కపిల రాంకుమార్|| జానపద గీతం||
రంగయ్య: బోడిమిల్లి గాంధి గారి - మామిడి తోట కొస్తానంటే
రంగం బంజరు రంగమ్మో రంగుల గాలు తెస్తానే..
రంగమ్మ: కల్లూరెంకయ చిన కొడకా కల్లూనెత్తికొచ్చాయా
వల్లుమంటలు పుడతావుంటే ముల్లాకంప మీదికేస్తా!
రంగయ్య: వన్నెలు చిన్నెలున్నాయాని కన్నులు నిన్నె కోరుతున్నాయ్
గందరగోళం చేయమాకె తొందరలోనె చేయి పడతా!
రంగమ్మ: ముక్కుకు ముక్కెర తెస్తావని పక్కన అక్కరకొస్తావని
జొన్నచేలో యెదురుచూస్తే చులకన చేస్తివి మోసగాడ!
రంగయ్య:- నేను వచ్చే దారిలోన దందర్రవు అపేసే
పొద్దుపోయి రాకపోతిని సద్దుచేయక ముద్దులీవె!
రంగమ్మ:- యెదురు చూచి నిదురమాని కనులు వాచి కోరుకుంటె
లేనిపోని కతలు చెప్పి మాటనీవు తప్పినావు!
రంగయ్య: తప్పు కాసి సర్దుకుంటే తప్పకుండ మాట నిలిపి
ఒప్పుచేయ వొంటిమీద యేసుకుంట పచ్చబొట్టు!
రంగమ్మ: అప్పటిదాక నమ్మేదెట్ల -కమిలికొట్లో పసుపుకొమ్ము
గంగులబాబు యింటివద్ద కట్టితేనె ఒప్పుకుంట!
రంగయ్య: మొండిపట్టుపట్టమాకె పందిట్లోనె చేయి పడత
ఊరువాడ పెద్దలందరు వచ్చేదాక ఓపిక పట్టు!
రంగమ్మ: ఓప లేని సిగ్గుతోడ బుగ్గకందిపోయె చూడు
అందరిముందు కన్నులవిందు పందిర్లోనె పెళ్ళియాడు!
***
..రచనా కాలం 5/92
30.3.2013. రాత్రి 7.40
No comments:
Post a Comment