Sunday, March 17, 2013

||జ్ఞాపకాల సోది - 6 ||

కపిల రాంకుమార్ ||జ్ఞాపకాల సోది - 6 ||

మది గదిలో పదిలపర్చుకున్న
యాదుల్లో విషాదపు గుర్తులూ వున్నాయి!
ఉరకలెత్తే వయసులో
కొత్తగా సాగదీసిన కోడె గిత్తలతో
కచ్చడం బండి సవారీ ఓ సాహసమే!
మువ్వల పట్టెళ్ళు
తొట్టిగడలకు నగిషీలు
శిరలకు గజ్జెలు
ఎర్రనూలు పలుపులు
రంజైన చెర్నకోల!
శివరత్రి తిరునాళ్ళకు ముస్తాబు చేసి
నీలాద్రి గుట్టలకు బయలెల్లాం!
దారంతా చిక్కని ఆడవి!
**
నా అమలిన శృంగార నాయికతో సరదాగాకు
తిరునాళ్ళ పయనం కలిసొచ్చిన అదృష్టం!
తిరుగు ప్రయాణంలో బండెక్కింది
ఖాళీగా విన్న నా గుండెలో దూరింది.
ఇంటిదారి యావలో
బండి వేగం పుంజుకోవటం సహజమే
అంతలో మేఘావృతమైంది ఆకాశం
ఉరుములు - మెరుపులు
ఉలిక్కిపడటాలు, దగ్గరకు రావడాలు
కనిపించని కాలనాగులా కారుచీకటి
వాగులోకి దిగుతున్న అలికిడి స్పష్టం
అదాటుగా బండి రోజా బండరాయెక్కటం
వాగులో బోర్లపడటం
ఉధృతంగా పారుతున్న వాగు
నీరు బండిలోకి ప్రవేశం
ఓక్కసారే జరిగాయి.
బండిలోంచి జారుతున్న చెలియ
అందున్నా చెరగును
చెలియ తప్పిపోయింది
నీటిలో కొట్టుకుపోయిందేమొ
చీరకొంగే మిగిలింది!
రెండు దినాలు వెతుకులాట
దినదినగండంగా గడిచింది!
ఆచూకి లేదు
ఆత్మన్యూనతతో కుదేలైన మనసుకు నచ్చచెప్పుకోలేక
కొద్దిపాటి ప్రేమానుభూతిగా మిగిలిన
చిరకొంగు పదిలంగా దాచుకోటం తప్ప!
ప్రతి శివరాత్రి గుచ్చుకుంటుంది తీయని బాధగా !

17-3-2013 ఉదయం 5.19

No comments: