Tuesday, March 12, 2013

డాక్టర్ శ్రీపాద పినాకపాణి అస్తమయం

మూగబోయిన రాగం
డాక్టర్ శ్రీపాద పినాకపాణి అస్తమయం
శోకసంద్రంలో సంగీతప్రియులు
ప్రముఖుల సంతాపం..
నేడు కర్నూలులో అంత్యక్రియలు

కర్నూలు, హైదరాబాద్, మార్చి 11: కర్ణాటక సంగీతాన్ని తెలుగునాట తంజావూరు బాణీలో కొత్తపుంతలు తొక్కించి సంగీతప్రియుల ప్రశంసలు అందుకున్న సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పినాకపాణి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలులో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

స్వరరాగ గంగా ప్రవాహమే..
శ్రీపాద పినాకపాణి 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో శ్రీపాద రామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో, ఆయనకు చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ ఏర్పడింది. దీన్ని గమనించిన తల్లితండ్రులు.. రాజమండ్రికి చెందిన బీఎస్ లక్ష్మణ్‌రావు దగ్గర 11 ఏళ్ల వయసులో ఆయన్ను చేర్పించారు. పినాకపాణికి ఆయనే మొదటి గురువు. 18 ఏళ్ల వయసులో ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడి వద్ద ఆయన రెండున్నర నెలల పాటు శిష్యరికం చేశారు.

ఉత్సవాలు, కచేరీలకు వెళ్తూ ప్రముఖ విద్వాంసులతో పరిచయాలు పెంచుకున్నారు. రంగ రామానుజ అయ్యంగార్ లాంటి తమిళ సంగీత విద్వాంసుల సాహచర్యంతో కొత్తకృతులను సేకరించి తన ప్రతిభకు పదును పెట్టుకున్నారు. సంగీత సాధనకు సమాంతరంగా విద్యాభ్యాసాన్నీ కొనసాగించారు. రాజమండ్రిలో హైస్కూల్, కళాశాల విద్య.. 1938లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 1945లో జనరల్ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసి అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా రాజమండ్రిలో చేరారు. అక్కణ్నుంచి వైజాగ్‌కు బదిలీ అయ్యారు. 1957లో కర్నూలు మెడికల్ కళాశాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడే ప్రిన్సిపాల్‌గా, ఆసుపత్రి పర్యవేక్షకుడిగా పనిచేశారు. 30 ఏళ్లపాటు వైద్యుడిగా సేవలందించి.. 1968లో పదవీ విరమణ చేశారు.

కర్నూలు కార్యక్షేత్రంగా తన శేషజీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. ఆయన భార్య.. బాలాంబ. 1940లో వీరి వివాహం అయింది. ఆయన రచనలు.. మనోధర్మ సంగీతం, పల్లవి గానసుధ, మేళ రాగమాలిక కర్ణాటక సంగీతానికి విలువైన కానుకలు. టీటీడీ ఆయన రచనలను 'సంగీత సౌరభం' పేరుతో నాలుగు సంపుటాలుగా ముద్రించింది. అందులో పినాకపాణి స్వరపరిచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజు తదితర వాగ్గేయకారుల కృతులు 607, ముత్తుస్వామి దీక్షితుల కృతులు 173, 44 పదాలు.. వెరసి 1,088 రసగుళికలు ఉన్నాయి. ఇంతేకాక.. 'నా సంగీత యాత్ర ' అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. 1973లో టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. అయితే.. శాస్త్రీయ సంగీతానికి మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం పట్ల చివరి వరకూ పినాకపాణి అసంతృప్తితో, ఆవేదనతో ఉండేవారు.

ఎన్నో పురస్కారాలు..
1966లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, 1970లో సంగీత కళా శిఖామణి, 1973లో విశాఖలో గాన కళాసాగర, 1974లో టీటీడీ సప్తగిరి సంగీత విద్వన్మణి, 1977లో సంగీత నాటక అకాడమీ పురస్కారాలు పొందారు. 1978లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆయన సంగీతాన్ని రికార్డు చేసి భద్రపరిచింది. అదే ఏడాది.. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో, 1983లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి పురస్కారంతో ఆయనను సత్కరించాయి. 1984లో అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్ చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 2012లో తెలుగువెలుగు పురస్కారం వరించింది. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు రిటైరయ్యారు. రెండో కుమారుడు వైద్యు డిగా పనిచేసి, 15 ఏళ్ల కిందట మృతిచెందారు. మూడో కుమారుడు రిటైరయ్యారు. నాలుగో కుమారుడు కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్.

ప్రముఖుల సంతాపం..
పినాకపాణి మృతితో సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. పినాకపాణి మృతి దేశానికే తీరనిలోటు అని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. "తుదిశ్వాస వరకూ సంగీతం కోసం ఆయన పడిన తపన ఆదర్శప్రాయం. నా చిన్నతనంనుంచీ ఆయన్ను చూశాను. ఆ మహానుభావుడి అంత్యక్రియలకు ప్రభుత్వం దోహదపడేలా సీఎంతో మాట్లాడతా'' అన్నారు. పినాకపాణి మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి కూడా పేర్కొన్నారు.

శిష్య ప్రముఖులు
ఇటు సంగీతరంగంలో.. అటు వైద్య రంగంలో.. పినాకపాణి వద్ద శిక్షణ పొందినవారెందరో నేడు దేశవిదేశాల్లో ప్రముఖులుగా పేరొందారు. సుప్రసిద్ధ సినీనటుడు అమితాబ్ బచ్చన్‌కు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ జగన్నాథ్, సోనియాగాంధీకి అమెరికాలో శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ నోరి దత్తాత్రే యుడు వంటివారు 'డాక్టర్' పినాకపాణి శిష్యులైతే.. నూకల చిన సత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సోదరులు వంటివారు 'సంగీత కళానిధి' పినాకపాణి శిష్యులు!

శ్రీగాన విద్యా వారధి
పినాకపాణి వందో పుట్టినరోజు వేడుకలు 2012 ఆగస్టు 3న టీటీడీ, తెలుగు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చేతుల మీదుగా ఆయనకు స్వర్ణ కంకణధారణ చేయించారు. టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు పట్టు వస్త్రాలు, రూ.10,01,116 చెక్ అందించారు. శ్రీగాన విద్యావారధి బిరుదుతో సత్కరించారు.

No comments: