||దీర్ఘ జీవిత క(వి)త (వ్యథ) ||
నిజమే
అంతా ఐపోయిన తర్వాత కాని
పోగొట్టుకున్నదేమొతో తెలిసిరాలేదు!
సుద్దులు చెబుతున్నానని
బుగ్గమీద వేలు వేయకండి
నొసలు వెక్కిరించకండి!
నాల్గో సంతానం మళ్ళి ఆడపిల్లనవటమే
నా దురదృష్టమైంది
అప్పటికే ఇద్దరాడపిల్లల్ని బడికితోలారు
మూడొదాన్ని కర్ణంగారింట్లో పాచిపనికి పెట్టారు!
పెద్దక్క, రెండోది హాస్టల్లో చదువుకూంటునారు
**
కరువు కాటకాలవల్ల
రోజులు గడవని స్థితిలో
అప్పులు మస్తుగావున్నందుకు
గడీలో దొరవద్ద పనికి పెట్టారు నా పదోయేట!
పాపం పుణ్యం తెలియని నేను
అలా దొరసానికి సేవచేయటానికి
మాత్రమేననుకున్నాను!
అందుకు తగ్గట్టే దొరసాని అన్నపూర్ణే
నా కడుపు నింపింది – కట్ట గుడ్డైంది
తనకు వంట్లో శక్తియున్నంతకాలం
కంటికి రెప్పైంది పుణ్యాత్మురాలు కాబట్టి!
అందుకు నా చర్మం వొలి్చి చెప్పులు కుట్టివ్వచ్చు!
**
యెల్లకాలం ఒకేరీతి సాగితే
నా యీ కథ, కల్లోల బతూ వ్యథ
చెప్పపనే వూండేది కాదు!
దొర యెప్పుడూ ఊళ్ళమ్మట వ్యవహారాలు
పంచాయితీలు, చూస్తూంటాడు,
చుట్టుపక్కల వందయెకరాల కమతం
పాడికి, పంతకి కొదువలేదు!
యింటిప్ట్టునవుండేదే తక్కువ
పనికి వుంచుకున్నాడేకాని
నన్నుంచుకోవాలనుకోలేదెన్నడూ!
అందుకు ఆనందమే అప్పటికి
**
అయితే అడ్డలప్పుడు బిడ్డలు కాని
గడ్డాలప్పుడు కాదుకదా దొర కొడుకులు!
మీసాలు వచ్చాయి కొత్త సాలు తెచ్చాయి!
ఇద్దరి బుద్ధులు వంకరే
అవకాశం కోసం యెదురుచూసారు
కాలంతో పాటు వయసు పరువం
పక్వానికొచ్చాయి
సొంత బిడ్డకు జరిపినట్టే
కొబ్బరాకు చాప – పదిరోజుల వైభవంపేరంటాలు,
పళ్ళు పూలు, సంబరాలు ఆభరణాలు పట్టు పరికిణీలు
యెంత సంబరపడిపోయానో ఆ కాసేపు
గడీ అమ్మాయిగరినైనట్లు
అమ్మా, నాన్న కన్నీరెట్టుకొని,
దొరకు, దొరసానుకి వంగి దండాలెట్టారు
తగిన యీనామూ పట్టుకెళ్లారు!
**
ఆ ఆనందం యెన్నాళ్ళో నిలువలేదు
దొరసాని కాలం చేయటం
కష్టకాలం నాకు దాపురించటం
ఒకే పాలి జరిగిపోయాయి!
దొర ఊరెళ్ళటం చూచి
ఇదే అదును అనుకున్న కొడుకులిద్దరు
దొర మాటలెక్కపెట్టని స్థాయికెదిగారు
కామోసు నా మీదకు రేచు కుక్కల్లా
ఆబగా మీద బడ్డారు!
పదహారు అడుగులెత్తుగల గడీలో
పదహారేళ్ళపిల్లనెలా తప్పించుకోగలను
వాళ్ళకు లొంగి నెల తప్పటం తప్ప!
**
యెంత వజ్రపుటుంగరమైనా
బలవంతంగా బొటనవేలుకు తొడిగితే
ఒర్చుకోగలదా?
నా అరుపులరణ్యరోదనై
పరుపుల మెత్తదనం మధ్య
పరువు పరువున పరువులో కలిసిపోయింది!
కరకు శరాలు లోతుగా దిగబడి
రక్తమోడే సింహపు నోటికి జింకపిల్లలా
విలవిలలాడటం తప్ప యేమెరుగను!
