కపిల రాంకుమార్|| గరెళ్ళ సత్యనారాయణ గారి గేయం||
''మాకొద్దీ తెల్ల దొరతనము!''
పల్లవి: మా కొద్దీ తెల్ల దొరతనము దేవ మా కొద్దీ తెల్ల దొరతనము
అనుపల్లవి: మా ప్రాణాలపై పొంచి – మానాలు హరియించె //మాకొద్దీ//
చరణములు
1. పన్నెండు దేశాలు – పండుచున్నాగాని – పట్టెడన్నమె లోపమండి/
ఉప్పు ! ముట్టుకుంటే దోషమండి! నోట – మట్టికొట్టి పోతాడండి!
అయ్యొ! కుక్కలతో పోరాడి – కూడు తింటామండీ //మాకొద్దీ//
2. వర్తకంబునకొచ్చి – పట్టణంబుల పట్టి – రాజ్య మొక్కటి అల్లినాడు
దాన్ని – రాణి కప్పగించినాడు! రాణి – పత్రమ్ము చించేసినాడు!
ఈ చిత్రమిదేమన్న – శిక్షిస్తానంటాడు //మాకొద్దీ//
3. కోర్టులంటూ పెట్టి – పార్టీలు పుట్టించి – స్నేహభావము చంపినాడు
ద్రవ్య – దాహము కల్పించినాడు! చెడ్డ – యూహలు కడు పెంచినాడు
మా – ఆహారముల ద్రుంచి – ఆహా! యనిపించినాడు //మాకొద్దీ//
4. ప్రజల క్షేమంకోసం- పెట్టిన సంస్థలు – ప్రభులకోసం – మార్చేస్తాడు
వాటి – ప్రజల శత్రులు చేసుతాడు! మమ్ము – గజిబిజి లాడ చేస్తాడు
వాడి – గడబిడ వర్ణింప – కాదు బ్రహ్మ కైన //మాకొద్దీ//
5. నూటనలుబదినాల్గు – నోటికి తగిలించి – మాటలాడ వద్దంటాడు!
మమ్ము – పాట పాడ వద్దంటాడు! తనను – దాటి వెళ్ళవద్దంటాడు!
అయ్యొ – చేటు తెచ్చుకొ మమ్ము – చెడిపోవమంటాడు //మాకొద్దీ//
6. ఘోర శాసనాలు – కూడదీసి మాదు – సారములెల్ల పీల్చాడు!
సంసారము లెల్ల కూల్చాడు! మా చీరలనెల్ల వొల్చాడు! బంగారములెల్ల దోచాడు!
వాడు – ధనవంతులనుబట్టి (తైతక్కలాడ్తాడు) దడదడలాడ్తాడు //మాకొద్దీ//
7. ధనముకోసం వాడు దారిచేసికొని – కల్లుసారా యమ్ముతాడు!
మాదు – ముల్లె మూటలు దోచినాడు! ఆలి – మెళ్లో పుస్తెలు త్రెంచినాడు!
మాదు – కళ్ళల్లొ దుమ్మేసి – కాటికి దరిచేస్తాడు //మాకొద్దీ//
8. పంటపోయిన గాని – పన్నులు విడువక – వెంట కరణాలంపుతాడు
వారి – వెంట తహశీల్దార్నంపుతాడు! లే కుంటే ఉద్యోగం తీస్తాడు!
మా ఇంటిలోపల యిట్లు – యిడుమల్లు పెడుతాడు //మాకొద్దీ//
9. ఏడాది కేడాది – కెక్కువ సిస్తేసి – ఈ భూమి నాదే నన్నాడు
మమ్ము కూలికి దున్నుమన్నాడు కడుపు మంటతో చావ మన్నాడు
అయ్యొ బానిసలకు వాడు – ప్రభువౌతనన్నాడు //మాకొద్దీ//
10. స్వరాజ్యమందిర – స్థాపితమైనట్టి – జండాలన్నియు పీకుతాడు
దేశం ముండా మొయ్యమంటాడు వాడు – బండతనము చూపుతాడు
ఈ ఛండాలపు వృత్తి – స్వీకరించెను నేడు //మాకొద్దీ//
11. దండు పట్టుకవచ్చి – తగుదునమ్మా యంచు దార్ల వెంబడి త్రిప్పుతాడు!
జాక్జెండా మీది కెత్తుతాడు దానికి దండం పెట్టమంటాడు
వాడి గుండుబలం క్రింద – కూల రమ్మంటాడు //మాకొద్దీ//
12. మాదు నెయ్యము చెడగొట్టుతాడు సేన కయ్యొ పాపము గట్టుతాడు
అయ్యొ వెయ్యేల! పోలీసు విధులు – మరిపిస్తాడు //మాకొద్దీ//
13. గాంధీటోపీ పెట్టి – పాఠశాలకు బోవ – రావద్దు రావద్దంటాడు!
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపుల బాదుతాడు
వాడి రాజద్రోహమంత – రాట్నములో ఉన్నదట //మాకొద్దీ//
14. నూరుమంది మలబారు వాసులను – కూరినాడొక పెట్టెలోన
నోట నీరు పోయడు, దేవు నాన! గాలి దూరనీయడించుకైన
వాడి దారుణత్వమెట్లు – తరిమివైతువొ దేవ //మాకొద్దీ//
15. ప్రభువు గాంధితోడ – భారత దేశమాత – పరమ తపము చేసినాది
ధర్మదేవత ప్రత్యక్షమైనాది కోరిన వరము లిస్తానన్నాది!
ఆ దొరల గుండెలలోన – దడదడ పుట్టింది //మాకొద్దీ//
16. చూడియావుల కడుపు – వేడివేడి మాంసం – వాడికి బహు యిష్టమంట
మాదు పాడి పశువుల కోస్తాడంట! మా మతము పాడు చేస్తాడంట!
మా చూడి యావుల మంద – సురిగి, యింటికి రాదు //మాకొద్దీ//
17. చిత్తరంజన దాసు – చిన్నారు కొమరుని – చెయి విరచి చెర బెట్టినాడు
అతని పెత్తనంబును బట్టినాడు! వారి ముత్తైదువుల పట్టినాడు!
వాడి సొత్తుకు నిలమీద – చోటు లేదన్నాడు //మాకొద్దీ//
18. మా చీరాలను యిప్డు – చేరినాడు – చూచి సిగ్గును పొందబోడోయి!
ఇంక బీరాలు పలుకుతాడోయి! మాదు సారము గ్రహియింపడోయి!
వాడి దూరాలోచనమెల్ల – ధూళిలో కలిసింది //మాకొద్దీ//
19. వాటి తాతగారి ముల్లె దాచిపెట్టినయట్లు – ధాటీ చేస్తా డీ దేశమున!
పో రాడా మాడ్తాడాపైన, మో మోటము పడడు సుంతైనా
వాడి పాటుపాడై పోను – మాట చెపితే వినడు //మాకొద్దీ//
20. తెల్ల దొరల సేవ – వల్ల బ్రతుకుట పెద్ద నల్లని మచ్చని యెంచరోయి!
జాతి కల్లా తప్పని యెంచరోయి దైవ మొల్లడంచు తల్చరోయి
భూమి తల్లీ యేడ్పులు వినరోయి!
వారి యుల్లమెల్ల – సన్నికల్లులై పోయాయి! //మాకొద్దీ//
21. ఎవరి యనుమతిపైన – హిందూ దేశమునందు పరిపాలనము పెట్టినాడు?
వీడు ఎవరికీ జవాబు నీడు ధర్మ మార్గము నంటుకొని పోడు
వీడి దారుణత్వముకింక తగిన యీడే లేదు //మాకొద్దీ//
22. వాడి శాసనాలు – మాడిపోను, వాటి గోడియె మాకొద్దు తండ్రి!
ధర్మ దేవుడె మా రక్ష సుండి! ప్రజల ప్రేమయె మాకు దిక్కండి
కష్ట కాండమె మా పాలు సుండి
ఈ సృష్టి మమ్ము చూచి – సుందరమన నిండి //మాకొద్దీ//
23. దొరల బాధలు మాకు – తొలగించుమో తండ్రి నిరతము నిను గొల్తుమయ్య!
నీదు చరణధ్యానమె విడువమయ్య మేము మరువము మా ధర్మమయ్య
మేము ఐకమత్యముతోడ అలరారుతామయ్య //మాకొద్దీ//
24. గుండు పట్టుకొ మమ్ము–కూల్చ వచ్చినగాని - కూర్చున్న చోటుల వీడము!
పాడుకొంటూ రాట్నం త్రిప్పుతాము రాజ్యసూత్రము వడి, వడుకుతాము!
దేవ శాంతిని తప్పము – సంతసం విడువము //మాకొద్దీ//
25. దేశభక్తులనెల్ల దోషు లంచును పెద్ద – మోసగాండ్రని యెంచుతాడు
శాంతి నాశకులని పిలుచుతాడు దొంగలతో సరిగ మము చూచుతాడు!
వాడి వూసు యెట్టిదొ కాని – చూచి యోర్వలేడు //మాకొద్దీ//
26. బ్రాహ్మణా బ్రాహ్మణ – పంచమ బ్రాహ్మణ – భేదపు తెగలు మీకేల?
మీ భేదాలు వడి కాల్పరేల! చెడ్డ బోధలకు లొంగిరేల?
