Tuesday, March 19, 2013

||జ్ఞాపకాల సోది - 7 ||

కపిల రాంకుమార్ ||జ్ఞాపకాల సోది - 7 ||

1969 సంవత్సరంలో
మోట తొలే తొలి రోజులలో
నేనే పోటుగాడిననుకునేవాణ్ణి!
గట్టుమీది వ్యవసాయమనే అపప్రథ తొలగేలా
ముక్కున వేలువేసుకునేలా
బాపనసేద్యం సత్తా చూపించకలిగాం,
యెవరికీ తీసిపోమని నాన్న నేనూ!

ఒకరోజు ఆయన, మరో రోజు నేను
ఒకరు మోట తోలితే
ఇంకొకరం మడవలకు నీళ్ళు తిప్పేవాళ్ళం!
మిరప మొక్కల్లో గొర్రుతోలటం,
బోదెలు వేయటం చెరొసారి పంచుకునేవాళ్ళం

చుట్టుపక్కల ఊళ్ళకు సేద్యంలో
మైలురాయి మా నాన్నే
ఆ రోజుల్లోనే కొత్తవంగడాలు
ఆధినిక పద్ధతులు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే!

**

నేను మోట తోలుతుండగా
బొక్కెన తొండ్మ్ తాడు తెగింది
పైకి వచ్చిన బొక్కెన
దిగ్గున కిందకు జారటం
వెనాకి నడిచే వేగానికి
నేను గాడిలో పడటం
తెలివైన కర్రెద్దు చటుక్కున ఆగి,
యెల్లెద్దు కాడిని నేలకు వంచింది!
రాబోయే విపత్తును పసికట్టి -
నన్ను కాపాడినందుకే కర్రెద్దు కాలి విరిగింది!
అది అరిచిన అరువు నా గుండె అదిరింది!
బావిలో పడే వాణ్ణి ఆదుకుని
తనకు ఆపద తెచ్చుకుంది!
(దరిమిలా తన కాలు పోగొట్టుకుంది)
ఎత్తుబడిన కర్రెద్దు నెల తిరక్కుండానే
బావొడ్డునే సమాధిగా చేసుకుంది!
ముక్కోటి యేకాశొచ్చినప్పుడల్లా
ముక్కు మూసుకున్న కర్రెద్దు అరుపే
నా మనసును కెలుకుతూవుంటుంది!
దాని త్యాగం వల్లనేగా నేను బతికి బట్టకట్టింది!
అది గతించిన తరువాత మోట మారి
కరెంటు మోటరు పెట్టుకున్నాం
మా వూరికి కరెంటు వచ్చిన 1972లో!

19.3.2013 ఉదయ. 5.20

No comments: