Saturday, March 2, 2013

తెలుగు పిడుగు గిడుగు రామమూర్తి గారు…

తెలుగు పిడుగు గిడుగు రామమూర్తి గారు…

తెలుగు పిడుగు గిడుగు రామమూర్తి గారు…
గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులుగా మాత్రమే అందరికీ గుర్తుకొస్తుంది. ఆ కారణంగానే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సామాన్య ప్రజలకు అర్థం కాని… వేదాల్లో ఉండే భాషను ప్రామాణికంగా తీసుకున్న కాలంలో తెలుగు భాషను సామాన్యుల స్థాయికి దించడానికి ఆయన జీవితకాల పోరాటం చేసిన మాట వాస్తవమే !
కానీ ఆయన కేవలం తెలుగు భాషోద్ధరణకే పరిమితం కాలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఎవరికీ పట్టని ఆదివాసుల సమస్యలకు ఎన్నిటికో ఆయన పరిష్కారం చూపారు. ఆదివాసుల సంక్షేమానికి కృషి చేసిన వాళ్ళకు ఈయనే మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల గిరిజనులు మాట్లాడే భాషలలో ముఖ్యమైనది సవర భాష. ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా ఈ భాష ప్రస్తావన ఉందంటారు. అప్పటివరకూ ఆ భాషకు లిపి లేదు. వారి మాతృ భాషలో చదువుకునే యోగం ఆ గిరిపుత్రులకు ఉండేది కాదు. ఈ పరిస్థితి గమనించిన గిడుగు వారు ఆ భాషపై విస్తృత పరిశోధన చేసి ధ్వన్యాత్మక లిపిని రూపొందించారు.
కేవలం లిపిని రూపొందించి వదిలివేయలేదు. ఆ లిపిలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసారు. ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజలను విద్యావంతులను చెయ్యడానికి పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వాటి నిర్వహణకు తన స్వంత డబ్బును సైతం ఖర్చు చెయ్యడానికి వెనుకాడలేదు. వాటిని అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకువచ్చి సాధించారు. అంతే కాదు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం కూడా రూపొందించారు. వారి సమస్యలెన్నిటికో ఆయన పరిష్కారాలు చూపారు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతగా కృషి చేసినవారు అప్పటికీ, ఇప్పటికీ ఇంకెవరూ లేరేమో !
గిడుగు వారు కేవలం తెలుగు వ్యావహారిక భాష మీదనే పరిశోధనలు చెయ్యలేదు. గ్రాంథిక భాషలో కూడా ఉద్దండులే ! ఆంగ్ల భాషలో కూడా ఆయన పరిశోధనలు సాగాయి. తెలుగు వారికి ఆంగ్లం సులువుగా నేర్చుకునే పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఒక పత్రికను కూడా నిర్వహించారు.
నిజానికి గిడుగు రామమూర్తి గారి ముందుతరం వారు, సమకాలీనుల గురించి పరిశోధన, ప్రచారం జరిగినంతగా ఆయన గురించి జరుగలేదేమో ! అక్కడక్కడ కొంత జరిగినా అది అసమగ్రంగానే వుంది. మన భాషావికాసానికి ఉద్యమించి తెలుగును సజీవం చెయ్యడానికి పాటుపడిన ఆ మహానుభావుడి గురించి మరింత విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సార్థకత వుంటుంది.
తేనె కన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు తెలుగు భాష లెస్స …….
ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం: ‘శిష్ట వ్యవహారిక’ రూప శిల్పి ” గిడుగు ” జయంతి
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటారు.. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు స్కూలు కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ‘తెలుగు’ అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు. వీరి కృషి కారణంగా 1912-13లో స్కూల్ ఫైనల్ బోర్డు తెలుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అప్ప టి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన ఒ క కమిటీలో గ్రాంథిక వాదులు ఆధిపత్యంతో వ్యావహారిక భాష లో బోధనను రద్దు చేసినా అనంతర కాలంలో పున రు ద్ధరించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ యన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు అనే తెగ భా షను నేర్చుకుని అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదునివ్వగా ఆ తరువాత కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనకు లభించింది. వ్యావహారిక భాషకు ఇంత సేవ చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న మరణించారు.
-తెలుగు సాహిత్య వేదిక

No comments: