలి కిట్టప్ప
సావాసగాళ్ళు !
అప్పుడే బీడి, చుట్ట అలవాటయింది!

అదేపనిలో వుండగా ఒకసారి
చురుక్కుమని గుచ్చుకుంటే
పట్టిన చేపని వదిలేసి
యేందిరా అది అన్నాను
ఓసోసి అది జల్ల చేప కాదూ
దానికి ముల్లుంటద్ది
భలే కుట్టుద్ది...నవ్వుతు చెప్పాడు కిట్టప్ప
ఇకిలించింది చాలు మటకీతి నేనుంటే
కసుర్కున్నాను
కరణపోరివళ్ళు బహు నాజూకు కదా ఊరుకో కిట్టిగా
మనలా వోర్చుకోలేరు, కాసేపు ఆగితే నెప్పి తగ్గుద్ది
పెద్ద ఆరిందాలా సముదాయించాడు ముత్తయ్య
బురదమట్టనుకుని దాక్కున్నదాన్ని
దొరకపుచ్చుకుంటే జల్లయిచ్చింది!

''పట్టీనప్పుదు కుట్టిన ముల్లు యింత నెప్పికదా
మరి ముళ్ళున్నచేప ముక్క అంగిట్లో పడితే...సందేహం!
ముద్ద మింగలేక ముల్లు బయటకు రాక యెలారోయ్ ''
యధాలాపంగా పైకే అనేసాను
విరగబడినవ్వడం ముత్తయ్యవంతయింది!
నన్నన్నావే నువ్వికలిస్తావేం
వారికి తెలీయదు కదా!
చెప్పొద్దూ...చేపలురుద్దేటప్పుడు కొంత
ఇక తినేటప్పుడు మరీ చూసుకుని తింటామని చెప్పిచావు!
అన్నాడు కిట్టి గాడు!
నోరెల్లబెట్టి వినడమేకదా నాపనయింది!

ఎంతసేపు సరదాగా వాటిని పట్టడం
బావిలో వేయటం
నాచు తిని బాగా యెదిగిన వాటిని చూచి మురిసిపోవడం!
నాచులేని బావిలో మిట్టమధ్యాన్నం వేళ
తోటపనైంతర్వాత
గంటా రెండు గంటలు
బాగా ఆకలయ్యేదాక యీదటం
అదేగా నాకు తెలిసేడుస్త!
అదో వింత అనుభూతి,
ఆనందం
ఆటవిడుపు!
కూలిపోయిన మా మోటబావిని చూసినప్పుడల్లా
చేపలవేట, జల్లచేప ముల్లు గుర్తుకొస్తుంటాయి.

22.03.2013 11.45

No comments: