దేవదాసీలలో రెండు వర్గాలు
దేవదాసీలలో
విష్ణుదాసీలు, శివదాసీలు అని రెండు రకాల వారున్నారు. శివదాసీలు చేసే
నృత్యంలో కరణాంగహారాలు ఉధృతంగా ఉంటాయి. గంభీరమైన భావ ప్రకటనలుంటాయి.
అమ్మవారి ఆలయంలో చేసే నాట్యం దాదాపు ఇలాగే ఉన్నా నాంది క్రమంలో కొద్దిపాటి
తేడాలున్నాయి. వైష్ణవ నృత్యంలో సుకుమార కరణాంగ హారాలుంటాయి. ఆలయంలో నాట్యం
చేసేందుకు బిడ్డనప్పగించడం ఒక ప్రక్రియ. అలా ఇవ్వదలచుకున్న చిన్నారికి 5వ
యేటి నుంచే నాట్యాన్ని పరమ శాస్త్రీయంగా నేర్పిస్తారు. రంగపూజ చేయించి తొలి
అడుగులు వేయిస్తాడు. మరునాటి నుంచి మల్లాము (మలాం-మర్ధన) ప్రారంభ
మవుతుంది. శరీరాన్ని నాట్యానికి అనువుగా మార్చి ప్రతీ అవయవం స్వాధీనంలో
ఉండేలా, ఎలా తిప్పితే అలా తిరిగేలా, ఎలా వంచితే అలా వంగేలా చేసేందుకు ఈ
మలాం ప్రక్రియ ఉపయోగపడు తుంది. రకరకాల నూనెలతో ఒళ్లంతా మర్ధనా చేస్తారు.
వ్యాయామం చేయిస్తారు. ఈ మొత్తం కార్య క్రమం పూర్తి కావడానికి 6 నెలల సమయం
పడుతుంది. ఆ తరువాత అడుగులు వేయడం, 108 కరణ విన్యాసాలు, నవరస అంగహారాలు, 19
రకాల గ్రీవాభేదాలు 3 రకాల దృష్టి భేదాలు, 8 రకాల రస దృష్టి, 8 రకాల
స్థాయీభావ దృష్టులు, 20 రకాల వ్యభిచార భావదృష్టి, 29 రకాల పదవిన్యాసాలు, 32
రకాల స్థానకాలు, 108 తాళాలు, 9 రకాల ఆకాశ చారులు, 16 రకాల భూచారులు, 9
రసాలు, 10 రకాల సాత్విక ప్రదర్శన పద్ధతులు, నాట్య, నృత్య, నృత్త భేదాలు,
లాస్య, తాండవ విన్యాసాలు నేర్పిస్తారు. శృంగ నృత్య విధానం, సప్తలాస్యక్రమం,
కుతువం, పుష్పాంజలి నేర్పిస్తారు. సౌకుమార్యాన్ని సరిదిద్దేంకు నాట్యం
విరమించిన వృద్ధ దేవదాసీని వినియోగిస్తారు. ఈలోగా సంగీతం, సంస్కృతం, మాతృ
భాషలో శిక్షణ ఇస్తారు. ఈ తతంగం ముగియడానికి కనీసం 5 సంవత్సరాల సమయం
పడుతుంది. అంటే పదేళ్లు వచ్చేసరికి శాస్త్ర పరిచయం కలుగుతుంది. ఆలయంలో
నిర్దుష్టంగా నాట్యం చేస్తూ పాటపాడే స్థాయికి చేరడానికి మరో 4 సంవత్సరాల
శిక్షణ ఇస్తారు. ఇవన్నీ పూర్తయి పడుచు ప్రాయానికి చేరాక కళాకారిణికి ముద్ర
ధారణ చేస్తారు.
వైష్ణవంలో ఇలా ముద్ర వేయడాన్ని సమాశ్రేణం అంటారు.
వెండితో చేసిన శంఖం, చక్రం, నామం ముద్రలను నిప్పుతో కాల్చి ఎడమ భుజముపై
శంఖం, కుడిభుజంపై చక్రం, వక్షంపై నామం ముద్రవేస్తారు. ఇది వేయాలంటే
కళాకారిణి అంత వరకు నియమబద్ధమైన జీవితాన్నే గడిపిందని వైష్ణవ గురువుకు
నమ్మకం కలగాలి. అప్పుడే ఆయన ముద్ర వేస్తారు. ముద్రధారణ చేయని వారికి ఆలయంలో
నాట్యం చేసే యోగ్యత వుండదు. ఇంత కష్టపడి నేర్చుకున్న విద్య దేవాలయంలో
ప్రదర్శించడానికి పనికిరాదు. సభలలో నాట్యం చేస్తూ జీవించవచ్చు.
ఆలయ నృత్యానికి మూలస్థంభాలు వీరే!
వైష్ణవ
దేవదాసీలు దేవదేవునికి పుష్పాంజలి సమర్పించేందుకు నాట్యం చేయడం సంప్రదాయం.
ఈ తరహా నృత్యాలను కుతువాలు అంటారు. గణ పతి కుతువం, శుద్ధనాట్యం వంటివి
ప్రద ర్శించాక ధ్వజస్తంభం వద్ద దిక్పాల కారాధన చేసేవారు. ఈ నృత్యాన్ని
నవసంధి నృత్యం, బలిహరణ నాట్యం అని అంటారు. ఈ దిక్పాలకారాధనా నృత్యాలు
ఆలయంలోపలే కాక తిరువీధి దిగ్బంధనం చేసేటప్పుడు కూడా దేవ దాసీలు చేసేవారు.
చెయ్యూరులోని సుంద రేశ్వరస్వామి ఆలయంలో సర్వ వాద్య ఆరాధన చేసేవారు. మొదటి
దీపారాధన నుంచి ఆఖరి దీపారాధన వరకు వివిధ పద్ధతులలో నాట్యం చేసే పద్ధతి మన
ఆలయాలలో ఉండేది. ఆలాప విన్యాసం, వీణానాట్యం వంటివి చేసేవారు.
పదచిత్రం - అపూర్వ ప్రయోగం
వెలమ
ప్రభువుల పాలనలో దేవుడి ఉత్సవాలలో చర్మకట్టు వాద్య నృత్యం చాలా ప్రచారంలో
వుండేది. 25 మంది సన్నాయి వాద్యకులు, 25 మంది మద్దెల వాదకులు ఎదురెదురుగా
నిలబడి వాయిస్తుంటే దాదాపు 100 మంది కళాకారులు చేసే అపూర్వ నాట్య విన్యాసం
చర్మకట్టు వాద్య నృత్యం. కవత నాట్యాలలో మరో ప్రక్రియ తాళచిత్ర నృత్యం. ఈ
నృత్యం చేసేటప్పుడు నాట్యం చేసే కళాకారులు తమ ప ఆదాలకు పరాణి రాసుకుని
నృత్యం చేస్తుంది. నాట్యం పూర్తయ్యే సరికి ఆమె ఏ దేవుని ప్రతి కోసం నాట్యం
చేసిందో ఆ దేవత చిత్రం నేలపై ఏర్పడుతుంది. అంటే నాట్యంతో దేవతామూర్తుల
రూపాలు రచించడం అన్నమాట. ఒక చిత్రలేఖన కారుడు చేత్తో చేసే పనిని ఇక్కడ కళా
కారులు తమ పద పద్ధతులలో చేసి చూపిస్తారన్నమాట. ఇదొక అపూర్వ నృత్య విధానమే
అయినా కాళ్లతో దేవతా మూర్తు లను గీయడమేమి అన్న విమర్శను ఎదుర్కోవడంతో ఈ
విధానికి అంత ప్రోత్సాహం లభించలేదు.
జీవనాడి కూచిపూడి
మనకు
గల వివిధ నాట్య ప్రక్రియలలో అమిత జనాదరణ పొందిన కూచిపూడి నాట్యం. భరతముని
నాట్య శాస్త్రం, నందికేశ్వరుని అభినయ దర్ప ణం, కోహలుని ఉపరూపకం వంటి
గ్రంథాలు మంచి నాట్యానికి, ఇచ్చిన నిర్వచనాలను, పేర్కొన్న మంచి లక్షణా లను
పుణికి పుచ్చుకున్న నాట్యం కూచి పూడి నాట్యం. ఇదొక రసాత్మక కావ్యం. ఎంతో
శక్తి వంతమైన కళారూపం. వేద ప్రవచనం, సంప్రోక్షణ, రంగపూజ, పుష్పాంజలి,
ఇంధ్రద్వజ ప్రతిష్ఠ, వినాయక ప్రవేశం, ప్రావేశిక దరువులు, చూర్ణికలు,
పంచచామరాలు, ధ్రువాలు వంటి అంశాలు మకుటాయ మానంగా కనబడతాయి. నాట్య
శాస్త్రంలో భరతుడు వివరించిన హస్త, పాద, శిరో భేదాలన్నీ కూచిపూడిలో బాగా
కనబడతాయి. అర్థనారీశ్వర నృత్యం కూచిపూడికే ప్రత్యేకం. తాళ, లయ, గతులను
మార్చి మార్చి నృత్యాభినయం చేయడంలో సిద్ధహస్తులు కూచిపూడి నర్తకులు.
తరంగాలలో కనిపించే లయ విన్యాస తాళ విరుపులు కూచిపూడికే ప్రత్యేకం. ఈ
నాట్యంలోనే అడవులు, అడుగులు, చౌకం, కత్తెరనాటు, పక్కనాటు, ఒంటిఅడవు,
జారాడవు, ఉసి అడవు, కుప్పి నిశబ్ద అడవు, చుట్టడవు మండెకొప్పు వంటివి
కనబడతాయి. ఒక్కొక్క చరణాన్ని ఒక్కొక్క రీతిలో ప్రదర్శించే నర్తకులు ఇత్తడి
పళ్లెం అంచున నిలబడి తలపై నీళ్ల చెంబు పెట్టుకుని చేతులలో దివ్వెలు
పట్టుకుని రకరకాల జతులకు నృత్యం చేస్తుంటే ఏదో సర్కస్ చూస్తున్నట్టు
ఉంటుంది చిత్ర విచిత్ర విన్యాసాలు ఆవిష్కార మవుతుంటే ఆశ్చర్యపోవడం
ప్రేక్షకుడి వంతవుతుంది. సమాజానికి నీతి, రీతి చెప్పి భీతిలేని జీవితాన్ని
అనుగ్రహిం చేది, రోజులను ఆనందంగా మలిచి అందించేది కూచి పూడి నాట్యం.
కృష్ణాజిల్లాలోని ప్రధాన నగరం, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడకు 60
కిలోమీటర్ల దూరంలో దివి తాలూకాలోని కూచి పూడి అగ్ర హారం ఈ కళకు
పుట్టినిల్లు. కూచిపూడిలో పుట్టింది కనుకనే దీన్ని కూచిపూడి నాట్యం
అన్నారు. ఈ కూచిపూడి గ్రామాన్ని లోగడ కుశీల పురమని, కుచేల పురమని,
కూచెన్నపూడి అని పిలిచేవారు. కూచిపూడి నాట్యంలో తాండవశైలి కన బడుతుంది.
ఇందులో నాట్యం లలితం గానూ, హస్తపాద విన్యాసాలకు అవకాశం బాగా ఉంటుంది.
చతుర్విధ అభినయాలకు ఆస్కారం ఉంటుంది.
నర్తకులు తమని తామే పరిచయం
చేసుకునే విధానం కూడా కూచిపూడికే సొంతం. పదసంకీర్తన కర్త మహాకవి క్షేత్రయ్య
ఇక్కడే జన్మించాడు. ఇది అతి ప్రాచీన కాలం నుంచి జనజీవన స్రవంతిలో ఉందన
డానికి చారిత్రక ఆధారాలున్నాయి. వాటి ఆధారంగా విశ్లేషించి చూసినపుడు
క్రీ.శ. 200 సంవత్సరం నుండి ఉన్నట్టు అర్థమవు తుంది.
ఆది శంకరుడు మెచ్చిన కూచిపూడి
నాట్యమేళ
నాటకాలు మొదట్లో సంస్కృతంలో, అందునా శైవ సంప్రదా యంలో ఉండేవి. ఆది శంకరుల
వారి ఎదుట శివలీలలు ప్రదర్శించి పరమ భాగవతులని ప్రశంసలు అందుకున్న వారు మన
కూచిపూడి కళాకా రులు. యజ్ఞ యాగాదుల సమయంలో వేదాధ్య యన నృత్యం చేసి రుత్వి
క్కులను, వేద గురువులను మెప్పిం చిన వారు కూడా మన కూచిపూడి కళాకారులే! ఆ
తరువాత వైష్ణవ సంప్రదా యంలో కూడా వచ్చాయి. వైష్ణవ సంప్రదాయా నృత్యాలను అమిత
ప్రభావ భరితంగా తీసుకురా వడంలో కూచి పూడి నాట్య పితామ హుడు సిద్ధేంద్రయోగి
చేసిన కృషి నాన్యతోపమానం. నాట్యమేళ నాటకాలను బాగా రక్తి కట్టించి ప్రజా
ప్రశంస లభించేలా చేసిన వారు కూచిపూడి భాగవతులు. భారత, భాగవత, రామాయణం వంటి
పలు పురాణాలు ప్రజలలోకి వచ్చి విస్తృత ప్రచారం పొందాయంటే అది వీరి పుణ్యమే!
కూచిపూడి నాట్యాలు యక్షగానాలు, నాట్యమేళ నాటకాలు, కూచిపూడి భాగవత మేళాలు
ఇలా బహు రూపాలతో ప్రజలలోకి వచ్చి ప్రతిభావంతంగా ప్రభావం చూపించాయి.
హరవిలాసం, దక్షయజ్ఞం, మార్కండేయ చరిత్ర, గిరిజాకల్యాణం, రామనాటకం,
సీతాకల్యాణం, రావణ గర్వభంగం, చెంచులక్షి, రుక్మాంగద, క్షీరసాగర మథనం,
ప్రహ్లాద చరిత్ర, మోహినీ భస్మాసుర, శశిరేఖాపరిణయం, ఉషాపరిణయం,
రుక్ష్మిణీకల్యాణం, నర్తనశాల, గయో పాఖ్యానం, హరిశ్చంద్ర నాటకం, అలిమేలు మంగ
చరిత్ర, శ్రీనివాస కల్యాణం, ప్రియం వేంకటేశం, చండాలిక, ఇళామాధవీయం,
నౌకాచరిత్రం, శకుం తల, విప్ర నారాయణ, వంటి యక్షగానాలు, రామశబ్దం, కృష్ణ
శబ్దం, మండూక శబ్దం, రామపట్టాభిషేక శబ్దం, తులజాజి శబ్దం, రాజశ్రీ శబ్దం,
జావళిలు, దరువులు, స్వరజతులు, జతిస్వరాలు, స్వరపల్లవులు, కౌత్వాలు
ప్రదర్శించ డంలో కూచిపూడి కళాకారులు సిద్ధహస్తులు. వీటితోపాటు శివనారాయణ
తీర్థులవారి కృష్ణలీలా తరంగిణి, లీలాశు కుని కృష్ణకర్మామృతం, జయదేవుడి
అష్టపదులు, క్షేత్రయ్య పదాలు, అన్నమయ్య, పురందరదాసు, రామ దాసు, త్యాగరాజు,
శామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, స్వాతితిరుణాల్ తదితర వాగ్గేయ
కారుల రచనలకు నృత్యాభినయం చేయడంలో కూచిపూడి కళాకారులు ఘనులు, ఘనపాఠీలు.
సామంతుని సమాధి చేసిన కూచిపూడి
క్రీ.శ.
1685 సంవత్సరంలో కూచిపూడి భాగవతులు గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా
వినోదం కోసం ప్రదర్శించిన భామాకలాపం చూసి ముగ్ధుడైన నవాబు 600 ఎకరాల
విస్తీర్ణంగల మాగాణి భూమిని నజరానాగా ఇస్తూ ఫర్మానా జారీ చేశాడు. కూచిపూడి
నాట్యానికి లభించిన అత్యున్నత పురస్కారం అది. కళకు ప్రయోజనం వినోదమే అయినా
సమాజానికి కర్తవ్యోప దేశం చేయడానికి అది శక్తి వంతమైన ఆయుధంలా
ఉపయోగపడుతుంది. ఆ కర్తవ్యం సామాజిక పరమై నది కావచ్చు. మత ధార్మిక,
ఆధ్యాత్మికపరమైనది కావచ్చు. ప్రజలను చైతన్య వంతులను చేసి వారిలో తిరుగుబాట
భావాలను రేకెత్తించేందుకు, దుర్మార్గంపై దండెత్తేం దుకు అవసరమైన మానసిక
స్థితిని కలిగించేందుకు కూచిపూడి కళాకారులు చేసిన ప్రయత్నం, సాధించిన విజయ
స్వర్ణాక్షరాలతో లిఖించదగినది. సిద్ధవటం ప్రాంతాన్ని విజయనగర మహారాజుల
సామంతుడు గురవరాజు పాలించే రోజులలో ప్రజలు నరకం చూశారు. పన్నులు కట్టకపోతే
ఆయన పరమ కిరాత కుడిగా మారిపోయి అమాను షంగా వ్యవహరించేవాడు. అత్యంత
రాక్షసంగా శిక్షించేవాడు. స్త్రీల స్తనాలను చిరుత పిల్లలతో కొరికించే వాడు.
ఈ దుర్మార్గానికి అంతుపొంతూ లేకుండా ఉండేది. ఆయనను ఎదిరించేందుకు కాని,
మహారాజుకు చెప్పుకునేందుకు కాని సామాన్యులకు ధైర్యం చాలేది కాదు. ఈ
దాష్టికాన్ని కూచిపూడి కళాకారులే విజయనగర చక్రవర్తి వీర నరసింహరాయలు
సమక్షంలో ప్రదర్శించి నేరుగా మహారాజు దృష్టికి తీసుకు వెళ్లారు. ఆ
ప్రదర్శనలో కళాకారులు ఆడదాని స్తనాలకు చిరుతలను పట్టించే సన్నివేశం చూసి
రాయలు మండి పడ్డాడు. ఏమిటీ విపరీతమని ప్రశ్నించాడు. దానికి ఆనాటి కళాకారులు
గురవరాజు కిరాత కాలను ఏకరువుపెట్టారు. రాయలు వెంటనే తన సైన్యాన్ని
సిద్ధవటానికి తరలించి గురవారాజును హత మార్చాడు. రాక్షస పాలన అంతం కావడంతో
ప్రజలు సుఖపడ్డారు. కూచిపూడి కళాకారులు సాధించిన ఈ మహత్తర విజయ గాథను
మాచుపల్లి కైఫియత్తు ఇప్పటికీ పదలంగా దాచి ఉంచింది. పురాణాల వ్యాప్తికి,
ధర్మబోధకు, కర్తవ్యతా స్ఫూర్తిని జనంలో నింపేందుకు, సమయానుకూలంగా హితొ
పదేశాలు చేయడానికి వారు చేసిన కృషిని మానవ సమాజం ఊపిరి వరకు గుర్తుంచు
కోవాలి. మహత్తర సంఘసేవకు, సంస్క రణోద్యమ కారులు కూచిపూడి భాగవ తులు.
మేలమట్టూరుకు ఊపిరి కూచిపూడి
తంజావూరును
పరిపాలించిన తెలుగు రాజులు నాయక రాజులు. ఇది ప్రస్తుతం తమిళనాడులో ఉన్నా
తెలుగు వారి పాలనలో కళా కాంతులు సమకూర్చు కుంది. అచ్యుతప్ప నాయకుడు అనే
నాయకరాజు తమ రాజ్యం లోనూ నాట్యకళను పెంపొం దించాలనే కోరికతో కూచిపూడి నుంచి
కళాకారులను పిలి పించి వారికి అగ్రహారాలిచ్చి ప్రోత్స హించాడు. కొత్తకొత్త
పోకడలు కనిపెట్టేం దుకు నాట్య ప్రక్రి యలకు ఊపిర్లూదేందుకు విశేషకృషి
చేశారు ఆనాడు కూచిపూడి కళా కారులు జీవించిన ఊరే నేడు మేల మట్టూరుగా
పిలవబడుతోంది.
పురుషాధిపత్యం నుంచి యువతుల చేతికి
మొదట
ఈ నాట్యకళ పురుషులకే పరిమితమై ఉండేది. స్త్రీ పాత్రలను సైతం పురుషులే
పోషించే వారు. స్వర్గీయ షట్ భరతశాస్త్ర కళానిధి బ్రహ్మశ్రీ వేదాంతం
లక్ష్మీనారాయణ శాస్త్రిరాకతో పెను మార్పులు చోటుచేసుకుని కూచిపూడిలో
స్త్రీలకు ప్రవేశంలభించి నూతన శకం ఆరంభమైంది. ఇప్పుడు కూచి పూడి నాట్యం
దాదాపుగా స్త్రీలకే అంకితమై పోయింది. ఒకనాడు దేవస్థానాలకు, రాజాస్థా నాలకు,
సామాన్య ప్రజలకు మాత్రమే పరిమిత మైన కూచిపూడి నాట్యం ఈనాడు ఇంట గెలిచిన ఈ
కళ ఇప్పుడు రచ్చ గెలు స్తోందంటే, విశ్వకళా వేదికనెక్కి విశ్వ రూపం
ప్రదర్శిస్తోం దంటే దాని వెనుక ఎందరో మహాను భావులు జీవి తాలు అంకితం చేసి
చేసిన కృషి కారణం. ఈ రోజున ఎక్కడికెళ్లిన కూచిపూడి ఆర్ట్ అకాడమీలు కన
బడుతున్నా యంటే, దీన్ని నేర్చు కోవాలని పలువురు ఉత్సాహం చూపతు న్నారంటే
గతకాలపు రుషి తుల్యులైన మహానుభావుల అవిరళ కృషే ప్రేరణం.
ఆటపాటల మహాప్రవాహం
బృందంగా
ఏర్పడి నాట్యం చేయాలన్నా, ఒకే నర్తకి వివిధ సాహిత్య ప్రక్రియలను అభినయిం
చాలన్నా కూచిపూడి ఎంతో అనువై నది. శబ్దాలు, తరంగాలు, అష్టపదులు, జావ ళులు,
తిల్లానాలు మహా పవాహంలో వచ్చి ప్రేక్షకులకు కను విందుచేస్తాయి. కనుక ఒకే
నర్తకి ప్రేక్షకుల ముందు ఎంత సేపు నాట్యం చేసినా విసుగు విరక్తి పుట్టదు.
ఒక కళా కారుడు తనలోని బహుముఖ ప్రతిభా విశేషాలను ప్రదర్శిం చాలన్నా, పలువురు
కళాకారులు పోటీపడి నటించి సహజ హావభావాలను, విభిన్న శరీరధర్మాలతో
ప్రదర్శించాలన్నా కూచిపూడికి మించిన కళా ప్రక్రియ మరొకటి లేదు. నృత్య
నాటకంలో సందర్భానుసారంగా
పాటలు వస్తాయి. అలా వచ్చిన వాటిని
అభినయించడం తేలికే! కానీ ఒక పాత్ర కోసం విడిగా రాసినపాటను విడిగా వేదిక మీద
అభినయించడం కష్టమే అయినా దాన్నీ జనరంజకంగా అందించే అవకాశం కూచిపూడిలో
ఉంది. పాటను విడిగానూ కథాసంబంధంగానూ విని ఆనందించ గలుగుతున్నప్పుడు,
నాట్యంలో ఇలా విడదీసి అభినయించలేమో అన్న ఆలోచనే వాటిని విడివిడిగా
నటించేందుకు, నటన మాడేందుకు కారణమైంది. ఇప్పుడు టీవీలలో సినిమాలు, సినిమా
పాటలు విడివిడిగా వచ్చి వీక్షకు లను అలరిసు ్తన్నాయంటే ఆ ఆలోచనకు ప్రాథమిక
ఆలోచన కూచిపూడిలోనే ఉంది. కూచి పూడి ఇంత విస్పష్టంగా హావభా వాలను పలికించి
జనాన్ని ఆకట్టుకుంటో దంటే దానికి కారణం హస్తాభినయాలు! ఇవే కూచిపూడికి
ప్రాణం. ఒకరు చేసినా, పలువురు కలిసి చేసినా, నృత్యంగానైనా, నృత్యనాటకం
గానైనా కూచిపూడి రకి కడుతోందంటే అందుకు కారణం ఈ ప్రక్రియలో సంగీత, సాహిత్య,
నృత్య కళలు సమ ఉజ్జీలుగా చేతులు కలిపి నడ వడమే!
కలాపాలు-తరంగాలు
కూచిపూడి
నాట్యం చూడాలని ఆసక్తి గలిగిన వారికి తరుచూ వినిపించే, కనిపించే
నృత్యనాటకాలు కలాపాలు, తరంగాలు. కలాపం అంటే కలత, కలహం అని అర్థం. ఆడపిల్ల
గోడు వెళ్ల బోసుకోడాన్ని కూడా కలాపం అనే అంటారు.
వేదిక మీద
ప్రదర్శించే భామాకలాపంలో భామ కలాపానికి భాగవత కథ నేపథ్యంగా వుంటుంది.
కలాపాలలోనూ బహు జనాదరణ పొందినది భావాకలాపం, గొల్లకలాపం.
భామాకలాపం
రమణీయ శృంగార దృశ్య కావ్యం. అపురూప నృత్యనాటకం. ఈ పేరులో కనిపించే భామ
శ్రీకృష్ణుని ప్రియభామ సత్యభామ. ఈ నాటకం పేరెత్తగానే మన చెవిలో వినిపించే
గీతం 'భామనే సత్యభామనే'. దీన్ని సిద్ధేంద్రయోగి రచించాడు. తొమ్మిది
రాత్రులు ఏకధాటీగా సాగే తొలి తెలుగు నృత్యనాటకం ఇది. అష్ట విధ నాయికలకు,
నవరసాలకు, చతుర్విధ అభినయాలకు ఎంతో అవకాశం కల్పించి రూపొందించిన నృత్యనాటకం
ఇది. ఇందులో నాయిక విప్రలబ్ధ. మంచి ఆహార్యానికి, అభినయానికి అపార అవకాశం
ఉన్న నృత్య నాటకం ఇది. 1685లో ఈ నాటకం చూసి నిజాం నవాబు అబుల్ హసన్
తానీషా ఆ నాటకం వేసిన కళాకారులు యజ్ఞన్న, నరసన్న, సూరన్నలకు 600ల ఎకరాలు
నజరానాగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ నాటకం పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల
నెక్కి మేధావుల, కళాభిమానుల ప్రశంసలు పొందుతునే ఉంది. ఇందులో అభినయించిన
కళాకారులకు లభించని సత్కారం లేదు. వీరి కీర్తి ప్రతిష్ఠలకు మేరలేదు.
గొల్లకలాపం
: 'షట్సాస్త్రాలకు నిలుకడ, వడగట్టిన అలంకార భరత శాస్త్రం గొల్లకలాపం' అని
విశ్వనాథ సత్యనారాయణ వంటి కవిసామ్రాట్టులు సైతం ప్రశంసించకుండా ఉండలేక
పోయిన రమణీయ నృత్య నాటకం గొల్లకలాపం. యక్షగాన సంపూర్ణ రూపమే గొల్లకలాపం.
భామాకలాపంగాగే బహు జనాదరణ పాత్రమైన ఆస్తిక వాద నృత్యనాటకం ఇది. గోపికకు, ఒక
బ్రాహ్మణునకు జరిగిన సంవాదమే ఈ నాట కానికి ఇతివృత్తం. పుట్టుకతోనే ఎవ్వరూ
బ్రాహ్మణులు కారని, సత్కర్మలు చేసే వారే బ్రాహ్మణత్వం అందుకొ గలుగు తారని
సోదాహరణంగానిరూపించే నాటకం ఇది. ఇందుకోసం అనేకానేక ఉదాహరణలు ఇందులో
పొందుపరి చారు. నాట్య భారతికి ఆంధ్రులు సమర్పించిన నృత్య నీరాజనం గొల్ల
కలాపం. ఈ నాటక కర్తృత్వంపై వివాదం ఉంది దీన్ని కూడా సిద్ధేంద్రయోగి
రచించారని కొందరు అంటున్నా కాదని చాలా మంది వాదిస్తున్నారు. వెంకటేశ్వరుని
భక్తురాలు తరిగొండ వెంగమాంబ గొల్లకలాపం అనే నృత్య నాటకం రాసిందని కొందరు
చెబుతున్నారు. రాసింది ఎవరైనా తెలుగువారు గర్వించదగ్గ నాటకం ఇది అనడంలో
ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాగా భామాకలాపం అంత సుకుమార సుంద రంగా కాక కొంత
క్లిష్టంగా ఉంటుంది. హిందూ నాగరికత, సంస్కృతి, వేదాంత చర్చ వంటి
అంశాలుంటాయి. మేధావుల మెదడుకే మేతవేయగల అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. యజ్ఞ,
యాగాలు, వాటి విధి, విధానాలు, అందులో చదివే మంత్రాలు, వాటి ఉచ్ఛారణ వగైరాలు
ఇందులో ఉంటాయి. అందువల్ల ఇది కళాకారులకు కూడా కత్తిమీద సాములా ఉంటుంది. ఈ
నాటకాన్ని జనబాహుళ్యం లోకి తీసుకు రావ డానికి బ్రహ్మశ్రీ వేదాంతం
లక్ష్మీనారాయణ శాస్త్రి విశేష కృషి చేశారు. కూచిపూడి నాట్యం ఆడవాళ్లకు అందు
బాటులోలేని సమయంలో దీన్ని ఆడవాళ్లకు నేర్పడం ద్వారా విప్లవం తెచ్చిన
శాస్త్రిగారు అనేకమంది దేవదాసీలకు నేర్పి విస్తృతంగా ప్రదర్శన లిప్పించారు.
ఏ పనిచేసినా సలక్షణంగా, విలక్షణంగా ఉండాలని భావించి పాటుపడే శాస్త్రిగారు
నూత్న ప్రియులు.
ఇక తరంగాల విషయానికి వస్తే మనకు వెనువెంటనే
గుర్తుకు వచ్చేది నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలా తరంగిణి యక్షగాన
దృశ్య ప్రబంధం. 'కృష్ణం కలయ సఖి సుందరం' గీతం. 12 అంకాలు, ఒకొక్క అంకంలో
దాదాపు 156 తరం గాలు, 27 గద్యలు, 319 పద్యాలు గల మహత్తర ఆధ్యాత్మిక, భక్తి
రస ప్రధాన రచన ఇది. తరంగం అంటే అల అని అర్థం. సముద్రంలో అలలు ఒకదాని తరువాత
ఒకటి ఎలాగైతే ఉప్పొంగుతూ వస్తాయో అలాగే భక్తి, భావ, రాగ, తాళాలు వరసగా
వస్తాయి. తరంగాలలో కనిపించే లయ విన్యాస తాళ విరుపులు కూచిపూడి నాట్యానికి
కొసమెరుపులు. ఒకొక్క చరణాన్ని ఒక్కక్క రీతిలో ప్రదర్శించే నర్తకులు ఇత్తడి
పళ్లెం అంచున నిలబడి తలపై నీళ్ల చెంబు పెట్టుకుని చేతులలో దివ్వెలు
పట్టుకుని రకరకాల జతులకు నృత్యం చేస్తుంటే చిత్ర విచిత్ర విన్యాసాలు
ఆవిష్కారమవుతుంటాయి. వాటిని చూసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుడి వంతవుతుంది.
- శ్రుతకీర్తి