యీ మాధుకరపు వృత్తి – మరగినారది యేల? //మాకొద్దీ//
27. ఎవరెన్ని చెప్పిన హిందూదేశవాసు – లేక సోదరులె సుండీ
అంటూ దోషము మాకు లేదండీ పాపమంటూ చాటుదాము రండీ
ఈ కుంటి వాదనలు – గూటిలో పెట్టండి //మాకొద్దీ//
28. స్నానధ్యానము చేసి – రామ కృష్ణ యంచు - దేవుడి గుడిలోకి రండీ
అభి షేకమతనికి చేయండి నిర్మలత్వ మాత్మను పొందండి
ధర్మ మార్గమును తగిలి, మాలలూ రండి //మాకొద్దీ//
29. జయము నపజయమును – త్రాసులోపల పెట్టి -చక్కగ తూస్తామంటారు
ధర్మమె జయమని నమ్ముతారు దైవ నైజము గుర్తెరుగలేరు
పప్పు భోజనం కోసము – పుట్టామనుకొంటారు //మాకొద్దీ//
30. రాట్నలక్ష్మి నవ్వు – రంజిల్లు మోముతో – పాడుచున్నది నోటి నిండా
కరవు మాడుచున్నది దాని యెండా స్వేచ్ఛ తిరుగుచున్నది దానిగుండా
ఆ దొరల తేజంబెల్ల – తూల్చే జండా యుండా //మాకొద్దీ//
31. ఎన్ని జన్మములందు – ఏమి నేరము చేసి - కన్నుగానక తిరిగినామొ
ప్రజల అన్నమెల్లను క్రుమ్మినామొ దైత్యుల కన్న చెడ్డగ మెలగినామొ
నేడు దున్నలవలె నిట్లు – దొరకితిమి దొరలకు //మాకొద్దీ//
32. ప్రాపంచమెల్లను – పట్టి పిండేటంత పశుబలము వాడికుందంట
దాన వశ పరచుతాడు మమ్మంట మమ్ము కసిదీర కొట్టుతాడంట
వాడి శషభిషలెల్లను చెపుతాడు మా యింట //మాకొద్దీ//
33. స్వచ్ఛతేజముతోడ – స్వేచ్ఛావధూమణి - కారాగృహమున వేచియుంది
పూలగుచ్ఛములను దాల్చియుంది మీకు ముచ్చటలను తెల్పుతుంది
యీ చచ్చు రాజ్యము వీడి సరిగ జైలుకు రండి! //మాకొద్దీ//
34. విచ్చలవిడిగాను విప్పి రెక్కలు మీరు - విహరింపవచ్చు – మీరచట
స్వేచ్ఛ నిచ్చ నెక్కగ వచ్చు నచట దైవం మెప్పులందగవచ్చు నచట
తల్లి కచ్చియున్న రుణము నర్పింపగా వచ్చు //మాకొద్దీ//
35. సకల దేశములార – సత్యవర్తనతోడ సారించు డిటుల మీ దృష్టి
యింక కనుడి హైందవ పుష్టి వేగ తెరవు దొరకుట క్రొత్త సృష్టి
ఎట్టి దండన లెదురైన – కాదు మాకు నష్టి //మాకొద్దీ//
36. ధర్మపక్షము నేడు – దారుణమైనట్టి బడలిక పాలయ్యె నయ్య
దాని వదలించుకొనలేదయ్య నీదు పదునగు ధారనీవయ్య
నీదు పదములపై వ్రాలి – ప్రార్థించినామయ్య //మాకొద్దీ//
37. ప్రపంచమున శాంతి – ప్రేమ దీపంబులు వెలిగించె నీ దేశమంత
గాంధి తెనిగించె నీ క్రొత్త వ్రాత స్వేచ్ఛ మొలిపించె మన శక్తి చేత
బలము దుర్బలమను – భేదమెచ్చట లేదు //మాకొద్దీ//
38. మా పాపమునెల్ల బాపి రక్షించుమా – పాపనాశన! ధర్మమూర్తీ
యిటుల కోపముంచకు – న్యాయమూర్తీ ఆపదల బాపుమో చక్రవర్తీ
నీ వ్యాపారమొకసారి – నెరపుము పృథ్విపై //మాకొద్దీ//
39. దీనుల పాలిటి – తేజమవీవని – వీనులారగ నేను వింటి
కోటి దీనుల మా భూమికంటె మము సమాన యుగముగ చూడుమంటి
మా ప్రాణాలైన నోర్చి – మాన మిమ్మంటి //మాకొద్దీ తెల్లదొరతనము//
* * * * *
Song written by Late Garimella Satyanarayana, A national Telugu poet
28-03-2013 ఉదయం 4.59
No comments:
Post a Comment