రెండు రోజులు యే అవయవము
సహకరించక జ్వరపీడితురాలనై
కుమిలిపోవటం,
మాటిమాటికి రోకటి పోటుకు
వెరవటంమర్చిపోయేలా మత్తులో ముంచి
వరుస ఆటలాడుకుని కుక్కలు చించిన ఇస్తరిని చేసి
గుచ్చుతున్నప్పుడు, ఆ గిచ్చుళ్లకు నొచ్చుకుంటూ,
ఉపస్థినుండి గుండెలోకి దిగేసినట్లు
గునపాలు ఒదేసినప్పుడు
పడ్డ బాధను ఓర్చుకుంటూ
గుడ్ల నీరుకుక్కుకున్నానేకాని
నోరెత్తేందుకు స్వరానికి సత్తువుంటేకదా
కడుపు దేవురించే వేవిళ్లతో్
కడుపునొవ్వినపుడే తల్లినయ్యానని తెలిసి
గుండే పగిలేలా యేడవాలన్నా
కన్నీళ్ళెన్నడో యింకిపోయాయి!
మనువు కాకుండా నీళ్ళోసుకుందంటే
యెంతలోకువో లోకానికనితలుచుకుని
అనుభవించిన వ్యథ అంతులేనిది
**
దొర ఊరు నుండొచ్చేలోగా
వెధవలిద్దరికి దురాలోచన కలిగి
అర్థరాత్రి ఊరు దాటించి,
యెక్కడో దాచేసారు
యే బేర సారం కుదిరిందో తెలియదు
తెల్లారేపాటికి పెద్దనగరపు
పెద్ద భవంతి చెరలో పడేసారు!
నాలోని వాళ్ళ ఆనావాళ్ళు
బలవంతంగా పెళ్ళగించి
పైశాచికానందంతో
నవ్వుకుంటూ వారు,
అచేతనంగా నేను!
రెండు దిక్కులయ్యాం!
**
నలభై యేళ్ళొచ్చేసరికి
చెరుకు పిప్పినయ్యాను!
యెన్ని చేతులు – చేతలు,
యెన్ని వాతలు – గోళ్ళ రక్కులు,
యెన్ని రాక్షస రతులు,
యెన్ని దుప్పి భోజనాలు,
యెన్ని మాయ మాటలు,
మనువాడతాననే మోసాలు,
నా మానంతో ఆడుకోటానికే,
కేవలం వాడుకోటానికె అని తెలిసేటప్పటికే
యెముకల గూడునయ్యానని
దిష్టి బొమ్మగా కూడ పనికిరానని
వికారిదైందికదా – భవంతికొచ్చిన
డాక్టరు నాకొడుకు చెపితే
సంపాదనకు, సంతానానికి
పనికిరానని నన్ను వదిలించుకోవాలని,
మా నల్లమొద్దు మహంకాళి,
చావుతెలివితేటలు చూపి,
దయగల తల్లిలా
ఐదువేలు చేతిలో పెట్టి కుహనా ఆత్మీయురాలుగా,
నిర్దయగా అర్థ రాత్రే నడిరోడ్డున వదిలేసింది
**
ఆకారానికి ఆడదానినే కాని
యే ఆనందం పందకముందే
అరిగిపోయిన గంధపుచెక్కని కదా
గుట్టు చప్పుడు కాకుండ
గుడెసెలో కాలం వెళ్ళబుచ్చుతూంటే
పోలీసుల దాడిలో లాఠీల ధాటికి చిక్కిన
బక్కదానిని కదా ఠాణాకు చేరాను !
అదే మరో మలుపు
అక్కడున్న అధికారిని చూచి అవాక్కయ్యాను
‘ అక్కా’ తోడబుట్టిన అక్కే నన్ను గుర్తుపట్టి
కన్నీళ్ళసంద్రమై సొంత పూచికత్తుపై విడిపించి
యింటికి వెళ్దాం పదమంది!
రాలేనన్నాను – నా గాలి సోకితే తనకే అవమానమన్నాను
గతించిన దాన్ని తిరిగితోడను
తోడబుట్టిన దానిని కదా తోడుంటాను
అని భరోసా నిచ్చింది
నా కాళ్ళమీద నిలబడేలా ఆసరానిచ్చింది!
**
కొత్తమలుపు మళ్ళి
ముదనష్టపు కాలం కదా యిది
ఉగ్రవాదుల బాంబుదాడికి
ముక్కలై పోతే
దాని పిల్లలకు రెక్కలైనాను
మరో అమ్మను …అమ్మనైనాను
వాళ్ళకి నేనెవరో తెలియనీయలేదు
పరోక్ష కతలాగ జీవిత చిత్రంగా
అన్నిటిని తట్టుకుని నిలిచేలా
ప్రయత్నం చేసూనేవున్నాను
మిమ్మల్ని విసిగించినందుకు
క్షంతవ్యురాలిని
మా లాంటి వారిపై జాలి కాదు
చేతనైన ఆసరా అందివ్వమని
…కోరుకుంటాను.
7.3.2013
రాత్రి 8.07
No comments:
Post a Comment